లోకేష్ కి ఛాలెంజ్ రివర్స్ అవుతుందా?

Update: 2021-08-23 05:01 GMT
జగన్మోహన్ రెడ్డి మీద కోపంతో ఒక్కోసారి తెలుగుదేశంపార్టీ నేతలు చేస్తున్న  ఓవర్ యాక్షన్ రివర్సు కొడుతోంది. ఈనెల 21వ తేదీన నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా గుంటూరులోని ఏటి అగ్రహారంలో ఓ బాలికపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం చేశాడంటు ఆరోపణలు చేశారు. తన ట్వీట్లోనే ఘటనను ప్రస్తావించిన లోకేష్ జగన్ పై చాలా ఆరోపణలు చేశారు. ఇపుడా ఆరోపణలే రివర్సవుతున్నాయి. లోకేష్ ఆరోపణలను హైలైట్ చేస్తూ టీడీపీ నేతలు మరింత ఓవర్ యాక్షన్ చేయటంతో సమస్య పెరిగిపోయింది.

లోకేష్ ఆరోపణలపై చివరకు పోలీసు అధికారుల సంఘం కూడా తీవ్రంగా స్సందించి ఓ విధంగా వార్నింగ్ ఇవ్వటం దాకా వెళ్ళింది పరిస్ధితి. దీనిపై మళ్ళీ లోకేష్ రెచ్చిపోయి ట్విట్టర్లో జగన్ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే గుంటూరులోని ఏటి అగ్రహారంలో ఓ అమ్మాయితో సన్నిహితంగా ఉండేందుకు  కానిస్టేబుల్ ప్రయత్నిస్తున్నాడట. ఇందులో భాగంగానే ఆ అమ్మాయితో మాట్లాడుతున్నాడు. దీన్ని గమనించిన అమ్మాయి తల్లి, దండ్రులు కానిస్టేబుల్ ను హెచ్చరించారు.

తమ హెచ్చరికలను కానిస్టేబుల్ పట్టించుకోకపోవటంతో ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా స్పందించిన ఎస్పీ కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయడమే కాకుండా క్రిమినల్ కేసు నమోదుచేసి దర్యాప్తుకు ఆదేశించారు. అయితే మరి లోకేష్ మాత్రం అమ్మాయిపై కానిస్టేబుల్ అత్యాచారయత్నం చేశాడంటూ పదే పదే ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనకు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యమే కారణమంటూ రెచ్చిపోతున్నారు.

ఇక్కడ గమనించాల్సిందేమంటే తమ అమ్మాయితో కానిస్టేబుల్ మాట్లాడటాన్ని ఇష్టపడని తాము ఫిర్యాదు చేసినట్లు తల్లి, దండ్రులు స్పష్టంగా చెప్పారు. తమ కూతురుపై కానిస్టేబుల్ అత్యచారప్రయత్నం చేయలేదంటు వాళ్ళు చెప్పినా లోకేష్ మాత్రం అత్యాచారయత్నం జరిగిందని ఆరోపిస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఘటనను రాజకీయంగా వాడుకోవాలని లోకేష్ అండ్ కో చేస్తున్న ప్రయత్నాల్లో అమ్మాయి, తల్లి, దండ్రులు ఇపుడు రోడ్డు మీదకు రావాల్సొస్తోంది.

అత్యాచారయత్నం జరగలేదని తల్లిదండ్రులు చెప్పినా  లోకేష్ పట్టించుకోకపోవటం విచిత్రంగా ఉంది. అత్యాచారయత్నం జరిగినా జరగలేదని చెప్పాల్సిన అవసరం అమ్మాయి తల్లిదండ్రులకు లేదు. పోలీసులు కూడా అసలు స్పందించలేదని లోకేష్ అండ్ కో చెప్పటం మరీ విడ్డూరంగా ఉంది. కానిస్టేబుల్ ను సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేయటం చర్యలు తీసుకోవడం కాదా ? సున్నితమైన అంశాలను కాకుండా జనాలకు పనికొచ్చే అంశాలపై లోకేష్ స్పందిస్తే మంచిది.
Tags:    

Similar News