ఇంతకూ లోకేష్ చెప్పదలచుకుందేమిటి?

Update: 2018-03-15 13:30 GMT
ఏపీ మంత్రి నారా లోకేష్ చాలా ఘాటుగా స్పందించారు. పవన్ కల్యాణ్ గుంటూరు సభలో  మాట్లాడుతూ లోకేష్ అవినీతి గురించి చాలా తీవ్రమైన ఆరోపణలు చేసిన నేపథ్యంలో.. లోకేష్ శాసనసభ సాక్షిగా విమర్శలకు జవాబివ్వడం విశేషం. ‘ఎలాంటి మహనీయుడు ఎన్టీఆర్ మనవడిగా ఉండి మీరు చేస్తున్న పని ఇదేనా..’ అంటూ పవన్ కల్యాణ్ నిన్న ఎన్టీఆర్ తో పోల్చి మరి లోకేష్ అవినీతిని ఎండగట్టిన సంగతి తెలిసిందే.  ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్టీఆర్ - చంద్రబాబునాయుడు ఎంతో కీలకంగా వ్యవహరించారని - వారికి వచ్చినంత మంచి పేరు తనకు వస్తుందో లేదో తెలియదు గానీ.. వారికి చెడ్డ పేరు తెచ్చే పని మాత్రం ఎన్నటికీ చేయను అంటూ లోకేష్ చెప్పుకొచ్చారు.

అయితే నారా లోకేష్ శాసనసభలో ఎంత సుదీర్ఘంగా ప్రసంగించినప్పటికీ.. ఆయన తన మీద అవినీతి ఆరోపణల గురించి ఏం చెప్పదలచుకున్నారు అనేది మాత్రం స్పష్టంగా అర్థం కావడం లేదు.

ఎందుకంటే.. తన తండ్రి ఎంత కష్టపడి పనిచేస్తాడు.. 64 ఏళ్ల వయసులో 24 ఏళ్లకుర్రాడిలా ఎలా కష్టపడతారు.. తన తండ్రి కేవలం రాజకీయాలు చేసుకుంటూ ఉంటే.. కుటుంబాన్ని నడపడానికి తల్లి ఎంత కష్టపడుతూ వచ్చింది. తన భార్య సీమంతానికి కూడా... చంద్రబాబు కనీసం 5 నిమిషాలు వెచ్చించకుండా.. కనీసం భోజనం చేయకుండా వెళ్లిపోయాడు.. ఇలాంటి ఈతిబాధలు మొత్తం లోకేష్ చాలా విపులంగా శాసనసభలో పార్టీ సభ్యులకు వివరించారు గానీ.. పవన్ కల్యాణ్  తన మీద సంధించిన అవినీతి ఆరోపణలకు సంబంధించి మాత్రం వివరణ ఇవ్వలేదు.

శేఖర్ రెడ్డి తో లోకేష్ కు సంబంధం ఉన్నదని - ఆ కేసులో లోకేష్ పేరు ఉండడం వల్లనే.. మోడీ చంద్రబాబును దూరం పెట్టినట్టు కూడా బయట చెప్పుకుంటున్నారంటూ పవన్ ఆరోపించారు. మీ అబ్బాయి లోకేష్ విచ్చలవిడిగా పాల్పడుతున్న అవినీతి సంగతి మీకు తెలుసా.. ఎన్ని వేల ఎకరాలు కావాలి మీకు - ఎన్ని వేల కోట్లు కావాలి మీకు అంటూ పవన్ చంద్రబాబును ఉద్దేశించి ప్రశ్నించారు. ఆ మాటల్లో  - ఆరోపణల్లో దేనికీ లోకేష్ సూటిగా సమాధానం చెప్పనేలేదు. తమ కుటుంబ కష్టాలు మొత్తం ఏకరవు పెట్టుకున్నారు. తాము మహా కష్టపడే వాళ్లం గనుక.. అవినీతి చేయము.. అన్నట్లుగా లోకేష్ భాష్యం ఉన్నదే తప్ప.. ఆరోపణలకు జవాబు లేదని.. ప్రజల్లో సందేహాల నివృత్తి చేయలేదని అంతా అనుకుంటున్నారు.

Tags:    

Similar News