నల్లపురెడ్డి సంచలనం..తిట్టినోళ్లకే జగన్ పదవులిచ్చారట

Update: 2020-01-21 16:58 GMT
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వైసీపీలో అంతా హ్యాపీగానే ఉన్నారని ఇప్పటిదాకా అనుకున్నాం. అయితే అన్ని పార్టీల్లాగే వైసీపీలోనూ అసమ్మతి రాజుకుంటోందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. మంత్రి పదవులు దక్కని పార్టీ సీనియర్లు ఇప్పటిదాకా అసలు నోరే విప్పిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు గానీ... ఇప్పుడిప్పుడే మొదలవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో బాగంగా తొలి అసమ్మతి గళం... నెల్లూరు జిల్లా నుంచి వినిపించింది. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యేగా పార్టీ సీనియర్ నేత నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇప్పుడు తన అసమ్మతి గళాన్ని వినిపించారు. తిట్టినోళ్లకే జగన్ పదవులు ఇస్తూ పోతున్నారని, పార్టీలో ముందు నుంచి కొనసాగుతున్న వారి కంటే కూడా తర్వాత చేరిన వారికే పదవులు, అవకాశాలు కట్టబెడుతున్నారని నల్లపురెడ్ది సంచలన వ్యాఖ్యలు చేశారు.

అయితే ఇదేదో బహిరంగంగా నల్లపురెడ్డి మాట్లాడ లేదు గానీ.. తన వద్దకు వచ్చిన తన సన్నిహితులు, తన నియోజకవర్గ ప్రజల వద్ద ఇష్టాగోష్టిగా మాట్లాడిన సందర్భంగా నల్లపురెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారట. ప్రత్యేకించి తన సొంత జిల్లాకే చెందిన ఆనం బ్రదర్స్ కు జగన్ ఇస్తున్న ప్రాధాన్యాన్ని నల్లపురెడ్డి ప్రధానంగా ప్రస్తావించారట. ఆనం ఫ్యామిలీతో పాటు జగన్ కేబినెట్ లో కీలక మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు పార్టీలోనే కాకుండా కేబినెట్ లోనూ దక్కుతున్న ప్రాధాన్యాన్ని ప్రస్తావించిన నల్లపురెడ్డి... జగన్ ఫ్యామిలీ పట్ల తన నోటి దురుసును చూపిస్తున్నా కూడా బొత్సకు జగన్ మంత్రి పదవులు ఇస్తున్నారని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారట.

అయినా ఈ దిశగా నల్లపురెడ్డి నోట నుంచి ఎలాంటి కామెంట్లు వచ్చాయన్న విషయానికి వస్తే... ‘తనను తిట్టిన వారికే జగన్ పదవులు ఇచ్చారు. పార్టీలో తొలి నుంచి ఉన్న తనను మాత్రం పక్కనబెట్టారు. గతంలో జగన్ ను ఉరి తీయాలంటూ ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానందరెడ్డి అన్నారు. అయినప్పటికీ వారిని పార్టీలో చేర్చుకున్నారు. జగన్ తల్లి విజయమ్మను బొత్స సత్యనారాయణ... విజయ అని సంబోధిస్తారు. పార్టీలో ముందు వచ్చిన వారిని కాదని వెనుక వచ్చిన వారికి మంత్రి పదవులు ఇచ్చారు’ అని నల్లపురెడ్డి సంచలన వ్యాఖ్యలే చేశారట. మరి నల్లపురెడ్డి వ్యాఖ్యలపై జగన్ ఏమంటారో చూడాలి.
Tags:    

Similar News