తుమ్మ‌ల...ద‌మ్ముంటే మంత్రి ప‌ద‌వికి రాజీనామా చెయ్‌

Update: 2016-04-21 12:28 GMT
ఖమ్మం జిల్లా పాలేరు అసెంబ్లీకి జరగనున్న ఉప ఎన్నిక సమరంలో వేడి రాజుకుంటుంది. మంత్రి పదవిలో ఉన్న తుమ్మల నాగేశ్వ‌ర‌రావు పాలేరులో పోటీ చేయటంపై ప్రతిపక్షాలనుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోంది. దీంతో ఇరు నాయకుల మధ్య జిల్లాలో మాటల తూటాలు పేలుతున్నాయి.

ఇప్ప‌టి వరకు ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు చనిపోతే...ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే సంప్రదాయం ఉంది. కానీ టీఆర్ఎస్ అలా చేయకుండా అభ్యర్ధిగా తుమ్మలను నిలబెట్టడం సరికాదని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పదవిలో ఉండగా మరణించిన ఎమ్మెల్యే కుటుంబానికి ఆ స్థానాన్ని ఏకగ్రీవంగా కట్టబెట్టాలన్న సంప్రదాయాన్ని టీఆర్ఎస్ వ్యతిరేకించటం, పాలేరు నుంచి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును తమ పార్టీ అభ్యర్థిగా ప్రకటించటం, ఆ జిల్లా ఎన్నికల ఇన్ చార్జ్‌గా టీఆర్ఎస్ యువనేత కేటీఆర్‌ను దించటం ప్రతిప‌క్షాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.

ఈ క్రమంలో తుమ్మలపై టీడీపీ నేత నామా నాగేశ్వ‌ర‌రావు విరుచుపడ్డారు. తుమ్మలకు నామా సవాల్ విసిరారు. టీడీపీని వాడుకుని వదిలేసిన తుమ్మలను ఓడించి తీరతామన్నారు. ఇందుకోసం తమతో ఇతర విపక్షాలన్నీ కలిసిరావాలని ఆయన పిలుపునిచ్చారు. తుమ్మలకు దమ్ముంటే ఎమ్మెల్సీ పదవితో పాటు మంత్రి పదవికి కూడా రాజీనామా చేసి బరిలోకి దిగాలన్నారు. అధికార పార్టీ బెదిరింపులకు తాము బెదిరేది లేదని ప్రకటించిన నామా... పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే, పాలేరు బరికి తాను సిద్ధమేనని ప్రకటించారు.
Tags:    

Similar News