ఏపీ తెలుగు తమ్ముళ్లకు చినబాబు వన్ టు వన్

Update: 2016-07-15 05:42 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల ఒక సర్వే నిర్వహించటం తెలిసిందే. ఈ సర్వేలో ఏపీ సర్కారు మీద పెద్దఎత్తున సానుకూలత వ్యక్తమైనా.. మంత్రులు.. ఎమ్మెల్యేల పని తీరు మీద పెదవి విరిచారంటూ సర్వే ఫలితాలపై లీకులు వచ్చాయి. ఈ సర్వే ఫలితాల్ని మీడియాకు వెల్లడించని ఏపీ అధికారపక్షం సర్వే ఆధారంగా పార్టీ పరంగా కొన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించింది.

ఇందులో భాగంగా పార్టీ ఎమ్మెల్యేలలో ముఖాముఖి అయ్యేందుకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ సిద్దం అవుతున్నారు. మంత్రులతో సీఎం చంద్రబాబు ముఖాముఖి అవుతుంటే.. ఎమ్మెల్యేలతో మాత్రం వన్ టు వన్ చినబాబు భేటీ కానున్నట్లుగా తెలుస్తోంది. ఈ వన్ టు వన్ భేటీలో ఇటీవల జరిపిన సర్వే నివేదికను ఆధారంగా తీసుకుంటారని తెలుస్తోంది. సర్వేలో ఒక్కో ఎమ్మెల్యేకు సంబంధించి 360 డిగ్రీస్ పేరిట అన్ని అంశాల్ని కవర్ చేసినట్లుగా చెబుతున్నారు. వ్యక్తిగత వైఖరితో పాటు.. పార్టీ వ్యవహారాల్లో ఎంత చురుగ్గా ఉన్నారు? ఎమ్మెల్యేగా ఆయన పనితీరు? ఇమేజ్? తాజాగా ప్రజల్లో ఆయనకున్న పలుకుబడి లాంటి అంశాలపై సర్వే నివేదికను సిద్ధం చేశారు.

తన వన్ టు వన్ మీటింగ్ లో ఈ అంశాలపై చర్చ జరగటంతో పాటు.. లోటుపాట్ల పై కూడా చినబాబు ప్రశ్నించే వీలు ఉంటుందని చెబుతున్నారు. పార్టీ మీద మరింత పట్టు పెంచుకోవటంతో పాటు.. ఎమ్మెల్యేల్లో కొత్త ఉత్సాహాన్ని నింపేందుకు వీలుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలకు తలంటు కార్యక్రమం కూడా ఉందని తెలుస్తోంది. ఈ నెలలోనే మొదలయ్యే ఈ వన్ టు వన్ భేటీల్లో ఎమ్మెల్యేల్ని చినబాబు ఎలా డీల్ చేస్తారో చూడాలి.
Tags:    

Similar News