ఎమ్మెల్యేల‌కు లోకేష్ క్లాస్ త‌ప్ప‌దా?

Update: 2016-07-18 10:16 GMT
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ రాజ‌కీయాల్లో మ‌రింత‌ క్రియాశీలంగా వ్య‌వ‌హ‌రించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమ‌రావ‌తి - రాష్ట్ర అభివృద్ధి కోసం అడుగులు వేస్తున్న నేప‌థ్యంలో పార్టీ విష‌యంలో లోకేష్ దూకుడు పెంచుతున్నారు. ఈ క్ర‌మంలో త్వ‌ర‌లో లోకేష్‌ ఢిల్లీ మ‌కాం మార్చ‌నున్నట్లు వ‌స్తున్న వార్త‌ల నేప‌థ్యంలో అంత‌కుముందే పెద్ద ప‌నే పెట్టుకున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఓ స‌ర్వే రిపోర్టుతో ఎమ్మెల్యేల‌ను వ్య‌క్తిగ‌తంగా క‌లుసుకోవ‌డం లోకేష్ తాజాగా విధించుకున్న ల‌క్ష్యం.

తెలుగుదేశం ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి రెండేళ్లవుతున్న నేప‌థ్యంలో పార్టీ ఎమ్మెల్యేల పనితీరుపై లోకేష్ సర్వే చేయించారు. అయితే ఫలితం షాకింగ్‌ లా వ‌చ్చింది. ''ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలపై ప్రజల్లో సానుకూలత ఉంది. కానీ వాటిని జనంలోకి తీసుకువెళ్లి - వాటిపై పార్టీముద్ర వేయడంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు విఫలమవుతున్నారు. దానివల్ల పార్టీకి నష్టం జరుగుతోంది. మొత్తంగా పాసుమార్కులు సంపాదించిన ఎమ్మెల్యేలు 20-25 మంది మాత్రమే''ఇదీ స‌ర్వే సారాంశం. 20-25 నియోజకవర్గాల్లో మినహా - మిగిలిన తెదేపా ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తోన్న నియోజకవర్గాల్లో వారి పనితీరుపై - ప్రజలు పెదవి విరిచినట్లు పార్టీ నిర్వహించిన సర్వేలో వెల్లడయింది. చాలామంది ఎమ్మెల్యేలు ప్రజల్లోకి వెళ్లకపోవడం - అందుబాటులో ఉండకపోగా - వచ్చిన వారితో సరైన విధంగా మాట్లాడకపోవడం వంటి అంశాలు నెగటివ్‌ గా పరిణమిస్తున్నాయి. దీంతో ఈ రిపోర్టులను సదరు ఎమ్మెల్యేల చేతులకే అందించాలని లోకేష్ నిర్ణయించారు. దాంతోపాటు.. నేరుగా వ్యక్తిగతంగా మాట్లాడి - పనితీరులో లోటుపాట్ల గురించి వారితో మాట్లాడనున్నారు.

చంద్ర‌బాబు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా పించన్లు ఎక్కువ ప్రభావితం చేస్తుండగా - ఉచిత ఇసుక సామాన్య - మధ్య తరగతి వర్గాలను ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయి. గతంలో వందలు - వేల రూపాయలు పెట్టి ఇసుక కొనుగోలు చేస్తుండగా - ఇప్పుడు ఉచితంగా ఇస్తుండటమే వారి సంతృప్తికి కారణం. నీరు-చెట్టుపై జరుగుతున్న ప్రచారం పట్టణ ప్రజలను ఆకట్టుకుంటోంది. గ్రామాలు - పట్టణాల్లోని వితంతు - వృద్ధ - వికలాంగులకు ఇస్తున్న పెన్షన్ల వల్ల వారి జీవన స్థితిగతి మెరుగుపడింది. ఒకేసారి వెయ్యిరూపాయలు ఒకటో తేదీన అందుతుందటంతో - లబ్ధిదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 24 గంటల నిరంతర విద్యుత్తు ఇస్తున్నారు. దీనితో ఇన్వర్టర్ల కోసం డబ్బు ఖర్చు పెట్టే అవసరం లేకుండాపోయిందని, పొలాల్లో మోటర్లకు డీజిల్ కొని పోసే ఖర్చులు తప్పాయని రైతులు భావిస్తున్నారు. కానీ, ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఇస్తున్న పథకాలనే విషయాన్ని ఎమ్మెల్యేలు లబ్ధిదారులకు ప్రచారం చేయకపోవడం వల్ల ఆ మైలేజీ పార్టీకి దక్కకుండా పోతోందన్న ఆందోళన నాయకత్వంలో కనిపిస్తోంది. అందుకే నియోజకవర్గాల్లో ఏయే పథకాలపై ప్రజలు ఆకర్షితులవుతున్నారు? దానికి కారణమేమిటన్న అంశాలపై సర్వే చేసిన నాయకత్వం.. అవి పార్టీ ఇస్తున్న పథకాలని చెప్పడంలో విఫలమవుతున్నారన్న విషయాన్ని నేరుగా ఎమ్మెల్యేలకే నివేదిక రూపంలో ఇవ్వనుంది. లోకేష్ ఒక్కో ఎమ్మెల్యేతో సమావేశమై ఈ నివేదిక ఆధారంగా దిద్దుబాటుకు పూనుకుంటారు. త్వ‌ర‌లో ఈ మేర‌కు చిన‌బాబు రంగంలోకి దిగుతార‌ని స‌మాచారం.
Tags:    

Similar News