బ్రాహ్మణి..జపాన్.. సింగపూర్ వాళ్ల ఫోన్లు ట్యాప్

Update: 2015-08-07 04:10 GMT
మరో సంచలన విషయం బయటకు వచ్చింది. ట్యాపింగ్ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు మరింత లోతుగా వెళ్లిందని.. ఊహకు అందని రీతిలో భారీగా ట్యాపింగ్ వ్యవహారం చేపట్టిందన్న అభిప్రాయం వ్యక్తమయ్యే ఆధారాలు లభించినట్లుగా ఏపీ పోలీసు వర్గాల్లో మొదలైన చర్చ.. రాజకీయ అలజడిని సృష్టించేలా ఉన్నాయి.

ఇప్పటివరకూ ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యుల ఫోన్లను మాత్రమే ట్యాప్ చేసినట్లు అనుమానించటం.. దీనిపై సమాచారం కోసం టెలికం సర్వీసు ప్రొవైడర్లను సమాచారం అడగటం.. దీనికి వారు ససేమిరా అనటం.. చివరకు సుప్రీం ఆదేశాలు జారీ చేయటం.. దీనికి కౌంటర్ గా హైకోర్టులో వేసిన పిటీషన్ లో భద్రతా కారణాల వల్ల తాము ట్యాప్ చేసినట్లుగా తెలంగాణ సర్కారు పేర్కొన్న విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే.. ట్యాపింగ్ వ్యవహారంలో హైకోర్టులో..తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదించిన ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మాలనీ.. తెలంగాణ ప్రభుత్వం కొన్ని ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా చెప్పటం తెలిసిందే. టెలిగ్రాఫిక్ చట్టంలోని సెక్షన్ 52 ఆధారంగా దేశ భద్రత.. శాంతిభద్రతలకు భంగం కలిగించే వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ చేసే వీలుంది. అయితే.. తాజాగా ట్యాపింగ్ కు గురి అయినట్లుగా పేర్కొంటున్న వారిలో లోకేశ్.. బ్రాహ్మణి.. సింగపూర్.. జపాన్ ప్రముఖులకు చెందిన ఫోన్లను ట్యాప్ చేసేందుకు వీరెవరూ సెక్షన్ 52 పరిధిలోకి రారన్న వాదనను వినిపిస్తున్నారు.

తాజాగా తమకున్న సమాచారం ప్రకారం.. మొదట అనుకున్నట్లుగా ప్రభుత్వంలోని కీలక ప్రముఖుల ఫోన్లు మాత్రమే కాదు.. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్న సింగపూర్.. జపాన్ ప్రతినిధుల ఫోన్లతో పాటు.. చంద్రబాబు కుటుంబ సభ్యుల మధ్య జరిగిన సంభాషణల్ని కూడా ట్యాప్ చేసినట్లుగా ఏపీ పోలీసు వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. దీనికి సంబంధించి ఆధారాలు తాము సేకరించినట్లుగా చెబుతున్నారు.

ట్యాపింగ్ కేసుకు సంబంధించి హైకోర్టులో దాఖలు చేయనున్న కౌంటర్ పిటీషన్ లో ఏపీ సర్కారు ఈ విషయాల్ని పొందుపర్చనున్నట్లుగా చెబుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తాజాగా బయటకొచ్చిన కోణం రాజకీయంగా అలజడి సృష్టించటం ఖాయమని చెబుతున్నారు. చంద్రబాబు కుటుంబ సభ్యుల ఫోన్ల ట్యాపింగ్ ద్వారా.. వారి వ్యక్తిగత.. వ్యాపార విషయాల్ని తెలంగాణ పోలీసులు తెలుసుకున్నారని ట్యాపింగ్ ఉదంతంపై విచారణ చేస్తున్న సిట్ సందేహిస్తోంది. వారి అనుమానాలకు తగ్గట్లే కొన్ని సాక్ష్యాలు కూడా లభ్యమైనట్లుగా పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. మరి.. ఈ వ్యవహారంపై తెలంగాణ అధికారపక్షం నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News