కోడిగుడ్డు గురించి గ‌వ‌ర్న‌ర్ కు కోపం వ‌చ్చింది

Update: 2015-08-24 09:10 GMT
చాలామంది గ‌వ‌ర్న‌ర్ల‌తో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న న‌ర‌సింహ‌న్ మాత్రం కొన్ని సంద‌ర్భాలు సామాజిక బాధ్య‌త‌తో వ్య‌వ‌హ‌రిస్తుంటారు. మిగిలిన గ‌వ‌ర్న‌ర్ల మాదిరి కాకుండా.. కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన అంశాల్ని ప్ర‌స్తావించి చ‌ర్చ‌కు తీసుకొస్తారు. వైద్యం మీద‌న ఇప్ప‌టికే ప‌లుమార్లు త‌న అసంతృప్తి వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాలు నివేదిక ఇవ్వాల‌ని ప్ర‌స్తావించ‌టం తెలిసిందే.

తాజాగా ఆయ‌న తెలంగాణ ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న గ్రామ‌జ్యోతి కార్య‌క్ర‌మంలో భాగంగా మ‌హ‌బూబ్ న‌గ‌ర్ లోని కిష‌న్ బాగ్ లో ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్థానిక వ‌స‌తి గృహాన్ని సంద‌ర్శించారు.

విద్యార్థుల్ని క‌లిసి.. వారితో ముచ్చ‌టించే స‌మ‌యంలో.. వారికి వారానికి ఎన్ని కోడిగుడ్లు పెడుతున్నారని అడిగారు. గ‌వ‌ర్న‌ర్ ప్ర‌శ్న‌కు కాస్తంత త‌గ్గినా.. కొద్దిగా ధైర్యం కూడ‌దీసుకొని.. వారానికి ఒక‌సారి కోడిగుడ్డు పెడుతున్నారంటూ చెప్పేశారు. దీంతో.. గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహావ‌తారం ఎత్తినంత ప‌ని చేశారు.

నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌భుత్వ వ‌స‌తి గృహంలో ఉండే విద్యార్థుల‌కు వారానికి రెండుసార్లు కోడిగుడ్లు పెట్టాల్సి ఉంటుంది. అయితే.. ఒక గుడ్డు పెట్టేసి.. మ‌రో గుడ్డు మింగేస్తున్న హాస్ట‌ల్ నిర్వాహ‌కుల మీద ఆయ‌న తీవ్రంగా మండిప‌డ్డారు. గ్రామ‌జ్యోతి పుణ్య‌మా అని వ‌స‌తిగృహాల్లోని లోటుపాట్లు బ‌య‌ట‌కు వ‌చ్చాయ‌ని చెప్పొచ్చు.

పిల్ల‌కు పెట్టే కోడిగుడ్డును నిర్వాహ‌కులు మింగేయ‌టాన్ని సీరియ‌స్ గా ప‌రిగ‌ణించిన గ‌వ‌ర్న‌ర్.. ఇలాంటి ప‌రిస్థితి ఒక్క ఈ వ‌స‌తి గృహంలోనే ఉందా? లేక‌.. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ప‌రిస్థితే ఉందా అన్న విష‌యాన్ని తెలుసుకోవాలంటూ క‌లెక్ట‌ర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఈ అంశంపై నివేదిక కోరిన‌ట్లుగా చెబుతున్నారు. గ‌వ‌ర్న‌ర్ పుణ్య‌మా అని.. పిల్ల‌ల‌కు పెట్టే కోడిగుడ్ల‌ను మింగేస్తున్న అక్ర‌మార్కుల అక్ర‌మాల‌కు అడ్డుక‌ట్ట ప‌డితే అంత‌కు మించి కావాల్సిందేముంది?
Tags:    

Similar News