బాగా పరిచయస్తులు వేదిక మీదకు వెళ్లి మాట్లాడుతున్నప్పుడు.. వేదిక కింద కూర్చున్న వాళ్ల వారిలో ఒకింత ఉత్సాహం కమ్మేస్తుంది. ఇది అందరి అనుభవం. కానీ.. టీడీపీ తమ్ముళ్ల విషయంలోకాస్త వేరుగా ఉంటుంది. వేదిక మీద కానీ.. మైకు ముందుకు కానీ ఏ నేత మాట్లాడినా వారు పెద్దగా ఫీల్ కారు కానీ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు కమ్ ఏపీ మంత్రి లోకేశ్ నోరు విప్పితే చాలు వణికిపోతుంటారు. ఏ నిమిషాన ఏ రీతిలో మాట్లాడతారో.. ఏ మాట ఆయన నోటి నుంచి అదాటున వస్తుందో అర్థం కాని పరిస్థితి.
ఇప్పటికే పలుమార్లు తన మాటలతో సంచలనాల మీద సంచనాలు సృష్టించటంతో పాటు.. ఫన్నీగా మారిన ఆయన మాటలు టీడీపీ వర్గాల్ని ఇరుకున పెట్టాయి. మైకుల ముందు కంటే ట్వీట్ల విషయంలో కాస్త మెరుగ్గా ఉంటుంది లోకేశ్ తీరు. ఇందుకు నిదర్శనంగా ఆయన తాజా ట్వీట్ ను చెప్పొచ్చు.
హోదా విషయంలో ప్రధాని మోడీ తీరును తాజాగా టార్గెట్ చేశారు లోకేశ్. ప్రధాని మోడీ చేసిన ట్వీట్ కు చినబాబు రీట్వీట్ చేసిన వైనం.. అందుకు ఎంచుకున్న పంచ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ప్రత్యర్థులకు పంచ్ ఇచ్చేందుకు మాట్లాడే లోకేశ్ ఎప్పటికప్పుడు సెల్ప్ గోల్ వేసుకుంటారని చెబుతారు. అందుకు భిన్నంగా ఆయన తాజా ట్వీట్ ఉందని చెప్పాలి.
ఇటీవల జాతీయస్థాయిలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తన మీదా.. తన ప్రభుత్వం మీదా తీవ్ర స్థాయిలో విమర్శలు.. ఆరోపణలు చేస్తున్న రాజకీయ ప్రత్యర్థులను ఉద్దేశించి ప్రధాని మోడీ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన ఏమన్నారంటే.. సరైన పరిశోధన.. ఆధారాలు లేకుండా తనపై అసత్య ఆరోపణ చేయటం బాధాకరమని మోడీ ట్వీట్ చేశారు. అత్యాచారాల, క్యాష్ క్రంచ్ వంటి విషయాల గురించి మోడీ రియాక్ట్ అయితే చినబాబు అది టీడీపీ ఆరోపణల గురించి అనుకుని పంచ్ ట్వీట్ చేయటం విశేషం.
చట్టంలో పొందుపర్చిన విధంగా ఆంధ్రప్రదేశ్‌కు హోదాతో పాటు ఇచ్చిన 18 హామీలను నెరవేర్చాలని ప్రశ్నించినందుకు ఎలాంటి ఆధారాలు లేకుండా బీజేపీ నేతలు తమపై బురద జల్లుతున్నారని ట్వీట్ చేశారు. అంతేనా.. అనేక ఆరోపణలు చేస్తున్నారని.. ఇదెంతవరకు సబబు? అంటూ ఇచ్చిన కౌంటర్ చూసినప్పుడు చినబాబు రియాక్షన్ ఓకే ఈ సంబంధం లేని విషయంలో దూరి రిప్లయి ఇవ్వటేంటబ్బా అంటున్నారు. అయితే, ఈ మధ్య కేటీఆర్ ట్వీట్స్‌కు మీడియా ఆదరణ బాగా దక్కడంతో చినబాబు ఆ క్రెడిట్ ను తాను కూడా కొట్టేయడానికి ప్రయత్నాలు చేస్తున్నట్టు అనిపిస్తుంది. పైగా ఈ ట్వీట్ కౌంటర్ చూస్తే.. చినబాబు సొంతంగా కంటే ఎవరో సాయం చేసినట్లుగా ఉంది. మైకుల ముందు మాట్లాడే వేళలోనూ అలాంటోళ్ల సలహాల్ని తూచా తప్పకుండా ఫాలో అయితే మంచిదన్న మాట పలువురి నోట వినిపిస్తోంది.