హ‌రిబాబు రాజీనామా వెనుక న‌న్న‌ప‌నేని మాట‌!

Update: 2018-04-27 07:56 GMT
ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు హ‌రిబాబుకు.. టీడీపీ సీనియ‌ర్ నేత‌.. మ‌హిళా క‌మిష‌న్ ఛైర్ ప‌ర్స‌న్ న‌న్న‌ప‌నేని రాజ‌కుమారికి పెద్ద సంబంధాలు ఏమీ లేవు. మ‌రి..పార్టీ అధ్య‌క్ష ప‌ద‌వికి హ‌రిబాబు రాజీనామా వెనుక రాజ‌కుమారి ప్ర‌స్తావ‌న ఎందుకు వ‌చ్చింది? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. హ‌రిబాబును త‌న ప‌ద‌వికి రాజీనామా చేయాల‌న్న సూచ‌న‌ను న‌న్న‌ప‌నేని రాజ‌కుమారి  చేసిన గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారా?  యాధృశ్చికంగా జ‌రిగిందా? అన్న విష‌యంలోకి వెళితే..

విశాఖ ఎంపీ.. ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు కంభంపాటి హ‌రిబాబుకు గుంటూరుజిల్లా సీనియ‌ర్ తెలుగుదేశం పార్టీ నేత‌.. మాజీ ఎంపీ య‌డ్ల‌పాటి వెంక‌ట్రావుకు చుట్ట‌రికం ఉంది. ఆయ‌న అనారోగ్యంగా ఉన్నార‌న్న విష‌యం తెలుసుకున్న హ‌రిబాబు ఆయ‌న్ను ప‌రామ‌ర్శించేందుకు ఇటీవ‌ల ఆయ‌న ఇంటికి వెళ్లారు. ఆయ‌న నివాసం గుంటూరు జిల్లా తెనాలిలో ఉంది. ఇదిలా ఉండ‌గా.. హ‌రిబాబు వెళ్లిన స‌మ‌యంలోనే న‌న్న‌ప‌నేని రాజకుమారి కూడా య‌డ్ల‌పాటిని ప‌రామ‌ర్శించేందుకు ఆయ‌న ఇంటికి వెళ్లారు.

ఈ సంద‌ర్భంగా హ‌రిబాబు.. న‌న్న‌ప‌నేని రాజ‌కుమారిల మ‌ధ్య మాట క‌లిసింది. ఈ సంద‌ర్భంగా తాజా రాజ‌కీయ ప‌రిణామాల్ని ప్ర‌స్తావించిన రాజ‌కుమారి.. హ‌రిబాబును పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేయాల‌న్నారు. హోదా అంశంపై ఏపీ ప్ర‌జ‌లు బీజేపీని తిట్టిపోస్తున్నార‌ని.. అలాంటి చోట మీరెందుకు ప‌ద‌విలో ఉంటారు? అని ఆమె ప్ర‌శ్నించారు.

జ‌నాలు తిట్టే ప‌ద‌వుల్లో మీరెందుకు ఉంటారు?  మీలాంటి వాళ్లు అస్స‌లు ప‌నికిరారు?  అంటూ రాజ‌కుమారి త‌న‌దైన శైలిలో మాట్లాడారు. ఇదిలా ఉండ‌గా.. రాజ‌కుమారి మాట‌ల‌కు హ‌రిబాబు కాస్త మాట్లాడే ప్ర‌య‌త్నం చేశారు. పార్టీ చేసిన కార్య‌క్ర‌మాల్ని వివ‌రించే ప్ర‌య‌త్నం చేసి.. కాసేప‌టికి మౌనంగా ఉన్నారు.
రాజ‌కుమారితో పాటు.. అక్క‌డున్న ప‌లువురు హ‌రిబాబును రాజీనామా చేయాల‌న్న మాట‌పై మాత్రం ఆయ‌న రియాక్ట్ కాలేదు. ఇది జ‌రిగిన ప‌క్క రోజున హ‌రిబాబు త‌న పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేస్తూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

తాను రాజీనామా చేయ‌మ‌న్న ప‌క్క‌రోజునే హ‌రిబాబు రాజీనామా చేయ‌టంపై రాజ‌కుమారి విస్మ‌యాన్ని వ్య‌క్తం చేశారు. ఇదిలా ఉంటే.. పెద్ద ప‌ద‌విని అప్ప‌గించే క్ర‌మంలో హ‌రిబాబు చేత‌నే బీజేపీ అధినాయ‌క‌త్వం రాజీనామా చేయించింద‌న్న మాట వినిపించినా.. అలాంటిదేమీ లేక‌పోవ‌టం చూస్తే.. ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేయాల‌న్న ఆలోచ‌న‌లో బీజేపీ అధినాయ‌కత్వం ప్లాన్ ప్ర‌కార‌మే హ‌రిబాబును త‌ప్పించింద‌న్న మాట వినిపిస్తోంది.

వెంక‌య్య‌కు స‌న్నిహితుడిగా పేరున్న హ‌రిబాబు.. గ‌ట్టిగా మాట్లాడ‌లేర‌న్న పేరుంది. అయితే..నిబ‌ద్ధ‌త క‌లిగిన రాజ‌కీయ నేత‌గా పేరున్న హ‌రిబాబును పార్టీ ప‌ద‌వి నుంచి త‌ప్పించ‌టంపై మాత్రం ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. ఇప్ప‌టికే బీజేపీకి ఏపీలో జ‌రిగిన డ్యామేజ్ భారీ అని.. ఇలాంటివేళ‌లో హ‌రిబాబు లాంటోళ్ల‌కు పార్టీలో ప్రాధాన్య‌త‌ త‌గ్గించ‌టం ద్వారా మ‌రింత న‌ష్టం వాటిల్లుతుంద‌న్న మాట వినిపిస్తోంది. ఆ మ‌ధ్య‌న మోడీ క్యాబినెట్ లో స్థానం ఇస్తామ‌ని చెప్పి.. చివ‌రి నిమిషంలో హ్యాండ్ ఇచ్చినా మాట మాట్లాడ‌కుండా ఉన్న హ‌రిబాబును చూస్తే.. ఆయ‌న‌కు వ‌రుసపెట్టి జ‌రుగుతున్న అన్యాయాలు ఆయ‌నపై మ‌రింత సాఫ్ట్ కార్న‌ర్ పెరిగేలా చేస్తున్నాయ‌న్న భావ‌న క‌ల‌గ‌క మాన‌దు.
Tags:    

Similar News