ఫొని.. మోడీకి ప్రచారానికి పనికొచ్చిందా!

Update: 2019-05-07 14:30 GMT
ఎన్నికల  వేళ మోడీ రాష్ట్రాలపై తన దాతృత్వాన్ని చాటుకునేందుకు ఫొని తుఫాను అవకాశం ఇచ్చినట్టుగా ఉందనే విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. ఈ తుఫాను ధాటికి ఒడిశాలోని తీర ప్రాంతం ఎలా అతలాకుతలం అయ్యిందో టీవీ చానళ్లు కళ్లకు కట్టాయి. ఈ తుఫాను పూరీ  ప్రాంతాన్ని వణికించింది. ఆ ప్రాంతానికి తీవ్రమైన నష్టాన్ని కలిగించింది. దీంతో తక్షణ సాయంగా ఆ రాష్ట్రానికి మూడు వందల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని అందించినట్టుగా కేంద్రం ప్రకటించింది.

స్థూలంగా వెయ్యి కోట్ల రూపాయల మొత్తాన్ని ఒడిశాకు ఆర్థిక సాయంగా ప్రకటించేశారు. అయితే ఇలాంటి మొత్తాలు ప్రకటనల వరకే. ఆ తర్వాత  ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు! ప్రకటించినంత సేపూ ఈ నంబర్లు  వార్తల్లో నిలుస్తాయి. ఆ తర్వాత కేంద్రం ఆ డబ్బులను  ఎప్పుడు ఇస్తుందో.. రాష్ట్రాలకు ఆ మొత్తంలో ఎంత అందుతుందో ఎవరికీ తెలియదు.

ఇది వరకూ విశాఖ హుదూద్ తుఫానుతో కకావికలం అయినప్పుడు కూడా వెయ్యి కోట్ల రూపాయల మొత్తాన్ని సాయంగా ప్రకటించారు. అయితే.. ఆ డబ్బులు పూర్తి స్థాయిలో అందలేని తెలుస్తోంది. నాలుగు వందల కోట్ల రూపాయల మొత్తాన్ని కేంద్రం అందించిందని.. మిగతా మొత్తాన్ని  రకరకాల కొర్రీలతో ఆపినట్టుగా చెబుతారు. పేరుకు అయితే వెయ్యి కోట్ల రూపాయల సాయం అని, అందింది మాత్రం వందల కోట్ల రూపాయల్లోనే అని అంటారు.

ఈ క్రమంలో… ఇప్పుడు ఒడిశాకు వెయ్యి కోట్ల రూపాయల సాయం కూడా అలాంటి కథేనా అనే సందేహాలు నెలకొంటూ ఉన్నాయి. అది కూడా ఎన్నికల వేళ కావడంతో మోడీ ధారాళంగా ఈ ప్రకటన చేశారని, ఒడిశా నష్టపోయిన తీరును చూసిన వాళ్లు ఈ సాయాన్ని అందించడం పట్ల మోడీ మీద కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే అవకాశాలున్నాయని  పరిశీలకులు అంచనా వేస్తూ ఉన్నారు.

అయితే ఒడిశాలో ఇప్పటికే పోలింగ్ ముగిసింది. అక్కడ లోక్ సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. కాబట్టి మోడీ ప్రకటించిన  సాయంతో అక్కడ ప్రత్యేకంగా బీజేపీకి కలిగే లాభం పెద్దగా లేనట్టే. అయితే మిగతా దేశంలో ఎవరైనా ఉదారవాదులు ఉంటే మాత్రం ఈ విషయాన్ని  పాజిటివ్ గా తీసుకుని మోడీ పట్ల - బీజేపీ పట్ల పాజిటివ్ గా రియాక్ట్ అయ్యే అవకాశాలు లేకపోలేదు.

ప్రకృతి విప్తతు వేళ ఇలాంటి సాయాన్ని రాజకీయంగా చూడలేం కానీ, ప్రకటించిన సాయాన్ని పూర్తిగా బాధితులకు అందిస్తే అదెవరు అయినా అభినందనీయులే.
Tags:    

Similar News