రాజ‌కీయాల‌పై మ‌ళ్లీ క్లారిటీ ఇచ్చిన బ్రాహ్మ‌ణి

Update: 2017-07-29 15:50 GMT
తాత దేశ రాజ‌కీయాల‌ను ప్ర‌భావితం చేసిన వ్య‌క్తి - మామ ముఖ్య‌మంత్రి.....పార్టీ అధినేత‌ - భ‌ర్త మంత్రి - అధికార‌ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ..తండ్రి ఎమ్మెల్యే...తెలుగువారి ఆద‌రాభిమానాలు పొందిన న‌టుడు.... ఇన్ని ప్ర‌త్యేక‌త‌లు - కుటుంబం అంతా క్రియాశీల రాజ‌కీయాల్లో ఉన్న నేప‌థ్యంలో స‌హ‌జంగానే  నారా బ్రాహ్మణి త‌న పొలిటిక‌ల్ ఎంట్రీపై చ‌ర్చ జ‌రుగుతుంది. అలా విస్తృతంగా జ‌రుగుతున్న చ‌ర్చ‌కు ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కోడ‌లు - మంత్రి నారా లోకేష్‌ సతీమణి నారా బ్రాహ్మ‌ణి క్లారిటీ ఇచ్చారు.

హైద‌రాబాద్‌ లో జ‌రిగిన ఫిక్కీ సదస్సులో పాల్గొన్న నారా బ్రాహ్మ‌ణి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ``నేను రాజకీయాల్లోకి రాను`` అని తేల్చిచెప్పారు. త‌మ కుటంబ వ్యాపార‌మైన హెరిటేజ్‌ ను అభివృద్ధి చేయడమే త‌న ముందున్న లక్ష్యమ‌ని తేల్చిచెప్పారు. రైతులకు ఆర్థిక పరిపుష్టి సమకూర్చడం - తద్వారా నాణ్యమైన ఆహార పదార్థాలు అందించేలా హెరిటేజ్ ద్వారా కృషి చేస్తామని నారా బ్రాహ్మ‌ణి తెలిపారు. ఈ క్ర‌మంలో ప‌లు చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని ఆయా జిల్లాల్లో రైతుల కోసం ప్ర‌త్యేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టామ‌ని వెల్ల‌డించారు.

ఇదే సదస్సుకు హాజ‌రైన నారా బ్రాహ్మ‌ణీ భ‌ర్త‌ ఏపీ మంత్రి నారా లోకేష్  ఈ సందర్భంగా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. త‌మ కుటుంబ స‌భ్యులు ఎవ‌రు కూడా వారిక ఆస‌క్తిని అనుస‌రించి ప‌నిచేస్తారే త‌ప్ప ఎవ‌రిపై ఇంకెవ‌రి ఒత్తిడులు ఉండవ‌ని అన్నారు. ‘‘ మా కుటుంబంలో అమ్మ - బ్రాహ్మణి కష్టపడుతూ ఉంటారు. నేను - నాన్న బాగా ఖర్చుపెడుతూ ఉంటాం.  రాజకీయాల్లో కానీ.. ఇంట్లో కానీ మహిళలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది `` అని తెలిపారు. మ‌హిళ‌ల‌పై ఈ సద‌స్సులో  చాలా మంది మహిళలు వాళ్ళ ఆలోచనలను తెలియజేశారని అన్నారు. ప్ర‌భుత్వం ప‌రిధిలో చేయ‌ద‌గిన అంశాల‌కు సంబంధించిన ప‌రిష్కారం ద‌క్కే విధంగా తాను ముఖ్య‌మంత్రి ముందుకు తీసుకువెళ‌తాన‌ని వివ‌రించారు.
Tags:    

Similar News