లోకేష్ రాటుదేలిన‌ట్లే ఉన్నాడుగా

Update: 2016-05-31 08:10 GMT
తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర‌ధానకార్య‌ద‌ర్శి నారా లోకేష్ త‌న రాజ‌కీయ అడుగుల‌ను ఒకింత వేగంగానే వేస్తున్న‌ట్లు క‌నిపిస్తోంది. పార్టీపై మెల్లిమెల్లిగా ప‌ట్టు బిగిస్తున్న లోకేష్ రాజ్య‌స‌భ నామినేష‌న్ల దాఖ‌లు సంద‌ర్భంగా ఈ నేర్పును మ‌రింత‌గా క‌న‌బ‌ర్చారు. తెలుగుదేశం పార్టీ రాజ్య‌స‌భ అభ్య‌ర్థులుగా కేంద్ర‌మంత్రులు సురేష్ ప్రభు - సుజనా చౌదరి - పార్టీ నేత టీజీ వెంకటేశ్‌ లు రాజ్యసభకు నామినేషన్లు దాఖలు చేసిన అనంతరం వారితో కలిసి లోకేష్ మీడియాతో మాట్లాడారు.

ప్రధాని నరేంద్రమోడీ - బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాల వినతి మేరకు బీజేపీ నేత‌ - కేంద్ర‌మంత్రి సురేష్ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపించడం చాలా సంతోషంగా ఉందని  అన్నారు. ఏపీ అభివృద్ధి కోసం తెలుగుదేశం - బీజేపీలు కలిసికట్టుగా కృషి చేస్తాయన్నారు. సురేష్ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపడం ద్వారా ఏపీ వాణిని మ‌రింత బ‌లంగా వినిపించిన వారు అవుతామ‌ని చెప్పారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీ ప్రయోజనాల కోసం ఎంతో కృషి చేసిన సుజనా చౌదరిని మళ్లీ రాజ్యసభకు పంపడం సంతోషంగా ఉందని అన్నారు. అలాగే రాయలసీమకు ప్రాధాన్యం ఇవ్వ‌డంలో భాగంగా టీజీ వెంకటేశ్‌ కు చోటు ద‌క్కింద‌ని వివ‌రించారు.

కేంద్ర మంత్రి సురేష్ ప్రభు మాట్లాడుతూ...అభివృద్ధి పై స్పష్టమైన విజన్ ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో కలిసి ఏపీ ప్రగతికి కృషి చేస్తానని అన్నారు. ఏపీ నుంచి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన తాను ప్రాతినిధ్యం వ‌హించిన అవ‌కాశం ద‌క్కిన అనంతరం ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానన్నారు.
Tags:    

Similar News