ర‌జ‌నీ పార్టీ పేరు కూడా ఖరారైందే

Update: 2017-12-30 11:44 GMT
సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ డిసెంబ‌ర్ 26 నుండి చెన్నైలోని ప‌లు ప్రాంతాల‌లో ఫ్యాన్స్ మీట్ ఏర్పాటు చేసి - అక్క‌డి అభిమానుల‌తో ఇంట‌రాక్ట్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. డిసెంబర్ 31న తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేస్తాన‌ని రజనీయే ప్ర‌క‌టించ‌డంపై ప్ర‌స్తుతం ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. గ‌త ఐదు రోజులుగా ర‌జ‌నీ ప్ర‌త్యేకంగా త‌మిళ‌నాడు వ్యాప్తంగా ఉన్న అభిమానుల‌తో మంత‌నాలు సాగిస్తున్నారు. ఈ మంత‌నాల్లో మంచి- చెడు స‌హా రాజ‌కీయాల‌కు సంబంధించిన విష‌యాల్ని చ‌ర్చిస్తున్నారు. స్థూలంగా సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీకాంత్ కొత్త పార్టీ పెట్ట‌బోతున్నారా అంటే అవున‌నే సంకేతాలు వెలువ‌డుతున్నాయి.

సూప‌ర్‌ స్టార్ ర‌జ‌నీ 60వ ప‌డిలోనూ ఎంతో ఉత్సాహంగా క‌నిపిస్తున్నార‌ని - చెన్నై కోడంబాక్కం రాఘవేంద్ర కళ్యాణ మండపంలో రోజుకు వెయ్యిమంది పైగా ఫ్యాన్స్‌ను క‌లుస్తూ బిజీగా గ‌డుపుతున్నార‌ని చెప్పుకుంటున్నారు. ఈ మీటింగుల్లో ప్ర‌ధానంగా రాజ‌కీయ‌ప‌ర‌మైన చ‌ర్చ‌లే సాగుతున్నాయి. కొత్త పార్టీ పెట్టాలా? పెడితే టైటిల్ ఏంటి? పాల‌సీ - విధివిధానాలేంటి? ప్ర‌స్తుతం త‌మిళ రాజ‌కీయాలెలా ఉన్నాయి? మ‌నం వ‌స్తే ప‌రిస్థితేంటి? ఎవ‌రితో పొత్తు పెట్టుకుంటే లాభం? ఏం చేయ‌క‌పోతే న‌ష్టం? ఇలా అన్నికోణాల్లో కూలంకుశంగా ర‌జ‌నీ ప‌లువురు రాజ‌కీయ విశ్లేష‌కుల్ని అడిగి తెలుసుకుంటున్నార‌ట‌. ఈ చ‌ర్చ‌ల ప్ర‌కారం ర‌జ‌నీ ఇప్ప‌ట్లో రాజ‌కీయాల్లోకి వ‌చ్చే స‌న్నివేశం లేద‌ని కొంద‌రు విశ్లేషిస్తుంటే, ఆయ‌న పార్టీని ప్ర‌క‌టించ‌డం ఖాయ‌మ‌న్న సంకేతాలు కొన్ని మీడియాలు ఇస్తున్నాయి. ఇప్ప‌టికే భారీగా ఫ్యాన్స్ మోహ‌రింపు మ‌ధ్య ర‌జ‌నీ చేస్తున్న మంత‌నాలు ప‌లు ప్ర‌శ్న‌ల్ని జ‌వాబు లేని శేష ప్ర‌శ్న‌లుగానే మిగ‌ల్చ‌డం తమిళ‌నాడు వ్యాప్తంగా స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొనేలా చేసింది.

ఇదిలాఉండ‌గా...ఇలా చ‌ర్చిస్తున్న క్ర‌మంలోనే ఆస‌క్తిక‌రంగా కొత్త పార్టీ టైటిల్ కూడా తెర‌మీద‌కు వ‌చ్చేసింది. త‌న పార్టీకి `రజనీ పేరవై` పేరును సూప‌ర్ స్టార్ ప‌రిశీలిస్తున్నార‌ని తెలుస్తోంది. ఆర్కే నగర్ ఫలితం నేపథ్యంలో రాష్ట్రంలో మారుతున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణాల‌పైనా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. బీజేపీతో క‌లవ‌డం ర‌జ‌నీ అభిమానుల‌కు ఏమంత రుచించ‌డం లేద‌ని చెబుతున్నారు. స్థూలంగా పొలిటిక‌ల్ ఎంట్రీపై మాత్రం ఇదిగో వ‌చ్చేస్తున్నాం అన్న ప్ర‌క‌ట‌న లేక‌పోవ‌డంతో అభిమానుల్లోనే బోలెడంత క‌న్ఫ్యూజ‌న్ నెల‌కొంద‌ని త‌మిళ మీడియా చెబుతోంది.
Tags:    

Similar News