ఆ కలల దీవి పేరు హ్యూమన్‌ బీయింగ్స్‌

Update: 2015-09-08 03:43 GMT
అన్నీ అనుకున్నట్లుగా జరిగితే.. ఇటలీ ప్రభుత్వం సహకారం సవ్యంగా అందితే.. విషాదాన్ని చూసి వేల కోట్ల రూపాయలైనా పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్న సంపన్నుడి మనసు మారకుండా ఉంటే.. ఈ ప్రపంచంలోనే ఒక కొత్త రూపుతో ఆవిష్కృతం కాబోయే ఒక దీవిపేరు 'హ్యూమన్‌ బీయింగ్స్‌' అవుతుంది. ఈ దీవి మొత్తం ఒకే విధమైన కష్టనష్టాలను అనుభవించి వచ్చిన ప్రజల కుటుంబాలు మాత్రమే ఉంటాయి. వారి జీవితాల్లో తిరిగి వెలుగు నింపడానికి చేసిన ఏర్పాటు మాత్రమే ఉంటుంది. అంతకు మించి.. మరో వ్యాపారం గానీ, మరో వంచన గానీ, వారిని మరో దుర్మార్గం వైపు వాడుకోవడం గానీ ఎంతమాత్రమూ ఉండదు. కేవలం మానవత్వం ఒక్కటే ప్రాతిపదికగా ప్రస్తుతం ప్రతిపాదనల దశలో ఉన్న ఈ దీవి 'హ్యూమన్‌ బీయింగ్స్‌' ఆచరణ రూపం దాలిస్తే.. ఎంతో బాగుంటుందని పలువురు అనుకుంటున్నారు.

దీనికి సంబంధించిన వివరాల్లోకి వెళితే..

కొన్ని రోజుల కిందట టర్కీ సముద్ర తీరంలో మూడేళ్ల చిన్నారి శవం పడి ఉన్న ఫోటోలు యావత్‌ ప్రపంచ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించాయో అందరికీ తెలుసు. వలసకుటుంబాల వ్యథార్త జీవితాలకు అది నిదర్శనంగా ఆ దుర్మార్గం ప్రపంచం కళ్లకు కట్టింది. మానవతా వాదులందరి కళ్లు చెమ్మగిల్లాయి. అయితే ఈజిప్టుకు చెందిన ఒక సంపన్నుడు మాత్రం కాస్త భిన్నంగా స్పందించారు. గ్రీస్‌, ఇటలీల్లో పెద్దసంఖ్యలో ఖాళీగా ఉన్న వాటిలో ఒక దీవిని పూర్తిగా తనకు అమ్మినట్లయితే దాన్ని కొనుగోలు చేసి సిరియా నుంచి వలస వచ్చే వారికోసం ఆశ్రయం కల్పించడానికి సిద్ధంగా ఉన్నానని ఈ పెద్దాయన అంటున్నారు.

ఈజిప్టులో ఒరాన్‌ కాం టెలికాం నెట్‌ వర్క్‌ అధినేత సావరీన్‌ చేస్తున్న ప్రతిపాదన ఇది. ఒక దీవి మొత్తాన్ని ఇలాంటి నిరాశ్రయులకు కేటాయించి వారికి ఆశ్రయం ఉపాధి, స్కూళ్లు, ఆస్పత్రులు అన్నీ అక్కడ తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆయన అంటున్నారు. ఆ దీవిని కూడా కొనుక్కోవడానికే సిద్ధపడుతున్నారు. వలసదారులకు అక్కడ అన్ని అవసరాలు, సదుపాయాలు కల్పిస్తానని చెబుతున్నారు. దానికోసం వంద మిలియన్‌ డాలర్ల వరకు ఖర్చుచేయడానికి ఆయన వెనుకాడకపోతుండడం విశేషం. వలసదారులకు అదే దీవిలో ఉండాలనే నిబంధన ఏమీ లేదని.. ప్రభుత్వం దీవిని అమ్మితే... తక్షణం తాత్కాలిక సదుపాయాలు ఏర్పాటుచేసి.. ఆ తర్వాత.. శాశ్వత నివాసాలు కల్పిస్తానని అంటున్నాడు. ఆపదలో ఉన్న ఆర్తులను ఆదుకోదలచిన సావరీన్‌ ఈ దీవికి 'హ్యూమన్‌ బీయింగ్స్‌' అని పేరు పెట్టదలచుకోవడం అభినందనలు అందుకుంటోంది.
Tags:    

Similar News