పధకాల మధనం : కొత్త బాబుని చూస్తారా...?

Update: 2022-08-28 15:44 GMT
తెలుగుదేశం పార్టీ అంటేనే సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్. అయితే ఇది ఎన్టీయార్ టైమ్ లో మాత్రమే. ఎన్టీయార్ వస్తూనే అనేక పధకాలను ఏపీ జనాలకు పరిచయం చేశారు. ఇప్పటికి నాలుగు దశాబ్దాల క్రితం ఆయన కిలో రెండు రూపాయలకే బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా ఇళ్ళు స్కీమ్స్ తో యావత్తు  దేశాన్నే తన వైపునకు తిప్పుకున్నారు. ముఖానికి రంగు వేసుకున్నవారికి ఏమి తెలుసు రాజకీయాలు అని విమర్శించిన నోళ్ళే మూతపడేలా సామాన్యుడికి ఏం కావాలో చూసి మరీ వాటిని ఎన్టీయార్ అందించారు. అప్పటికి మూడున్నర దశాబ్దాలుగా అధికారంలో ఉన్నా కూడా కనీసం ఆలోచన కూడా చేయని కాంగ్రెస్ పాలకులకు కళ్ళు తెరిపించేలా ఎన్టీయార్ సంక్షేమ పధకాల అమలు సాగింది.

ఇక ఎన్టీయార్ పద్నాలుగేళ్ళ రాజకీయ జీవితంలో ఎనిమిన్నర ఏళ్ళ పాటు సీఎం గా ఉన్నారు. ఆయన నుంచి అధికారం తీసుకున్న చంద్రబాబు తాను మామ కంటే భిన్నంగా పాలించాలనుకున్నారు. అందుకే ఆయన సంక్షేమాన్ని పక్కన పెట్టి అభివృద్ధి అంటూ ఆ వైపుగా పరుగులు తీశారు. బాబుకు పాలనాదక్షునిగా, అభివృద్ధి కాముకునిగా పేరుంది. కానీ సంక్షేమం విషయంలో మాత్రం ఆయనకు బలమైన  ముద్ర లేదు.

ఇక ఏపీలో చూసుకుంటే ఒక ఎన్టీయార్, ఒక వైఎస్సార్, ఒక జగన్ని మాత్రమే ఈ విషయంలో చెప్పుకుంటారు. ఇపుడు ఏపీలో జగన్ పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు అమలు చేస్తున్నారు. దాంతో ఏపీలో  ఎలా కాదనుకున్నా మళ్ళీ జగనే వస్తారు అన్న భావన అయితే ఏర్పడింది. దానికి కారణం ఆయన పధకాలే అని అంటున్నారు. ఈ విషయం టీడీపీలో కూడా చర్చకు వస్తోంది. జగన్ని కొట్టాలీ అంటే తామూ అదే బాటలో నడవక తప్పదు అని ఆ పార్టీ ఆలోచిస్తోంది. పేదలకు ఎంత చేసినా మంచిదే అన్న భావనను కూడా ఆ పార్టీ వారు వ్యక్తం చేస్తున్నారు.

దీంతో ఈ మధ్యనే టూర్ చేసిన కుప్పంలోనే బాబు అక్కడి ప్రజల సాక్షిగా ఏపీ జనాలకు ఒక శుభవార్తను వినిపించారు. తాము అధికారంలోకి వస్తే ఎన్నో సంక్షేమ పధకాలు అమలు చేస్తామని కూడా బాబు చెప్పుకున్నారు. అంటే టీడీపీ వస్తే పధకాలు పోతాయి అని కంగారు పడేవారికి, అలాగే సంక్షేమం కోరుకునే వారికి టీడీపీ గుడ్ న్యూసే చెబుతోంది అన్న మాట. అదే టైమ్ లో జగన్ కంటే మిన్నగా పధకాలు అమలు చేస్తామని కూడా చెబుతున్నారు.

మొత్తానికి అభివృద్ధి అంటూ ఎంత ఊదరగొట్టినా జనాలకు మాత్రం పధకాలే కావాలని, అవే ఓట్లు రాల్చే అసలైన ఆయుధాలు అని ఆలస్యంగా  అయినా టీడీపీ తెలుసుకుంది. దాంతో ఇపుడు వైసీపీకి పోటీగా అతి పెద్ద జాబితాతోనే జనాల వద్దకు రాబోతోంది. ఒక విధంగా టీడీపీ ఈ టరింగ్ పాయింట్ వద్ద ఆగడం వైసీపీకి బిగ్ ట్రబుల్స్ ని క్రియేట్ చేస్తుంది అంటున్నారు.

అయితే దీని మీద వైసీపీ నేతల వెర్షన్ మరోలా ఉంది. చంద్రబాబు ఇదివరకు కూడా ఎన్నో హామీలు ఇచ్చారు. అవి ఏవీ అమలు చేయలేదు ఇపుడు ఆయన ఇంటికి బంగారం ఇస్తామన్నా జనాలు నమ్మేది లేదు అని అంటున్నారు. కానీ రాజకీయాల్లో ఎపుడేమి జరుగుతుందో తెలియదు కాబట్టి వైసీపీకి బాబు మార్క్ సంక్షేమం రాజకీయంగా మీకు  క్షేమం కాదు అని చెబుతోంది అంటున్నారు. చూడాలి మరి ఈ పోటీలో వైసీపీ కూడా మరెన్ని కొత్త పధకాలను  పెడుతుందో.
Tags:    

Similar News