ఓదేలుకు వరాలు..కార్యకర్తలకు గాయాలు..!

Update: 2018-09-14 17:03 GMT
ఏ పార్టీకి అయినా.... నాయకులకైనా కార్యకర్తలే బలం. బలగం. అయితే ఆ బలం ఒక్కోసారి మితిమీరితే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర సమితిలో జరిగిన.... జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. కార్యకర్తలంటే వాడుకుని వదిలేయాలే తప్ప.... వారి గురించి పెద్దగా ఆలోచించకూడదని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ప్రపంచానికి ఓ కొత్త సందేశం ఇచ్చారు. ఇందుకోసం తాము లాభ పడాలే తప్ప కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తమకు అవసరం లేదని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి ముందస్తు ఎన్నికలకు చాలా త్వరగానే వెళ్తోంది. ఏకంగా 105 మంది అభ్యర్ధులను ప్రకటించింది కూడా. ఇందులో చాలా నియోజకవర్గాల్లో సిట్టింగులకు తిరిగి టిక్కట్లు ఇచ్చినా... కొన్ని చోట్ల మాత్రం టిక్కట్లు ఇవ్వలేదు. అలాంటి నియోజకవర్గమే చెన్నూరు. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలును కాదని లోక్‌సభ సభ్యుడు బాల్క సుమన్ కు టిక్కట్ కేటాయించింది తెలంగాణ రాష్ట్ర సమితి అధిష్టానం. అంతే తనకు టిక్కట్ దక్కకపోవడంతో ఆయన అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ఆయన అయితే సరే... కార్యకర్తలను మండించారు. దీంతో తమ నాయకుడి కోసం ఓ సామాన్య కార్యకర్త ఒంటికి నిప్పుపెట్టుకున్నారు. అంతేనా.... తన పక్కనే ఉన్న మరో 15 మందికి కూడా ఆ నిప్పు తగిలించారు. వారంతా కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సరిగ్గా ఇదే సమయానికి అధిష్టానం నుంచి పిలుపు అందుకున్న ఓదేలు పార్టీ అధినేతతో సమావేశమయ్యారు. ఆయన వరాలు గుప్పించారు. ఈయన చిరునవ్వులు చిందించారు. చెన్నూరు అసంత్రప్తి కథ కంచికి... ఓదేలుకు వరాల జల్లు ఆయన ఇంటికి. ఇంత వరకూ చెన్నూరు నియోజకవర్గం అనే సినిమా కథ సుఖాంతమైంది.

సినిమా అయిపోయినా ఒళ్లు కాల్చుకున్న 16 మంది గాయాలకు చికిత్స పొందుతూ ఆసుపత్రిలో నానా హైరానా పడుతున్నారు. తమకోసం కాని.... తమను కన్న వారి కోసం కాని.... కట్టుకున్న వారు.... తమ పిల్లల కోసం కాని ఇంతటి ఘోరాలకు పాల్పడని కార్యకర్తలు తమను పట్టించుకోకుండా స్వలాభం కోసం పని చేస్తున్న నాయకుల కోసం ఇంతటి పని చేయడం ఏమిటని తెలంగాణ రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఒకవేళ నిప్పంటుకున్న 16 మందిలో ఎవరికైనా... జరగరానిది జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. తాను మరో  ఐదేళ్లు అధికారంలో కొనసాగేందుకు ముందస్తుకు వెళ్లిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పార్టీ నాయకుల మధ్య సయోధ్య కుదర్చడం సరే.... తమ నాయకుల కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సిద్ధపడేందుకు ముందుకు వచ్చిన కార్యకర్తలను పట్టించుకోరా అని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. సరే.... నాయకులు...వారి విధానాలు... వారి అధికార దాహం ఇప్పటికైనా అనుచరులు తెలుసుకుంటే మంచిదని, లేకపోతే ఇదిగో ఇలాంటి దుందుడుకు చర్యలు జరుగుతాయని వారంటున్నారు. ఇకనైనా కార్యకర్తలు మేలుకోకపోతే నాయకులకు వరాలు....కార్యకర్తలకు గాయాలు తప్పవని అంటున్నారు.

Tags:    

Similar News