ఇవాళ మోడీషాలు విజ‌య‌గ‌ర్వంతో న‌వ్వుతార‌ట‌!

Update: 2018-08-09 05:17 GMT
గ‌డిచిన కొద్దిరోజులుగా తీవ్ర ఉత్కంట‌గా మారిన రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ ప‌ద‌వి మోడీషాల సొంతం కావ‌టం ఖాయ‌మ‌న్న అభిప్రాయం ఇప్పుడు వినిపిస్తోంది. అంకెల్లో చూస్తే.. మోడీషాల బ‌లం త‌గినంత లేన‌ప్ప‌టికీ.. చివ‌రి క్ష‌ణాల్లో జ‌రిగే మేజిక్.. మోడీషాల ముఖాల్లో చిరున‌వ్వులు పూసేలా చేస్తాయ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.

రాజ్య‌స‌భ‌లో ఎన్డీయేకు త‌గినంత బ‌లం లేని విష‌యం తెలిసిందే. అయితే.. త‌ట‌స్తుల సానుకూల స్పంద‌న‌తో మోడీషాలు విజ‌యం దిశ‌గా పయ‌నించ‌టం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టివ‌ర‌కూ పోటాపోటీగా సాగిన రాజ్య‌స‌భ డిప్యూటీ ఛైర్మ‌న్ ప‌ద‌విని సొంతం చేసుకోవ‌టానికి జ‌రిగిన ప్ర‌య‌త్నాలు అన్ని ఇన్ని కావు.

ఈ రోజు (గురువారం) ఉద‌యం 11 గంట‌ల‌కు మొద‌ల‌య్యే ఎన్నిక‌ల్లో ఓటు వేసేందుకు పోలింగ్ ఏర్పాట్ల‌ను సిద్ధం చేశారు. అయితే.. తుది ఫ‌లితం ఎన్డీయే స‌ర్కారుకు అనుకూలంగా ఉండ‌టం ఖాయ‌మ‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది. బీజేపీకి చిర‌కాల మిత్రుడు.. మోడీ అంటే మండిప‌డే శివ‌సేన సైతం డిఫ్యూటీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ఎన్నిక‌ల్లో తాము ఎన్డీయే అభ్య‌ర్థికి అనుకూలంగా ఓటు వేస్తామ‌ని ప్ర‌క‌టించారు.

మ‌రోవైపు జేడీయూ ఏ నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఎన్డీయే అభ్య‌ర్థిగా జేడీయూ ఎంపీ హ‌రివంశ్ నారాయ‌ణ్ సింగ్‌.. విప‌క్షాల ఉమ్మ‌డి అభ్య‌ర్థిగా కాంగ్రెస్ ఎంపీ బీకే హ‌రిప్ర‌సాద్‌ లు బ‌రిలో ఉన్నారు. స‌భ‌లో ఉన్న బ‌లాబ‌లాల్నిచూస్తే.. ఎన్డీయే కంటే విప‌క్షాల బ‌లం కాస్త ఎక్కువ‌గా ఉంది. అయితే.. ఏ వ‌ర్గానికి చెంద‌ని వారిగా చెప్పే అన్నాడీఎంకే.. బీజేడీ.. టీఆర్ ఎస్ మ‌ద్ద‌తు మీద మోడీషాలు న‌మ్మ‌కం పెట్టుకున్నారు.

ఇటీవ‌ల మోడీకి క‌టీఫ్ చెప్పిన టీడీపీకి చెందిన ఎంపీలు కాంగ్రెస్ అభ్య‌ర్థికి ఓటు వేయాల‌ని నిర్ణ‌యించారు. ఇదిలా ఉంటే.. త‌ట‌స్తులుగా ఉన్న బీజేడీ.. టీఆర్ఎస్‌.. అన్నాడీఎంకే ఎంపీలు త‌మ‌కే అనుకూలంగా ఓటు వేస్తార‌న్న న‌మ్మ‌కంతో ఎన్డీయే ఉంది. ఆ అంచ‌నా నిజ‌మైతే.. మోడీషాల అభ్య‌ర్థి విజ‌యం న‌ల్లేరు మీద న‌డ‌క‌లా మారుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ఇక‌.. డిఫ్యూటీ ఛైర్మ‌న్ ప‌ద‌వికి జ‌రిగే ఎన్నిక‌ల్లో విజ‌యానికి 118 మంది స‌భ్యుల బ‌లం ఉంటే స‌రిపోనుంది. 235 మంది స‌భ్యుల్లో ఎన్నిక‌కు అవ‌స‌ర‌మైన 118కి మించి మ‌రో ఎనిమిది మంది ఎంపీల బ‌లం త‌మ‌కు అండ‌గా ఉన్న‌ట్లుగా బీజేపీ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీని ప్ర‌కారం చూస్తే.. బీజేపీ అభ్య‌ర్థి గెలుపుకు కీల‌క‌మైన బీజేడీ (9 మంది ఎంపీలు)  క‌మ‌ల‌నాథుల ప‌క్షాన ఉన్న‌ట్లుగా తెలుస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌మ నాయ‌కుడు క‌రుణ మ‌ర‌ణం నేప‌థ్యంలో ఈ ఎన్నిక‌ల‌కు డీఎంకే ఎంపీలు హాజ‌ర‌య్యే అవ‌కాశం త‌క్కువ‌ని చెప్పాలి. అదే జ‌రిగితే.. ఎన్డీయే బ‌లం మ‌రింత పెరుగుతుంద‌ని చెబుతున్నారు. ఏమైనా.. మిగిలిన ఎన్నిక‌ల‌కు భిన్నంగా ఈ ఎన్నిక ఫ‌లితం మోడీషాల ముఖంలో చిరున‌వ్వులు తెచ్చేలా చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News