ముగిసిన ర‌థ సార‌ధి అంత్య‌క్రియ‌లు!

Update: 2018-08-30 12:48 GMT
టీడీపీ మాజీ పాలిట్ బ్యూరో స‌భ్యుడు, మాజీ రాజ్య‌స‌భ స‌భ్యుడు, సినీ న‌టుడు నందమూరి హరికృష్ణ అంతిమ సంస్కారాలు జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో కొద్ది సేప‌టి క్రితం ముగిశాయి. హ‌రికృష్ణ పార్ధివ దేహానికి తెలంగాణ ప్రభుత్వం.... అధికారిక లాంఛనాలతో  అంత్య‌క్రియ‌లు నిర్వహించింది. కుటుంబ స‌భ్యులు - టీడీపీ కార్య‌క‌ర్త‌లు -  రాజ‌కీయ‌ - సినీ ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో అంత్య‌క్రియ‌లు ముగిశాయి. హరికృష్ణ  రెండో కుమారుడు కల్యాణ్‌రామ్ ఆయ‌న చితికి నిప్పంటించారు. త‌మ అభిమాన న‌టుడు, నేత హ‌రికృష్ణ క‌డ‌సారి చూపున‌కు వేలాది మంది కార్య‌క‌ర్త‌లు, అభిమానులు మ‌హా ప్ర‌స్థానానికి త‌ర‌లి వ‌చ్చారు. మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్రారంభ‌మైన అంతిమ యాత్ర కొద్ది సేప‌టి క్రితం ముగిసింది. ఏపీ సీఎం చంద్రబాబు -  జయకృష్ణ - బాలకృష్ణ - సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ జాస్తి చలమేశ్వర్‌ తదితరులు మహాప్రస్థానానికి చేరుకుని అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నారు.

అంత‌కుముందు, మెహదీపట్నం నుంచి మహాప్రస్థానం వరకూ సాగిన అంతిమయాత్రలో ప‌లువురు సినీ రాజకీయ ప్రముఖులు  - తెదేపా శ్రేణులు -  నందమూరి అభిమానులు పాల్గొన్నారు. చంద్రబాబు - జాస్తి చ‌ల‌మేశ్వ‌ర్ - కేటీఆర్‌ - తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ - తుమ్మల నాగేశ్వరరావు -  ఏపీమంత్రులు నారా లోకేశ్‌ - ప్రత్తిపాటి పుల్లారావు - దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు కూడా అంత్యక్రియ‌ల‌కు హాజ‌ర‌య్యారు. దాదాపు గంటన్నరపాటు సాగిన అంతిమ యాత్ర‌....దారి పొడువునా అభిమానులు హ‌రికృష్ణ‌కు అశ్రున‌య‌నాల‌తో క‌డ‌సారి వీడ్కోలు ప‌లికారు. సీఎం చంద్ర‌బాబు స్వ‌యంగా హ‌రికృష్ణ పాడె మోశారు. ఆ త‌ర్వాత హ‌రికృష్ణ పార్థివ దేహం మహా ప్రస్థానం చేరుకున్న తర్వాత ప్ర‌భుత్వ అధికారికి లాంచ‌నాల‌తో అంత్య‌క్రియ‌లు ప్రారంభ‌మ‌య్యాయి. హరికృష్ణ పార్థీవదేహంపై టీడీపీ జెండాను కప్పిన సీఎం చంద్రబాబు నాయుడు ఆయనకు కడసారి నివాళులర్పించారు. ఆ త‌ర్వాత  కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్.. హరికృష్ణ పార్థీవ దేహం చుట్టూ ప్రదిక్షణలు చేశారు. ఆ తర్వాత కళ్యాణ్ రామ్.. హరికృష్ణ చితికి నిప్పుపెట్టి కన్నీటి వీడ్కోలు పలికారు.
Tags:    

Similar News