అబ్బాయిల‌ను మ‌రింత బాధ్య‌త‌గా పెంచండి:మోదీ

Update: 2018-04-24 14:22 GMT
జ‌మ్మూ క‌శ్మీర్ లోని క‌థువాలో ఎనిమిదేళ్ల చిన్నారి ఆసిఫా గ్యాంగ్ రేప్ - హ‌త్య‌....ఉన్నావోలో ద‌ళిత మైన‌ర్ పై ఎమ్మెల్యే కుల్దీప్ అత్యాచార ఘ‌ట‌న‌లు దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం రేపిన సంగ‌తి తెలిసిందే. ఆ ఘ‌ట‌న‌ల‌పై దేశ‌వ్యాప్తంగా తీవ్ర‌స్థాయిలో నిర‌స‌ల‌ను వ్య‌క్తమ‌య్యాయి. ఈ నేప‌థ్యంలో పోక్సో చ‌ట్టానికి స‌వ‌ర‌ణ‌లు చేస్తూ కేంద్ర ప్ర‌భుత్వం ఆర్డినెన్స్ ను జారీ చేసింది. 12 ఏళ్ల‌లోపు చిన్నారుల‌పై అత్యాచారాల‌కు పాల్ప‌డే వారికి గ‌రిష్టంగా మ‌ర‌ణ శిక్ష విధించేలా జారీ చేసిన ఆర్డినెన్స్ ను రాష్ట్ర‌ప‌తి కూడా ఆమోదించారు. దీంతో, పోక్సో చ‌ట్ట స‌వ‌ర‌ణ‌లు వెంట‌నే అమ‌ల్లోకి వ‌స్తాయి. ఈ నేప‌థ్యంలో, తాజా ఆర్ఢ‌నెన్స్ పై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ స్పందించారు. అత్యాచారాలకు పాల్పడేవారిపై ఉక్కుపాదం మోపేందుకు త‌మ ప్ర‌భుత్వం కఠిన శిక్షలు విధించేందుకు  ఆర్డినెన్స్ ను జారీ చేసింద‌ని తెలిపారు. అదే స‌మ‌యంలో తమ కుమార్తెలను త‌ల్లిదండ్రులు గౌరవంగా చూడాలని, కుమారులను మరింత బాధ్యతాయుతంగా పెంచాలని మోదీ సూచించారు. మధ్యప్రదేశ్ లోని మాండ్లా జిల్లాలో మంగళవారం జరిగిన జాతీయ పంచాయతీరాజ్ సమ్మేళనంలో పాల్గొన్న మోదీ ఈ వ్యాఖ్య‌లు చేశారు.

చిన్నారులు, మ‌హిళ‌ల‌పై అత్యాచారాలు చేసేవారిని క‌ఠినంగా శిక్షించాల‌ని త‌మ‌ ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంద‌ని మోదీ అన్నారు. త‌క్ష‌ణ‌మే అమ‌ల‌య్యేలా పోక్సో చ‌ట్ట స‌వ‌ర‌ణ ఆర్డినెన్స్ జారీ చేయ‌డంమే ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌ని ఆయ‌న చెప్పారు. మహిళలు, బాలికలకు భద్రత, రక్షణ కల్పించ‌డానికి సామాజిక ఉద్యమం రావాలని ఆయ‌న అన్నారు. మైనర్లపై అత్యాచారం జరిగితే, నేరస్థులకు మరణ శిక్ష విధించే ఆర్డినెన్స్‌ జారీ చేయ‌డంపై అంద‌రూ సంతోషం వ్య‌క్తం చేస్తున్నార‌ని మోదీ అన్నారు. ప్రజల కోసం త‌మ ప్ర‌భుత్వం అహ‌ర్నిశ‌లు ప‌నిచేస్తోంద‌ని, ప్ర‌జ‌ల‌ గళాన్ని వినే ప్రభుత్వం ఢిల్లీలో ఉందని ఆయ‌న అన్నారు. అదే స‌మ‌యంలో ప్రజలు తమ కుటుంబాల్లో మహిళలను మరింత ఎక్కువగా గౌరవించాలని చెప్పారు. మ‌హిళ‌ల‌కు మ‌రింత భద్రతగల వాతావరణం ఉండేలా చేయాలని అందుకోసం...తల్లిదండ్రులు తమ కుమారులను మరింత బాధ్యతాయుతంగా పెంచాలని మోదీ అన్నారు.



Tags:    

Similar News