అరెస్టు చేసిన తర్వాత నారాయణ తరలింపులో ఎంత హైడ్రామానంటే?

Update: 2022-05-11 03:36 GMT
పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో ఏపీ సీఐడీ అధికారులు నారాయణ సంస్థల వ్యవస్థాపకుడు కమ్ ఏపీ మాజీ మంత్రి నారాయణను అరెస్టు చేయటం తెలిసిందే. మంగళవారం చోటు చేసుకున్న ఈ ఉదంతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగామారింది. నాటకీయ ఫక్కీలో ఏపీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకోవటం గమనార్హం. ఏపీ పోలీసులు మంగళవారం ఉదయం మూడు టీంలుగా హైదరాబాద్ కు చేరుకున్నారు.మంగళవారం తెల్లవారుజామున నార్సింగి.. కేపీహెచ్ బీ కాలనీ.. కొండాపూర్ ప్రాంతాల్లోని నారాయణ ఇంటివద్ద మాటు వేశారు.

ఉదయం పదిన్నర.. పదకొండు గంటల సమయంలో కొండాపూర్ ఇంటి నుంచి నారాయణ దంపతులు కారులో బయటకు వచ్చారు. మాదాపూర్ ఐకియా కూడలి వద్దకు రాగానే మఫ్టీలో ఉన్న పోలీసులు ఆయన వాహనాన్ని అడ్డుకున్నారు. ఆయన భార్యను కిందకు దింపి.. అదే కారులో వేగంగా వెళ్లిపోయారు. ఈ సందర్భంగా తనను కిడ్నాప్ చేస్తున్నట్లుగా నారాయణ కారులో నుంచి కేకలు వేసినట్లుగా తెలుస్తోంది.అనుకోని రీతిలో చోటు చేసుకున్నఈ పరిణామంతో షాక్ తిన్న నారాయణ భార్య.. అనుచరులు డయల్ 100కు ఫోన్ చేసి పోలీసులకుసమాచారం అందించారు.

దీంతో రాయదుర్గం పోలీసులు అప్రమత్తమైన ఆకారును ఫాలో అయ్యారు. మధ్యాహ్నం 12.30 గంటలకు కర్నూలు జాతీయ రహదారి కొత్తూరు జేపీ దర్గా వద్దకు చేరుకున్న కారును కొత్తూరు ఇన్ స్పెక్టర్ బాలరాజు టీం ఆపేసింది. వాహనంలో ఉన్న ఏపీ పోలీసులు తమ గుర్తింపు కార్డులు చూపించారు.

పదో తరగతి పరీక్షా పత్రాల లీకేజీ కేసులో అరెస్టు చేసేందుకు నారాయణను తమతో తీసుకెళుతున్నామని చెప్పారు. దీనికి సంబంధించిన ఆధారాల్ని చూపారు. దీంతో.. పోలీసులు ఆయన్ను తీసుకెళ్లేందుకు అనుమతించారు. అక్కడే ఏపీ పోలీసులు ఆయన్ను మరో వాహనంలో ఎక్కించుకు వెళ్లారు. తొలుత తన భర్తను కిడ్నాప్ చేసినట్లుగా భావించిన నారాయణ సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేయబోగా.. అసలు విషయం తెలిసి కంప్లైంట్ ఇవ్వలేదంటున్నారు.

మాజీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ 2017 మే 10న రోడ్డు ప్రమాదంలో మరణించటం తెలిసిందే. మంగళవారం కొడుకు వర్థంతి సందర్భంగా నారాయణ.. ఆయన సతీమణి కారులో బయటకు వచ్చారు. క్రతువు పూర్తి చేయకుండానే ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వర్థంతి కార్యక్రమం పూర్తి చేశాక అదుపులోకి తీసుకోవాలని కోరినా పోలీసులు అందుకుససేమిరా అన్నట్లు చెబుతున్నారు.

తనపై కేసు నమోదు చేశారన్న విషయం తెలుసుకున్న నారాయణ తన సెల్ ఫోన్ ను స్విచాఫ్ చేసినట్లుగా తెలంగాణ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మరో నెంబరు ఆయన వాడుతున్నట్లు సమాచారం. ఈ నెంబర్ వివరాలుతెలుసుకున్న తర్వాత.. ఆ నెంబరు లొకేషన్ ఆధారంగా ఆయన్నుఅదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. ఒక ప్రముఖుడ్ని ఇంత హైడ్రామా నడుమ తరలించాల్సిన అవసరం ఉందా? అన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News