నాగపూర్ లో లాక్ డౌన్.. అజాగ్రత్తగా ఉంటే మనకూ తప్పదు

Update: 2021-03-12 04:37 GMT
ఎక్కడ మొదలైందో మళ్లీ అక్కడికే చేరితే ఎలా ఉంటుంది? ఇప్పుడు నాగపూర్ పరిస్థితి ఇంచుమించు ఇలానే ఉంది. గత ఏడాది మార్చి చివర్లో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధించటం.. కరోనా కేసులు పెరగకుండ ఉండేందుకు తీసుకున్న చర్యలు అంతో ఇంతో మేలు చేశాయి. అన్ లాక్ తర్వాత అంతకంతకూ పెరుగుతున్న నిర్లక్ష్యం.. కరోనా మహమ్మారికి చెక్ పెట్టే ముందస్తు జాగ్రత్తలు పెద్దగా తీసుకోకపోవటంతో పరిస్థితి ఇప్పుడు మొదటికి వచ్చినట్లుగా కనిపిస్తోంది.

రోజుకు లక్షకు పైగా కేసుల స్థాయి నుంచి పన్నెండు వేలకు తగ్గిపోయిన పరిస్థితి. గడిచిన కొద్దిరోజులుగా పెరుగుతున్న కేసుల పుణ్యమా అని తాజాగా రోజులో ఏకంగా 22,854  కేసులు నమోదైన పరిస్థితి. ఈ మొత్తం కేసుల్లో అత్యధికం మహారాష్ట్ర వాటానే ఎక్కువగా ఉండటం గమనార్హం. అంతకంతకూ పెరుగుతున్న కేసులకు చెక్ పెట్టేందుకు వీలుగా నాగపూర్ జిల్లాలో ఈ నెల 15 నుంచి 21 వరకు కఠిన లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

లాక్ డౌన్ వేళ ప్రైవేటు సంస్థలన్నిమూతపడగా.. ప్రభుత్వ సంస్థలు మాత్రం 25 శాతం సిబ్బందితోనే నడుస్తాయని వెల్లడించారు.  నిత్యవసర షాపులు మాత్రం తెరిచే ఉంటాయని మహారాష్ట్ర సర్కారు స్పష్టం చేసింది. పెరుగుతున్న కేసులకు చెక్ చెప్పేందుకే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు శివసేన సర్కారు వెల్లడించింది.దేశంలో అత్యధిక కరోనా కేసుల నమోదులో మహారాష్ట్ర మొదటిస్థానంలో నిలవగా.. ఆ రాష్ట్రంలో నాగపూర్ జిల్లా ముందుంది. దీంతో.. ఆ జిల్లాలో లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక.. రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. ఇటీవల కాలంలో కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నాయి. నిర్లక్ష్యాన్ని వదిలి.. జాగ్రత్తలు తీసుకోకుంటే.. పరిస్థితి మళ్లీ మొదటికి రావటం ఖాయమన్నమాట బలంగా వినిపిస్తోంది. సో.. బీకేర్ ఫుల్.
Tags:    

Similar News