సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన ఇన్ఫోసిస్ నీలేక‌ని

Update: 2018-06-01 07:21 GMT
సంపాదించ‌టం ఒక వ్య‌స‌నం. కాద‌ని చాలామంది చెబుతారు. కానీ.. ఒక‌సారి సంపాదించ‌టం మొద‌లు పెట్టిన త‌ర్వాత అంత‌కంత పెంచుకుంటూ పోవ‌ట‌మే త‌ప్పించి.. త‌గ్గించుకోవ‌టానికి ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు. అదేమీ త‌ప్పు కాదు కూడా. కానీ.. తాను క‌ష్ట‌ప‌డి సంపాదించింది న‌లుగురి కోసం ఖ‌ర్చు చేయ‌టం.. ప‌ది మందికి అవ‌స‌ర‌మైన వాటి కోసం ఉప‌యోగించ‌టం అంత తేలికైన విష‌యం కాదు. వంద‌ల కోట్లు ఉన్నా.. మ‌రిన్ని కోట్ల‌ను సంపాదించాల‌న్న ఆశే త‌ప్పించి.. ఉన్న కోట్ల‌ను అల‌వోక‌గా ఇచ్చేందుకు ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌రు.

కానీ.. ఇందుకు మిన‌హాయింపుగా కొంద‌రు శ్రీ‌మంతులు అప్పుడ‌ప్పుడు నిర్ణ‌యాలు తీసుకుంటారు. తాజాగా ఇప్పుడు అదే కోవ‌లోకి వచ్చారు ఇన్ఫోసిస్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడిగా సుప‌రిచితులైన నంద‌న్ నీలేక‌ని.. ఆయ‌న స‌తీమ‌ణి రోహిణి నీలేక‌ని. త‌మ ఆస్తిలో స‌గాని కంటే ఎక్కువ మొత్తాన్ని విరాళంగా ఇస్తామంటూ వారు స‌రికొత్త ప్ర‌క‌ట‌న చేసి సంచ‌ల‌నం సృష్టించారు.

బిల్ గేట్స్‌.. ఆయ‌న స‌తీమ‌ణి మెలిండా గేట్స్.. వారెన్ బ‌ఫెట్ లు నెల‌కొల్పిన గివింగ్ ఫ్లెడ్జ్ అనే ఎన్జీవోకు వీరిద్ద‌రూ తాజాగా హామీ ఇచ్చారు. దీంతో.. వారి  సంపాద‌న‌.. ఆస్తిలో 50 శాతం కంటే ఎక్కువ‌గా స్వ‌చ్ఛంద సేవ కోసం వినియోగిస్తారు. వీరే కాదు.. మ‌రో ముగ్గురు కోటీశ్వ‌రులు సైతం ఇదే హామీని తాజాగా ఇవ్వ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

నీలేక‌ని దంప‌తులతో పాటు.. త‌మ ఆస్తుల్లో 50 శాతం కంటే ఎక్కువ‌గా విరాళంగా ఇస్తామ‌ని ప్ర‌క‌టించిన వారిలో భార‌త సంత‌తికి చెందిన అనీల్ -అల్లిస‌న్ భూస్రీ.. షంషీర్-శ‌బీనా వ‌యాలిల్‌.. బీఆర్ శెట్టి-చంద్ర‌ముఖి ర‌ఘురాం శెట్టిలు ఉన్నారు. నీలేక‌ని దంప‌తుల గురించి అంతో ఇంతో తెలిసిందే. మ‌రి..  మిగిలిన వారి విష‌యాల్లోకి వెళితే..

అనీల్ భూస్రీ.. అల్లిస‌న్‌

అమెరికాకు చెందిన భార‌త సంత‌తి పెద్ద‌మ‌నిషి వ‌ర్క్ డ్ స్టాఫ్ వేర్ సంస్థ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు. ఫోర్బ్స్ లెక్క‌ల ప్ర‌కారం ఇత‌ని సంప‌ద రూ.12,124 కోట్లు. ఇంటెల్ సంస్థ డైరెక్ట‌ర్ ల‌బోర్డులో స‌భ్యునిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇక ఆయ‌న స‌తీమ‌ణి అల్లిస‌న్ థోరెస‌న్ భూస్రీ విష‌యానికి వ‌స్తే ఆమె సాంకేతిక సంస్థ‌ల్లో పెట్టుబ‌డులు పెడుతుంటారు.

షంషీర్‌ వయాలిల్‌,..శబీనా

యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ చెందిన ఈ జంట వీపీఎస్ హెల్త్ కేర్ పేరుతో ఆసుప‌త్రుల్ని నిర్వ‌హిస్తుంటారు. నాలుగు దేశాల్లో 22 ఆసుప‌త్రులు.. 125 ఆరోగ్య కేంద్రాల‌తో పాటు మందుల త‌యారీ కంపెనీ ఉంది.

బీఆర్‌ షెట్టి- చంద్ర‌ముఖి

యునైటెడ్ అమిరేట్స్ కు చెందిన భార‌త సంత‌తికి చెందిన ఈ దంప‌తులు ఎన్ ఎంసీ హెల్త్ పేరుతో 13 దేశాల్లో ఆసుప‌త్రులు నిర్వ‌హిస్తున్నారు. బీఆర్ లైఫ్ పేరుతో భార‌త్‌.. నేపాల్‌.. ఈజిఫ్టుల్లో పేద‌ల‌కు వైద్య సేవ‌లు అందిస్తున్నారు. వీరికి ప‌లు విద్యా సంస్థ‌లు కూడా ఉన్నాయి.
Tags:    

Similar News