జగన్ వెనకే బాబు కూడా... ఢిల్లీ మదిలో ఏముంది...?

Update: 2022-08-21 12:05 GMT
ఏంటో కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఢిల్లీ టూర్లు చేశారు అంటే అర్ధం అందం ఉంది. ఎందుకంటే వారికి అధినాయకత్వం అక్కడే ఉంటుంది. సొంతంగా నిర్ణయాలు తీసుకునే చాన్స్ వారికి ఎపుడూ ఢిల్లీ పెద్దలు ఇవ్వరు. చిన్నపాటి నామినేటెడ్ పదవులు కూడా వారి అనుమతి తీసుకుని భర్తీ చేయాల్సిందే. ఈ విషయాల మీదనే ఎన్టీయార్  నాలుగు దశాబ్దాల క్రితం నలు చెరగులా ఏపీ అంతటా చెడుగుడు ఆడేసి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టారు. ఆయన ఢిల్లీ ఎపుడూ పెద్దగా వెళ్ళింది లేదు.

ఆయ‌నను చూసి ఢిల్లీయే ఒక దశలో గడగడలాడింది. అయితే ఏపీలో మాత్రం ప్రస్తుత రాజకీయ నేతల తీరు వేరేగా ఉంటోంది. ఏపీలో రెండు బలమైన ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి. వాటికి వారే సర్వాధికారులు. వారే అత్యంత శక్తిమంతులు. ఏ నిర్ణయం అయినా వారు తీసుకోగలిగే  స్థాయిలో ఉన్నారు. అలాంటి జగన్ చంద్రబాబు వరసబెట్టి ఢిల్లీ టూర్లు పట్టడమే వింత, విడ్డూరమూనూ. చంద్రబాబు ఏ మాత్రం మొహమాటం పడకుండా తాను సీఎం గా ఉన్నపుడు 28 సార్లు ఢిల్లీకి వెళ్ళాను అని చెప్పుకున్నారు. అంటే సగటున ప్రతీ రెండు నెలలకు ఒకసారి అన్న మాట.

ఇక జగన్ మూడేళ్ల తన ఏలుబడిలో బాబు రికార్డుని తిరగరాసే పనిలో ఉన్నారు. ఈ ఇద్దరూ చెప్పేది ఏమిటే అంటే ఏపీకి రావాల్సిన వాటిని సాధించుకుని రావడానికే ఢిల్లీకి వెళ్తున్నామని. కానీ అసలు విషయం వేరు. ఢిల్లీలో ఉన్న బీజేపీ పెద్దలను ఎప్పటికపుడు ప్రసన్నం చేసుకోవడానికే ఈ టూర్లు సాగుతున్నాయని ప్రత్యర్ధులు అంటారు. ఏపీలో పెండింగులో ఉన్న అనేక సమస్యలు ఎనిమిదేళ్ళుగా అలాగే పడి ఉన్నాయి. వాటిలో ఏ ఒక్కటీ బాబు కానీ జగన్ కానీ సాధించుకుని వచ్చినదే లేదు.

ఇక ఇపుడు జగన్ మరోమారు ఢిల్లీ వెళ్తున్నారు. పార్టీ వర్గాలు చెబుతున్నది ఏంటి అంటే పోలవరం తో పాటు అనేక ఇతర రాష్ట్ర సమస్యలను జగన్ కేంద్ర పెద్దల వద్ద ప్రస్తావిస్తారు అని. మోడీతో జగన్ భేటీ అవుతారు అని. అలాగే అమిత్ షా తో కూడా మీట్ అవుతారు అని. అయితే జగన్ టూర్ లో రాష్ట్రానికి సంబంధించిన సమస్యలు ప్రస్థావనకు ఎటూ రావచ్చు. దానితో పాటు రాజకీయ అంశాలే ప్రధానంగా ఉంటాయి అని అంటున్నారు.

ఏపీలో బీజేపీ టీడీపీ దగ్గర అవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. మోడీతో బాబు షేక్ హ్యాండ్ ఇచ్చెశారు. ఇక ఒక తెలుగు మీడియా దిగ్గజం బీజేపీ టీడీపీలను కలపడానికి చూస్తున్నారు. ఈ నేపధ్యంలో వైసీపీలో సహజంగా ఆందోళన మొదలైంది అంటున్నారు. నిజానికి బాబుని బీజేపీ తిరిగి చేరదీసే ఆలోచన ఉందా లేదా అన్నది ఢిల్లీ వారి మదిలోకి దూరి తెలుసుకునే ప్రయత్నం చేయడానికే జగన్ ఈసారి టూర్ అని అంటున్నారు. ఒక వేళ ఈ పొత్తులు ఖరారు అనుకుంటే జగన్ తన దారి తాను చూసుకోవడమే కాదు, రాజకీయ అజెండా కూడా మార్చుకుంటారు అని అంటున్నారు.

ఇక జగన్ ఇలా వెళ్లి రాగానే అలా బాబు కూడా ఢిల్లీ వెళ్తారు అని అంటున్నారు. బాబు గారి టూర్ సెప్టెంబర్ మొదటి వారంలో ఉండవచ్చు అని అంటున్నారు బాబు మోడీ అమిత్ షాలతో భేటీ కావడమే కాదు సుదీర్ఘంగా చర్చిస్తారు అని అంటున్నారు. అంటే ఒక విధంగా పొత్తుల మీద పూర్తి క్లారిటీ తెచ్చుకోవడానికి బాబు ఢిల్లీ టూర్ పెట్టుకున్నారు అని తెలుస్తోంది. ఇక్కడ బాబు కానీ జగన్ కానీ మరచిపోతున్న విషయం ఏమిటి అంటే బీజేపీ పెద్దలు అంత తొందరగా ఏ విషయమూ బయట‌కు చెప్పరు.

వారికి కావాల్సింది అందరూ తమ చుట్టూ తిరగడం, తమ రాజకీయ పబ్బం గడవడం. అందుకోసం బాబు జగన్ ఎన్నిసార్లూ ఢిల్లీ వెళ్లినా మదిలో మాట వారికి తెలిసే అవకాశం లేదనే అంటున్నారు. ఇలా రాజకీయం చేస్తూ ఇద్దరు నేతలతో మ్యూజికల్ చెయిర్స్ ఆడుతూ బీజేపీ తన వ్యూహాన్ని అమలుచేస్తుంది అంటున్నారు. మరి జగన్ కి ఈసారి టూర్ లో ఏమైనా క్లారిటీ వస్తే మాత్రమే ఏపీలో వైసీపీ  రాజకీయం మారే అవకాశం ఉంది. చూడాలి మరి ఢిల్లీ మదిలో ఏముందో, దాన్ని ఎలా కనిపెడతారో.
Tags:    

Similar News