కొత్త‌గా మారే గ‌వ‌ర్న‌ర్లు ఎంద‌రు? ఎక్క‌డెక్క‌డ‌?

Update: 2019-07-08 04:51 GMT
కొత్త గ‌వ‌ర్నర్లు వ‌చ్చేస్తున్నారు. రానున్న రెండు నెల‌ల వ్య‌వ‌ధిలో దాదాపు ఎనిమిది రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్ల ప‌ద‌వీ కాలం పూర్తి కానున్న నేప‌థ్యంలో కొత్త గ‌వ‌ర్న‌ర్ల ఎంపిక వ్య‌వ‌హారం ఆస‌క్తిక‌రంగా మారింది. విశ్వ‌స‌నీయ స‌మాచారం ప్ర‌కారం కొత్త గ‌వ‌ర్న‌ర్ల ఎంపికపై ఇప్ప‌టికే ఒక రౌండ్ చ‌ర్చ‌లు పూర్తి అయిన‌ట్లుగా చెబుతున్నారు.

దేశం మొత్తం బీజేపీని ప‌వ‌ర్లోకి తీసుకురావాల‌న్న సంక‌ల్పంతో ఉన్న మోడీషాలు.. త‌మ‌కు ఎంత‌కూ కొరుకుడుప‌డ‌ని రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్ల ద్వారా క‌థ న‌డిపించే ప్ర‌య‌త్నాన్ని షురూ చేయించ‌టం తెలిసిందే. ప‌శ్చిమ‌బెంగాల్ లో గ‌వ‌ర్న‌ర్ ఎంపిక విష‌యంలో ఇదే వ్యూహాన్ని అమ‌లు చేయ‌టం ద్వారా స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో.. త‌మ‌కు ఎంత‌కూ ప‌ట్టు రాని రాష్ట్రాల్లో ఇదే విధానాన్ని అమ‌లు చేయాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

వివిధ రాష్ట్రాల్లో ప‌ద‌వీ కాలం ముగిసే గ‌వ‌ర్న‌ర్ల‌లో కొంద‌రిని ఇంటికి పంపాల‌ని.. మ‌రికొంద‌రికి మాత్రం వేరే రాష్ట్రాల్లో అవ‌కాశం ఇవ్వాల‌ని మోడీషాలు భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు. తాజాగా జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో వ‌య‌సు కార‌ణంగా చూపి పోటీకి అవ‌కాశం ఇవ్వ‌ని కొంద‌రు నేత‌ల‌కు గ‌వ‌ర్న‌ర్ గిరి క‌ట్ట‌బెట్టాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇలాంటి వారిలో సుష్మా స్వ‌రాజ్.. లోక్ స‌భ మాజీ స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్.. బీజేపీ సీనియ‌ర్ నేత‌లు క‌ల్ రాజ్ మిశ్రా.. శాంతాకుమార్.. ఉమాభార‌తి.. ప్రేంకుమార్ ధూమల్.. మ‌రికొంద‌రు ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన అధికారులు ఉన్న‌ట్లు చెబుతున్నారు.

అన్నింటికి మించి రా (రీసెర్చ్ అనాలిసిస్ వింగ్).. ఐబీ మాజీ అధిప‌తుల‌ను వివిధ రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్లుగా నియ‌మించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ప‌ద‌వీ కాలం ముగిసిన గ‌వ‌ర్న‌ర్ల‌కు వేరే రాష్ట్రాల‌కు పంపే విష‌యంలో క్లియ‌ర్ గా ఉన్న మోడీషాలు.. అందుకు సంబంధించి ఇప్ప‌టికే ఒక విధానాన్ని సిద్ధం చేసిన‌ట్లు చెబుతున్నారు. ఇక‌.. విభ‌జ‌న జ‌రిగిన నాటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్ గా న‌ర‌సింహ‌న్ వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా మాత్రం.. రెండు రాష్ట్రాలకు వేర్వేరు గ‌వ‌ర్న‌ర్ల‌ను నియ‌మించాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల‌కు ఉమ్మ‌డి గ‌వ‌ర్న‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న న‌ర‌సింహ‌న్ ప‌ద‌వీ కాలం ముగిసి చాలా కాల‌మే అయినా.. ఆయ‌న్ను కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా చేసే మార్పుల నేప‌థ్యంలో ఆయ‌న్ను మ‌రో రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మించ‌టం కానీ.. వేరే నామినేటెడ్ ప‌ద‌విని అప్ప‌గించొచ్చ‌న్న మాట వినిపిస్తోంది.

విశ్వ‌సనీయ స‌మాచారం ప్ర‌కారం రెండు తెలుగు రాష్ట్రాల‌కు సుష్మా స్వ‌రాజ్.. సుమిత్రా మ‌హాజ‌న్ ను నియ‌మిస్తార‌ని తెలుస్తోంది. మ‌రోవైపు తెలంగాణ‌కు కిర‌ణ్ బేడీని గ‌వ‌ర్న‌ర్ గా నియ‌మించ‌టం ద్వారా కేసీఆర్ ను కంట్రోల్ చేయొచ్చ‌న్న మాట వినిపిస్తోంది. బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాల్లో గ‌వ‌ర్న‌ర్ల నియామ‌కం ద్వారా క్రియాశీల‌కంగా వ్య‌వ‌హ‌రించాల‌న్న ఆలోచ‌న‌లో మోడీషాలు ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఇప్ప‌టికే ఈ విధానం ప‌శ్చిమ‌బెంగాల్ లో సానుకూల ఫ‌లితాలు వ‌చ్చిన నేప‌థ్యంలో.. మిగిలిన రాష్ట్రాల్లో ఇదే తీరుతో వ్య‌వ‌హ‌రించాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఎంత‌కూ కొరుకుడుప‌డ‌ని కేర‌ళ‌.. ఒడిశా.. తెలంగాణ‌.. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ల‌పై ప్ర‌త్యేకంగా న‌జ‌ర్ పెట్టిన బీజేపీ అధినాయ‌క‌త్వం..గ‌వ‌ర్న‌ర్ల ద్వారా ఆయా రాష్ట్రాల్లో చ‌క్రం తిప్పాల‌ని.. పార్టీకి సానుకూలత‌ను తీసుకురావాల‌న్న యోచ‌న‌లో ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. మ‌రి.. వారి ఆలోచ‌న‌లు ఎంత‌వ‌ర‌కూ వ‌ర్క్ వుట్ అవుతాయ‌న్న‌ది కాల‌మే స‌మాధానం ఇవ్వాలి.
Tags:    

Similar News