లోకేశా.... ఇదేనా మీ ప‌నిత‌నం?

Update: 2017-07-17 04:25 GMT
టీడీపీ అధినేత‌ - ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు కుమారుడిగా రాజ‌కీయ రంగ‌ప్ర‌వేశం చేసిన నారా లోకేశ్... ఇప్పుడు పార్టీకి జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగానే కాకుండా... చంద్ర‌బాబు కేబినెట్ లో కీల‌క శాఖ‌ల మంత్రిగా ప‌నిచేస్తున్నారు. మొన్న‌టి ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో అత్యంత సులువైన ప‌ద్ద‌తిలో ఎలాంటి ఎన్నిక లేకుండా ఉండే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీగా ఏపీ శాస‌న‌మండ‌లిలో అడుగుపెట్టిన లోకేశ్‌... విప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోకుండానే త‌న తండ్రి ఆధ్వ‌ర్యంలోని ఏపీ కేబినెట్‌ లో చేరిపోయారు. కీల‌కమైన ఐటీ శాఖ‌తో పాటు అంత‌కంటే మ‌రింత ప్రాధాన్యం క‌లిగిన పంచాయ‌తీరాజ్ శాఖ‌ను కూడా లోకేశ్ త‌న చేతిలోకి తీసుకున్నారు. తండ్రిలాగే నిత్యం తాను ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నాన‌ని చెప్పుకుంటున్న లోకేశ్... ఈ రెండు శాఖ‌ల ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష‌ల మీద స‌మీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. లోకేశ్ స్పీడును చూసిన టీడీపీ నేత‌లు - రాష్ట్ర ప్ర‌జ‌లు... త‌న శాఖ‌ల్లో జ‌రుగుతున్న అభివృద్ధిని ఆయ‌న ప‌రుగులు పెట్టిస్తార‌ని ఆశించారు.

అయితే లోకేశ్ రాక‌తో ఆయ‌న శాఖ‌లు అడుగు తీసి అడుగు వేసేందుకు కూడా మొరాయిస్తున్నాయ‌ట‌. అస‌లు లోకేశ్ ఆధ్వ‌ర్యంలోని మంత్రిత్వ శాఖ‌ల్లో ఎలాంటి స్పీడూ న‌మోదు కావ‌డ‌మే కాకుండా... గ‌తంలో న‌మోదు చేసిన అభివృద్ధిని చేరుకునేందుకు కూడా ఆ శాఖ‌లు ఆప‌సోపాలు ప‌డిపోతున్నాయట‌. అంటే ప్ర‌స్తుతం లోకేశ్ నిర్వ‌హిస్తున్న మంత్రిత్వ శాఖల్లో పెద్ద‌గా పురోగతే లేద‌ట‌. ఇదేదో విప‌క్షాల‌కు చెందిన నేత‌లో, లోకేశ్ అంటే గిట్ట‌ని వారో చేస్తున్న వాద‌న కాదు. త‌న తండ్రి క‌నుస‌న్న‌ల్లో, పార్టీ సీనియ‌ర్ నేత య‌న‌మ‌ల రామ‌కృష్ణుడు ఆధ్వ‌ర్యంలోని ఏపీ ఆర్థిక శాఖ చెబుతున్న వాద‌న ఇది. నిజ‌మా?... అంటే ప‌క్కా గ‌ణాంకాల‌తో ఆ శాఖ వెల్ల‌డించిన నివేదికే ఇందుకు సాక్ష్యంగా నిలుస్తోంది. ఆ వివ‌రాల్లోకి వెళితే... ప్ర‌భుత్వ వ్య‌యంలో గ్రామీణాభివృద్ధి వ్య‌వ‌హారాల‌తో కూడిన పంచాయ‌తీరాజ్ మంత్రిత్వ శాఖ‌దే పెద్ద పీట‌. గ్రామ సీమ‌ల్లో మౌలిక వ‌సతులు - తాగునీటి స‌ర‌ఫ‌రా - రోడ్లు - ఉపాధి హామీ ప‌నులు వంటి కీల‌క వ్య‌వ‌హారాల‌న్నీ ఈ శాఖ కింద‌కే వ‌స్తాయి. దీంతో ఈ శాఖ కింద ఖ‌ర్చు పెట్టే వ్య‌య‌మే పెద్ద‌ద‌ని చెప్పాలి.

ఇంత‌టి కీల‌క అంశాలున్న పీఆర్‌ కు ఎన్ని నిధులు కేటాయించినా కూడా త‌క్కువే. ఎప్ప‌టిక‌ప్పుడు నిధులు కావాల‌ని స్థానిక సంస్థ‌లు డిమాండ్ చేస్తూనే ఉంటాయి. అలాంటిది ఇచ్చిన నిధుల‌ను ఖ‌ర్చు చేయ‌డంలోనూ ఈ శాఖ ఘోరంగా విఫ‌ల‌మైంద‌ని య‌న‌మ‌ల మంత్రిత్వ శాఖ తేల్చిపారేసింది. 2017-18 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించి ఈ శాఖ‌కు కేటాయించిన నిధుల్లో తొలి త్రైమాసికం (ఫ‌స్ట్‌ క్వార్ట‌ర్‌)లో ఖ‌ర్చు చేయాల్సిన నిధుల్లో ఇంకా భారీ ఎత్తున నిధులు మిగిలిపోయాయ‌ట‌. గ‌తేడాదికి సంబంధించి ఇదే కాల వ్య‌వ‌ధి ఖ‌ర్చుతో పోలిస్తే... లోకేశ్ ఖ‌ర్చు పెట్టింది కేవ‌లం 44 శాత‌మేన‌ట‌. అంటే తొలి క్వార్ట‌ర్‌ లో లోకేశ్ 56 శాతం నిధుల‌ను ఖ‌ర్చు పెట్టలేక‌పోయార‌న్న మాట‌. ఎక్క‌డికి వెళ్లినా... అభివృద్ధి ప‌నుల‌ను మంజూరు చేయాల‌ని లోకేశ్ కు పెద్ద సంఖ్య‌లో విన‌తులు వ‌స్తుంటే... నిధులు విడుద‌ల చేయ‌కుండా ఆయ‌న‌ ఎందుకు నాన్చుతున్నారో మ‌రి అర్థం కావ‌డం లేదన్న వాద‌న స్వ‌యానా సొంత పార్టీ నేత‌ల నుంచే వినిపిస్తోంది.
Tags:    

Similar News