లోకేష్ పాద‌యాత్ర ఇక్క‌డి నుంచే!

Update: 2022-09-18 04:56 GMT
ఆంధ్ర‌ప్ర‌దేశ్లో 2024లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించ‌డ‌మే ల‌క్ష్యంగా టీడీపీ పావులు క‌దుపుతోంది. ఇప్ప‌టికే ఆ పార్టీ నిర్వ‌హించిన బాదుడే బాదుడు కార్య‌క్ర‌మాలు, జిల్లాల్లో నిర్వ‌హించిన మినీ మ‌హానాడు కార్య‌క్ర‌మాలు స‌క్సెస్ కావ‌డంతో ఆ పార్టీలో జోష్ నెల‌కొంది. ఈ ఉత్సాహాన్ని మ‌రింత ముందుకు తీసుకువెళ్ల‌డానికి, పార్టీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిపెట్ట‌డానికి నారా లోకేష్ పాద‌యాత్ర‌కు శ్రీకారం చుడుతున్నారు.

వ‌చ్చే జ‌న‌వ‌రిలో సంక్రాంతి నుంచి లోకేష్ పాద‌యాత్ర ప్రారంభ‌మ‌వుతుంద‌ని టీడీపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. లోకేష్ సొంత జిల్లా చిత్తూరు జిల్లా నుంచి పాద‌యాత్ర ప్రారంభిస్తార‌ని చెబుతున్నారు. వాస్త‌వానికి ఈ అక్టోబ‌ర్‌లోనే పాద‌యాత్ర నిర్వ‌హించాల‌ని భావించారు. ఈ మేర‌కు కొంత క‌స‌ర‌త్తు కూడా చేశారు. అయితే పార్టీలో సుదీర్ఘంగా చ‌ర్చించాక వ‌చ్చే సంక్రాంతి నుంచి పాదయాత్ర‌కు మొగ్గుచూపారు.

ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాలో యాత్ర‌ను మొద‌లుపెట్టి శ్రీకాకుళం జిల్లాలో ముగించ‌నున్నారు. రాయ‌ల‌సీమ నుంచి ఉత్త‌రాంధ్ర వ‌ర‌కు పాద‌యాత్ర జ‌రుగుతుంది. మొత్తం 450 రోజుల‌పాటు ఒక్క రోజు కూడా విరామం లేకుండా పాద‌యాత్ర నిర్వ‌హించాల‌నే ప్లాన్‌లో నారా లోకేష్ ఉన్నార‌ని అంటున్నారు. అలాగే రాష్ట్రంలో ఉన్న 175 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌ను క‌వ‌ర్ చేసేలా పాద‌యాత్ర సాగుతుంద‌ని చెబుతున్నారు.

గ‌తంలో పాద‌యాత్ర చేసిన వైఎస్ జ‌గ‌న్ వారంలో ఐదు రోజులు మాత్ర‌మే యాత్ర చేసేవారు. ప్ర‌తి శుక్ర‌వారం సీబీఐ కోర్టుకు హాజ‌రుకావాల్సి ఉండ‌టంతోపాటు మ‌రో రోజు విశ్రాంతి తీసుకునేవారు. దీంతో వారంలో ఐదు రోజులు పాద‌యాత్ర సాగింది. అయితే నారా లోకేష్ కు కోర్టుల‌కు హాజ‌ర‌య్యే గోల లేక‌పోవ‌డంతో వారంలో ఏడు రోజులూ యాత్ర చేయాల‌నే ఉద్దేశంతో ఉన్నార‌ని అంటున్నారు.

షెడ్యూల్ ప్ర‌కారం.. ఏపీ అసెంబ్లీ ఎన్నిక‌లు 2024 ఏప్రిల్‌, మేల్లో జ‌రిగే అవ‌కాశం ఉంది. మార్చి నాటికి ఎన్నిక‌ల షెడ్యూల్ వెలువ‌డుతుంద‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో 2023 జ‌న‌వ‌రిలో లోకేష్ యాత్ర ప్రారంభిస్తే 2024 మార్చి వ‌ర‌కు యాత్ర కొన‌సాగే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు అంటే వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి అవుతుంది. అంటే ఎన్నిక‌ల‌కు ఇది పెద్ద స‌మ‌యం కాదు. ఎన్నిక‌ల వేడి కూడా వ‌చ్చే జ‌న‌వ‌రి నాటికి పూర్తి స్థాయిలో రంజుకుంటుంది. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే సంక్రాంతి నుంచి లోకేష్ పాద‌యాత్ర చేయాల‌ని సంకల్పించారు. దీన్ని టీడీపీ వ‌ర్గాలు కూడా ధ్రువీక‌రిస్తున్నాయి.

వివిధ అంశాలపై టీడీపీ అభిప్రాయాల‌ను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి పాద‌యాత్ర ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని చెబుతున్నారు. దూరమైన వర్గాలను దరి చేర్చుకోవడానికి కూడా ఈ యాత్ర దోహ‌ద‌ప‌డుతుంద‌ని అంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రజా వ్యతిరేక పాలనను తూర్పారబట్టి ప్రభుత్వ వ్యతిరేకతను ఇంకా పెంచేందుకు పాదయాత్ర సరైన సాధనమని టీడీపీ వర్గాలు కూడా భావిస్తున్నాయి.
Tags:    

Similar News