చంద్రబాబు అంటే వారికి ఇప్పటికీ చులకనే!

Update: 2018-02-07 10:07 GMT
చంద్రబాబునాయుడు ఏదో బీరాలు పలుకుతున్నారు గానీ.. కేంద్ర ప్రభుత్వం తెలుగు తమ్ముళ్లు చేస్తున్న పోరాటాలను ఎంతమాత్రం గుర్తించిందనేది సందేహంగానే ఉంది. ఎందుకంటే.. వారి పోరాటాలకు విలువ ఇచ్చి రాష్ట్రానికి అనుకూల నిర్ణయం అనేది ఇప్పటిదాకా వీసమెత్తు కూడా బయటకు రాలేదు సరికదా.. పోరాటాన్ని ఆపు చేయించాల్సిందిగా... చంద్రబాబును కోరడంలో కూడా.. వారు ఏదో నామ్ కే వాస్తే తంతు నడిపించినట్లుగా చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు తమ చేతల ద్వారా చంద్రబాబు అండ్ కో చేస్తున్న నిరసనల్ని తామేమీ ఖాతరు చేయడం లేదని, చంద్రబాబు అంటే తమకు ఘనమైన భావన ఏమీ లేదనే సంకేతాలే ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది.

వివరాల్లోకి వెళితే.. చంద్రబాబునాయుడు ఆదివారం ఎంపీలతో మీటింగ్ పెట్టుకున్న సందర్భంలోనే రాజ్ నాధ్ సింగ్ ఆయనకు ఫోను చేసి.. రాష్ట్రం గురించి అన్ని సమస్యలు తీరుస్తాం అని చెప్పి బుజ్జగించే ప్రయత్నం చేశారు. మరునాడు ఢిల్లీలో ఎంపీలు కలిస్తే.. మీరంతా ప్రధానిని కలవండి అని చెప్పి చేతులు దులిపేసుకున్నారు తప్ప మరోతీరుగా స్పందించలేదు. తీరా ప్రధాని విషయానికి వస్తే.. ఆయన తమ ప్రభుత్వంలో ఉన్న సుజనా చౌదరిని తప్ప మరెవ్వరినీ కలవడానికి అనుమతించలేదు. ఆందోళన విరమించడం తన చేతుల్లో లేదని సుజనా చెప్పడంతో.. తానే చంద్రబాబుతో మాట్లాడతానని మోడీ చెప్పినట్లు వార్తలు వచ్చాయి.

అయితే ఆ విషయంలో కూడా మోడీకి మాట నిలకడ లేదని అర్థమవుతోంది. చంద్రబాబుతో ఆయన మాట్లాడనేలేదు.. అంటే చంద్రబాబు పోరాటాన్ని మోడీ స్థాయికి ఖాతరు చేయలేదనే అర్థమవుతోంది. బుధవారం కూడా రాజ్ నాధ్ సింగే.. చంద్రబాబుకు ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. చంద్రబాబు ఎలాంటి లొంగుబాటు ధోరణిని అనుసరించారో తెలియదు గానీ.. మోడీ  ప్రసంగ సమయంలో తెదేపా ఎంపీలు మౌనం పాటించారు. రాష్ట్రానికి సంబంధించి ఒక్క నిర్దిష్టమైన మాట కూడా ఆయన చెప్పకపోయినా... వారు ఆ సమయంలో  మౌనంగానే ఉండిపోయారు. తెదేపా ఎంపీలు ఇలా ప్రభుత్వాధినేత దృష్టికి తమ ఆందోళన వెళ్లే అవకాశం లేకుండా... ఆయన  ప్రసంగ సమయంలో మౌనం పాటిస్తూ.. తతిమ్మా సమయంలో కాంగ్రెస్ కు అడ్డు పడుతూ ఉంటే ఎలా న్యాయం జరుగుతుంది. వీరి ద్వంద్వ ప్రమాణాల వల్లనే.. మోడీ వద్ద చంద్రబాబుకు విలువ లేకుండా పోయిందని.. చంద్రబాబు తో తాను స్వయంగా మాట్లాడాల్సిన అవసరం ఉన్నదని కూడా ఆయన భావించడం లేదని ప్రజలు అనుకుంటున్నారు.
Tags:    

Similar News