చినబాబు సెంట్రల్ మీద ఫోకస్ పెడతారట

Update: 2016-07-09 07:30 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేశ్ దృష్టి ఇప్పుడు ఢిల్లీ మీద పడింది. ఇంతకాలం రాష్ట్ర స్థాయి రాజకీయాల మీద దృష్టి పెట్టిన లోకేశ్.. ఇప్పుడు జాతీయ రాజకీయాల మీద ఫోకస్ పెట్టాలని భావిస్తున్నట్లుగా ఉంది. కేంద్రంలోని జాతీయ నాయకులతో పరిచయాలు.. వారితో సంబంధాలు పెంచుకునే అంశం మీద ఫోకస్ చేయాలన్న చంద్రబాబు వ్యూహంలో భాగంగా ఆయన్ను.. ఢిల్లీ వర్గాలకు పరిచయం చేయాలన్న ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుగా చెబుతున్నారు.

మొన్నటికి మొన్న గవర్నర్ నరసింహన్ ఏపీ పర్యటన సందర్భంగా.. తన ఇంట్లో విందును చంద్రబాబు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా గవర్నర్ నరసింహన్ కు లోకేశ్ ను చంద్రబాబు పరిచయం చేయటం గమనార్హం. తండ్రి ఆలోచనలకు తగ్గట్లే లోకేశ్ ఢిల్లీ వైపు దృష్టి సారించేందుకు సిద్ధమవుతున్నారు. ఇకపై నెలలో రెండు.. మూడు రోజులు ఢిల్లీలో బస చేయాలని.. అక్కడి వారితో సంబంధాలు మరింత మెరుగు పర్చుకోవాలని భావిస్తున్నట్లు చెబుతున్ను.

నిజానికి ఢిల్లీ మీద లోకేశ్ ఫోకస్ చేయటం ఆలస్యమైందని చెప్పాలి. ఈ విషయంలో చినబాబుతో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ రాజకీయాల మీద ఫోకస్ చేయటమే కాదు.. జాతీయస్థాయి లాబియింగ్ లో మంచి పేరును తెచ్చుకుంటున్నారు. నిజామాబాద్ ఎంపీగా ఎన్నికైన ఆమె.. లోక్ సభలో ఆమె చేసిన ప్రసంగాలతో జాతీయనాయకుల దృష్టి తన మీద పడేలా చేశారని చెప్పాలి. ఇదే రీతిలో లోకేశ్ కూడా ఢిల్లీ స్థాయిలో తనదైన ముద్రను వేయాలన్న ఆకాంక్ష టీడీపీ వర్గాల్లో ఉందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News