తనకు జరిగిన అవమానంపై స్పందించిన భువనేశ్వరి

Update: 2021-12-20 12:30 GMT
వైసీపీ పేరు ఎత్తకుండానే చంద్రబాబు సతీమణి, నారా భువనేశ్వరి వారికి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబును అసెంబ్లీలో అవమానించడం.. తనపై చేసిన కామెంట్లపై నారా భువనేశ్వరి బరస్ట్ అయ్యారు. ఎన్టీఆర్ ట్రస్ట్ తరుఫున భువనేశ్వరి ఆర్థికసాయం చేశారు. ఎన్టీఆర్ తన జీవితంతో, చర్యలతో మార్గదర్శి అయ్యారని.. సమాజానికి న్యాయం చేయాలని ఎన్టీఆర్ జీవితాన్ని అంకింతం చేశారన్నారు.

 ఇటీవల వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు లక్ష రూపాయల చెక్కులను పంపిణీ చేసేందుకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తిరుపతికి వచ్చారు. ఓ మీడియా ఛానెల్‌తో ఆమె మాట్లాడుతూ.. ఒక తల్లిగా తాను లోకేష్‌ను మహిళలను గౌరవించే సంస్కృతితో పెంచానని అన్నారు.

"మా కంపెనీ బోర్డ్ మీటింగ్‌లో, మేము పురుషులు, మహిళల గురించి మాట్లాడము. మేము కంపెనీ గురించి సీఎస్ఆర్ ద్వారా చేయవలసిన సేవల గురించి మాత్రమే మాట్లాడతాము. అసెంబ్లీ ఒక దేవాలయం లాంటిదని.. అందులో కేవలం ప్రజల సమస్యలపై మాత్రమే చర్చించాలన్నారు. వాళ్ళు ఏం చెప్పినా నేను పట్టించుకోను" అని ఆమె చెప్పింది.

"నాకు నా భర్త మద్దతు ఉంది. తన కన్నీళ్ల వెనుక నాపై ఉన్న ప్రేమను చూశాను.. నాకు ఎవరి క్షమాపణ అవసరం లేదు. వాళ్లు నా పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నేను సుమారు పది రోజులు బాధపడ్డాను. రాజకీయాల్లో మహిళల పట్ల గౌరవం పెంచేందుకు లోకేష్ కృషి చేస్తున్నారు. స్త్రీలను కించపరచడం సమాజానికి మంచిది కాదు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు నాపై దాడి కంటే దారుణంగా ఉన్నాయి'' అని ఆ భయంకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ  నారా భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు.

పనిలేక తమపైన విమర్శలు చేస్తున్నారని నారా భువనేశ్వరి వ్యాఖ్యానించారు. ఆ విమర్శలను తాము పట్టించుకోమని.. కానీ చాలా బాధపడ్డామని చెప్పారు. సమాజానికి ఉపయోగం లేని విమర్శలు ఎందుకని ప్రశ్నించారు. ఆడపిల్లలంటే ఆట వస్తువులు కాదని.. మహిళలను నోటికి వచ్చినట్లు మాట్లాడవద్దంటూ హెచ్చరించారు. సమాజానికి మహిళ పునాది అంటూ వ్యాఖ్యానించారు. తన భర్త రాత్రింబవళ్లు కష్టపడి పెద్ద రాష్ట్రం కోసం పనిచేసిన వ్యక్తి అని చెప్పుకొచ్చారు.

''మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు మరింత బాధాకరం. ప్రతి పురుషుడు సమాజంలోని స్త్రీలతో పాటు తన కుటుంబంలోని తల్లిని, సోదరిని చూడాలి. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో సేవలను విస్తరిస్తాం. విపత్తు లేదా ప్రకృతి వైపరీత్యాల ప్రమాదం ఉన్న చోట ట్రస్ట్ సేవలను అందిస్తుంది. దేశవ్యాప్తంగా ట్రస్ట్ వాలంటీర్లు మాతో కలిసి పనిచేసే వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తాం'' అని ఎన్టీఆర్ ట్రస్ట్ భవిష్యత్తు ప్రణాళికల గురించి ఆమె వెల్లడించారు.
Tags:    

Similar News