మోహన్ బాబుతో మంత్రి పేర్ని నాని భేటీ..!

Update: 2022-02-11 11:30 GMT
టాలీవుడ్ సీనియర్ నటుడు, నిర్మాత మంచు మోహన్‌ బాబుతో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారని వార్తలు వస్తున్నాయి. అధికారికంగా దీని గురించి వివరాలు తెలియనప్పటికీ.. సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలపై వారి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

గురువారం ( ఫిబ్రవరి 10) మెగాస్టార్ చిరంజీవి ఆధ్వ‌ర్యంలో ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌ మోహన్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల బృందం సమావేశమైన విషయం తెలిసిందే. సినిమా టికెట్ ధరలు - చిన్న చిత్రాలకు కూడా ఐదో షోకు అనుమతి వంటి పలు ఇతర విషయాలపై చర్చించారు. అయితే ఈ భేటీలో మోహన్ బాబు కనిపించలేదు.

సీఎంతో మీటింగ్ కు చిరంజీవితో పాటు మహేష్ బాబు - ప్రభాస్ - రాజమౌళి - కొరటాల శివ - ఆర్ నారాయణ మూర్తి - అలీ - పోసాని తదితరులు హాజరయ్యారు. అయితే 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు - ఇండస్ట్రీలో సీనియర్ అయిన మోహన్ బాబు హాజరు కాకపోవడంపై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో నేడు (ఫిబ్రవరి 11) మోహన్‌ బాబును హైదరాబాద్‌ లోని ఆయన నివాసంలో మంత్రి పేర్ని నాని కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఏపీలో సినిమా టికెట్‌ రేట్లతో పాటుగా కీలక అంశాలపై వీరిద్దరూ చర్చించినట్టు సమాచారం. చిరంజీవి బృందంతో సీఎం జగన్‌ భేటీ వివరాలను మోహన్‌ బాబుకు సినిమాటోగ్రఫీ మంత్రి వివరించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే సినిమా రంగానికి సంబంధించిన సమస్యలన్నింటికీ ఓ పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చిన సీఎం జగన్.. ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా సినిమా టికెట్ల అంశం మీద ఏపీ సర్కారు నియమించిన కమిటీ.. ఫిబ్రవరి 17న సమావేశం కానుంది. సభ్యులకు ఇప్పటికే ఉన్నతాధికారులు సమాచారం పంపారు.

సినీ పెద్దలు సీఎం ముందుంచిన ప్రతిపాదనలపై ఈ భేటీలో చర్చించనున్నారు. టికెట్ ధరలు - అదనపు షోలు - భారీ బడ్జెట్‌ చిత్రాలు వంటి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే త్వరలోనే ఏపీ ప్రభుత్వం సవరణలతో కూడిన సరికొత్త జీవో జారీ చేయనుంది.
Tags:    

Similar News