మోదీషా బాణం గురి త‌ప్ప‌లేదుగా!

Update: 2017-06-22 06:15 GMT
ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ - బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాల ద్వ‌యం వేసే బాణం దాదాపుగా గురి త‌ప్ప‌ద‌ని మ‌రోమారు రూఢీ అయ్యింది. తాము అనుకున్న‌ది సాధించుకుందుకు మోదీషాలు వేసే ఎత్తులు వారి రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌కు అర్థ‌మ‌య్యేలోగానే రిజ‌ల్ట్ వ‌చ్చేస్తుంది. ఈ విష‌యం ఇప్ప‌టికే ప‌లుమార్లు నిరూపితం కాగా... తాజాగా మోదీషాల మంత్రం ఎంత‌లా ప‌నిచేసింద‌న్న విష‌యం విన‌డానికే చాలా ఆసక్తిక‌రంగా ఉంది. ఆ వివ‌రాల్లోకి వెళితే... రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌ల్లో ఎన్డీఏ అభ్య‌ర్థిని గెలిపించుకునేందుకు బీజేపీ దాని మిత్ర‌పక్షాల‌కు చెందిన అన్ని పార్టీల ఓట్లు క‌లిపితే కూడా స‌రిపోదు. ఇంకా రెండు నుంచి మూడు శాతం ఓట్లు అవ‌స‌ర‌మ‌వుతాయి. ఇదే విష‌యాన్ని ముందుగానే గ్ర‌హించిన మోదీషాలు... తాము ఎంపిక చేసిన నేత‌ను రాష్ట్ర‌ప‌తి భ‌వ‌న్‌ లోకి పంపించేందుకు ప‌క్కా ప్ర‌ణాళిక ర‌చించారు.

అందులో భాగంగా తొలుత విప‌క్షాల మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టేందుకు మోదీ - అమిత్ షాలు చేయ‌ని య‌త్న‌మంటూ లేదు. అయినా అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌కుండా... మ‌ద్ధ‌తు ఎలా అడుగుతారంటూ వారి ముఖాల‌పైనే ప‌లు రాజ‌కీయ పార్టీల నేత‌లు చెప్పినా... వారేమీ ఇబ్బంది ప‌డ‌లేదు. చివ‌ర‌కు మీ అభ్య‌ర్థి పేరు చెబితే తామే మ‌ద్ధ‌తిస్తామంటూ విప‌క్షాల‌కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. అయితే ఈ త‌ర‌హా వ్యూహాన్ని ముందుగానే ప‌సిగ‌ట్టిన విప‌క్షాలు ముందుగా మీ అభ్య‌ర్థి ఎవ‌రో చెబితే... అస‌లు తాము అభ్య‌ర్థిని నిల‌బెడ‌తామో, లేదోన‌న్న అంశాన్ని చెబుతామంటూ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీతో పాటు సీపీఎం ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సీతారాం ఏచూరీ కూడా చెప్పారు. ఈ స‌మాధానాన్ని కూడా ముందుగానే అంచ‌నా వేసిన మోదీషాలు... విప‌క్షాల‌ను తాము అనుకున్న‌ట్లుగానే ఏమార్చారు.

స‌రిప‌డినంత బ‌లం లేని కార‌ణంగానే మోదీషాలు త‌మ త‌లుపులు త‌డుతున్నారన్న భావ‌న‌లో విప‌క్షాలు ఉండ‌గానే ఓ ఫైన్ మార్నింగ్ ద‌ళిత నేత రామ్ నాథ్ కోవింద్‌ ను ఏన్డీఏ అభ్య‌ర్థిగా అమిత్ షా ప్ర‌క‌టించేశారు. ఆ వెంట‌నే త‌మ మిత్ర‌ప‌క్షాల‌కు ఫోన్లు చేసిన మోదీ, షాలు దాదాపుగా అంద‌రి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్టగ‌లిగారు. ఇక‌పోతే...మిత్రప‌క్షాల‌తో పాటు ఎన్డీఏ - యూపీఏలో భాగ‌స్వాములు కాని ఒక‌టి - రెండు పార్టీల ఎంపీలు - ఎమ్మెల్యేలు ఓట్లు వేస్తేనే కోవింద్ రాష్ట్రప‌తి ఎన్నిక‌లో నెగ్గుతారు. ఈ మేర ఓట్ల‌ను త‌మ‌వైపు తిప్పుకోవ‌డంతోనే స‌రిపెట్ట‌కూడ‌ద‌ని, విప‌క్షాల‌ను బాగా గట్టిగానే కొట్టాల‌ని ప‌థ‌కం ర‌చించిన మోదీషా ద్వ‌యం... కోవింద్ అభ్య‌ర్థిత్వాన్ని ఖ‌రారు చేసింది.

ఎందుకంటే.. రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించ‌నంత వ‌ర‌కు కోవింద్ బీహార్ గ‌వ‌ర్న‌ర్‌ గా ఉన్నారు. మోదీ ప్ర‌ధాని అయిన త‌ర్వాత 2015లో గ‌వ‌ర్న‌ర్ ప‌ద‌వి పొందిన కోవింద్‌... బీహార్ సీఎంగా ఉన్న జేడీయూ నేత నితీశ్ క‌మార్‌ తో స‌న్నిహిత సంబంధాల‌ను నెర‌పారు. ఈ క్ర‌మంలో ద‌ళిత సామాజిక వ‌ర్గానికి చెందిన కోవింద్‌ ను రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ఎంపిక చేస్తే... కోవింద్‌ పై నితీశ్ కుమార్ కు ఉన్న స‌న్నిహిత సంవ‌బంధాల‌తో విప‌క్షాల్లోని కీల‌క ప‌క్షంగా ఉన్న జేడీయూ మ‌ద్ధ‌తును సుల‌భంగా పొంద‌వ‌చ్చ‌న్న‌ది మోదీషా ప్లాన్‌. ఈ విష‌యాన్ని విప‌క్షాలు ప‌సిగ‌ట్టేలోగానే మోదీషాల‌కు ఫ‌లితం వ‌చ్చేసింది. కోవింద్‌ కు మ‌ద్ధ‌తు తెలుపుతున్న‌ట్లు నిన్న సాయంత్రం ప్ర‌క‌టించిన నితీశ్ కుమార్ రేపు జ‌ర‌గ‌నున్న విప‌క్షాల భేటీకి డుమ్మా కొట్టేశారు.

నితీశ్ నిర్ణ‌యం వెలువ‌డిన వెంట‌నే విప‌క్షాల కూట‌మి ఒక్క‌సారిగా ప‌టాపంచ‌లైపోయింది. విప‌క్షాల్లోని చాలా పార్టీలు కోవింద్‌కు మ‌ద్ధ‌తుగా ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు తేల్చిచెప్పాయి. అంటే భార‌త త‌దుప‌రి రాష్ట్ర‌ప‌తిగా కోవింద్ విజ‌యం సాధించ‌డం ఇప్ప‌టికే పూర్తి అయిపోయింద‌న్న మాట‌. అంటే విప‌క్షాలు ఒక‌వేళ అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపినా కూడా కోవింద్ బ్ర‌హ్మాండ‌మైన మెజారిటీతో గెల‌వ‌డంతో పాటు విప‌క్షాల అభ్య‌ర్థికి డిపాజిట్లు గ‌ల్లంత‌య్యే ప‌రిస్థితి. ఇదే ఫ‌లితాన్ని ఆశించిన మోదీషా ద్వ‌యం కేవ‌లం రెండు రోజుల వ్య‌వధిలోనే త‌మ‌కు కావాల్సిన రిజ‌ల్డ్స్‌ను రాబ‌ట్టేశార‌న్న మాట‌.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News