కేసీఆర్ నంబ‌ర్ 1 సీఎంపై టీడీపీ విసుర్లు

Update: 2016-10-29 10:31 GMT
దేశంలోనే  ముఖ్యమంత్రుల్లో కేసీఆర్  నెంబర్ వ‌న్ సీఎం అని వీడీపీ అసోసియేట్స్ తేల్చిన స‌ర్వేపై టీడీపీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి మండిప‌డ్డారు. కేసీఆర్ నంబ‌ర్ వ‌న్ సీఎం అనేది ఓకే కానీ...అది ఇచ్చిన హామీలను విస్మరించిన సీఎం జాబితాలో అని న‌ర్సిరెడ్డి ఎద్దేవా చేశారు. హామీలు అమలు చేయకుండా దగా - నయవంచన - మోసం చేయడంలో కేసీఆర్ టాప్‌ లో ఉంటార‌ని ధ్వ‌జ‌మెత్తారు. బోగస్ సర్వేలు కట్టిపెట్టి పరిపాలనపై దృష్టిపెట్టాల‌ని న‌ర్సిరెడ్డి వ్యాఖ్యానించారు. 

తాజా స‌ర్వేపై న‌ర్సిరెడ్డి స్పందిస్తూ.... ఇప్పటి వరకు బోగస్ వాగ్దానాలు - బోగస్ మాటలు - బోగస్ వ్యవహారాలతో ప్రజలను మభ్యపెడుతున్న టీఆర్ ఎస్ ఇప్పుడు బోగస్ సర్వేతో ప్రజల్ని మరోసారి మోసం చేసే ప్రయత్నం చేస్తోంద‌ని మండిప‌డ్డారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలును విస్మరించిన ముఖ్యమంత్రుల్లో సీఎం కేసీఆర్ దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలుస్తారని వ్యాఖ్యానించారు. సొంతంగా బోగస్ సర్వేలు చేయించుకుంటూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టిస్తు రాష్టం అభివృద్ధిలో అగ్రాగమిగా ఉందని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉన్నారనే భ్రమలు కల్పిస్తున్నారని ఆరోపించారు. రెండున్నర ఏళ్ల టీఆర్ ఎస్ పాలనపై - ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై రెఫరెండం నిర్వహిస్తే కేసీఆర్ పాలన అసలు నైజం బయటపడుతుందని అన్నారు.

"కేసీఆర్ ఎందుకు నంబ‌ర్ వ‌న్ సీఎం? ప్రభుత్వ నిర్ణయాలపై హైకోర్టు చేత 19 సార్లు మొట్టి కాయలు వేయించుకున్నందుకా? సచివాలయంలో అడుగుపెట్టకుండా - ఫామ్ హౌస్ నుంచే పరిపాలన సాగిస్తున్నందుకా?5 సార్లు ఎంసెట్ పరీక్ష వ్రాయించి విద్యార్థులతో జీవితాలతో చేలగాటం ఆడినందుకా?ఫీజు రీయింబర్స్ మెంట్ - ఆరోగ్య శ్రీ బకాయిలు - రైతు రుణమాఫీ - ఇన్పట్ సబ్సిడీ చెల్లించనందుకా? డబుల్ బెడ్రూం ఇళ్లు - దళితులకు భూ పంపిణీ అమలు చేయనందుకా - తండాలు - గూడెంలు గ్రావు పంచాయితీలుగా గుర్తించనుందుకా, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మినెంట్ చేయకుండా, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆందోళనకు దిగిన హోంగారులపై లారీఛార్టీ చేయించినందుకా? తెలంగాణలో నూతన రాజకీయ ఒరవడికి శ్రీకారం చూడతామని చెప్పి దేశంలో ఎక్కడలేని పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో సీఎం కేసీఆర్ నంబ‌ర్ వ‌న్‌ గా నిలుస్తారా?" అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించారు.


Tags:    

Similar News