తెలంగాణ సీఎం కు లోకేష్ ప్రశ్నల వర్షం!

Update: 2016-07-28 10:10 GMT
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వాయిస్ పెంచారు. రాజకీయ విమర్శలకు మాత్రమే పరిమితం కాకుండా.. అర్ధవంతమైన ప్రశ్నలు లేవనెత్తుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ప్రశ్నల వర్షం కురిపించారు. ఏపీని తెలంగాణని.. నాడు నేడు అనే క్రమంలో పోల్చుతూ లోకేష్ ప్రశ్నల ప్రవాహం కొనసాగింది. మిగులు బడ్జెట్‌‌ తో ప్రారంభమైన తెలంగాణ రాష్ట్రం - ఇప్పుడు లోటు బడ్జెట్‌ లోకి పోయిందన్న లోకేష్.. కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకున్నంత కాలం ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశారు.

ప్రమాద బీమా కింద ఇప్పటివరకూ రూ.10 కోట్లు టీడీపీ కార్యకర్తలకు తమపార్టీ ఇచ్చిందని చెప్పిన లోకేష్ - తాము కూడా కార్యకర్తలకు బీమా ఇచ్చామంటూ గొప్పలు చెప్పుకుంటున్న తెరాస నేతలు ఇప్పటివరకూ ఎంత మందికి బీమా ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. దళితులకు భూ పంపిణీ - ఎస్టీ రిజర్వేషన్లు అమలుకు ఇప్పుడు ఏ ఆంధ్రా పార్టీ తెలంగాణలో అడ్డు పడిందని నిలదీశారు. తెలంగాణది మిగులు బడ్జెట్ అయితే.. తెరాస నేతలు చెబుతున్నట్లు తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అయితే కరెంట్ ఛార్జీలు ఎందుకు పెంచారో చెప్పాలని లోకేష్ డిమాండ్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రమాదబీమా చెక్కులను పంపిణీ చేసిన సందర్భంగా లోకేష్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Tags:    

Similar News