మోడీని ఇర‌కాటంలో ప‌డేసిన సోద‌రుడు

Update: 2016-08-26 07:15 GMT
ప్రధాని నరేంద్ర మోడీ తమ్ముడు ప్రహ్లాద్‌ మోడీ ఊహించ‌ని వివాదంలో చిక్కుకున్నారు. స్నేహితుడి కోసం పోలీస్‌ ఉన్నతాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేయ‌డం, పైగా అది ద‌ళిత కోణంలో కావ‌డంతో ప్ర‌హ్లాద్ తీరుపై ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేస్తున్నాయి. శుభ‌కార్యంలో కూడా పైర‌వీలు చేస్తారా అంటూ కాంగ్రెస్ దుమ్మెత్తిపోస్తోంది. ఇపుడు ప్ర‌ధాన‌మంత్రి స్పందించాల‌ని కోరుతున్నారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన అనిల్‌ రాథోడ్‌ ఓ దాబా నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయన కారు టైరు పంక్చర్‌ అయ్యింది. రిపేర్‌ చేయాలని దళిత యువకుడైన రాధేశ్యామ్‌ బెల్‌ని కోరగా అతను నిరాకరించాడు. దీంతో రాథోడ్‌, అతడి అనుచరులు దళిత యువకుడిని తీవ్రంగా కొట్టారు. అంతటితో వదలిపెట్టకుండా రాధేశ్యామ్‌ కుటుంబంలోని మహిళలనూ వేధించారు. బాధితుడి ఫిర్యాదుతో అనిల్‌ రాథోడ్‌తో సహా ఏడుగురిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కింద కేసులు నమోదయ్యాయి. రాథోడ్‌ అనుచరుల్ని పోలీసులు అరెస్ట్‌ చేయగా అతను మాత్రం పరారీలో ఉన్నారు. ప్రధాని మోడీ సోదరుడైన ప్రహ్లాద్‌ మోడీ, తన స్నేహితుడైన రాథోడ్‌ ఇంట్లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో పాల్గొనేందుకు ఇండోర్‌ వచ్చారు. ఈ సందర్భంగా డీఐజీ సంతోష్‌ సింగ్‌ను ప్రహ్లాద్‌ మోడీ కలిశారు. తన స్నేహితుడిపై తప్పుడు కేసులు పెడతారా అంటూ డీఐజీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని ప్రధాని సోదరునికి డీఐజీ భరోసా ఇచ్చారు.

ఇదిలాఉండ‌గా ప్ర‌హ్లాద్ మోడీ తీరుపై కాంగ్రెస్ పార్టీ మండిప‌డింది. కుటుంబ పార్టీ అంటూ త‌మ‌ను విమ‌ర్శించే మోడీ ముందుగా త‌న సోద‌రుడి విష‌యంలో స్పందించాల‌ని కోరింది. ద‌ళితుల విష‌యంలో బీజేపీకే కాదు ప్ర‌ధాన‌మంత్రి కుటుంబ స‌భ్యుల‌కు సైతం స‌రైన అభిప్రాయం లేన‌ట్లుంద‌ని వ్యాఖ్యానించింది.
Tags:    

Similar News