రాఫెల్ లో దేశ భ‌ద్ర‌త మాట ఎందుకొచ్చింది?

Update: 2018-09-23 05:24 GMT
యూపీఏ స‌ర్కార్ అన్నంత‌నే 2జీ స్కాం చ‌ప్పున గ‌ర్తుకు వ‌స్తుంది. ఆపై బొగ్గు స్కామ్‌.. కామ‌న్ వెల్త్ స్కాం.. ఆద‌ర్శ్ స్కాం ఇలా గుర్తుకు వ‌స్తుంటాయి. మ‌రి.. మోడీ స‌ర్కార్ అన్నంత‌నే తెల్ల పేప‌ర్ మాదిరి అన్న‌ది మొన్న‌టి మాట‌. అమిత్ షా కొడుకు ఆస్తులు భారీగా పెర‌గ‌టం.. పెద్ద నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం కొండ‌ను త‌వ్వి ఎలుక‌ను ప‌ట్టుకున్న చందంగా త‌యారు కావ‌టం లాంటివి పెద్ద ఎఫెక్ట్ చూపించ‌కున్నా.. రాఫెల్ విమాన ఒప్పందం మాత్రం మోడీ స‌ర్కారును ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. మోడీ బ్యాచ్ నోటి వెంట మాట‌లు రాలేని ప‌రిస్థితి తీసుకొచ్చింది.

ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిందంతా ఒక ఎత్తు అయితే.. ఫ్రాన్స్ మాజీ అధ్య‌క్షుడు హౌలాండ్ ఇచ్చిన ఇంట‌ర్వ్యూలు దేశ రాజ‌కీయాల్లో ప్ర‌కంప‌న‌లు సృష్టించ‌ట‌మే కాదు.. మోడీ ఇమేజ్ ను దారుణంగా దెబ్బ తీసింది. కొత్త సందేహాల్ని తెర మీద‌కు తీసుకొచ్చింది.

ఏదైనా భారీ ఒప్పందం జ‌రిగిన‌ప్పుడు.. దానికి సంబంధించిన వివ‌రాల్ని ఓపెన్ గా చెప్ప‌టం ద్వారా కొత్త అనుమానాల‌కు.. ఆరోప‌ణ‌ల‌కు చెక్ పెట్టే వీలుంటుంది. కానీ.. అందుకు భిన్నంగా ఇది ర‌క్ష‌ణ ర‌హ‌స్యం.. ఈ వివ‌రాలు బ‌య‌ట‌పెడితే.. దేశ భ‌ద్ర‌త‌కు ప్ర‌మాదం అంటూ మూసేసిన గుప్పిట‌పై అనుమానాలు మొద‌ల‌య్యాయి.

నిజానికి రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలును అంత‌గా దాచాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న‌ది  ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఫ్రాన్స్ అందించే రాఫెల్ యుద్ధ విమానం ఏమిటో?  దాని సామ‌ర్థ్యం ఎంత‌న్న‌ది ఓపెన్ గా అంద‌రికి తెలిసిందే. ఇక‌.. రేట్ల విష‌యంలోనూ పెద్ద దాప‌రికం వ‌హించాల్సిన అవ‌స‌రం లేదు. ఎందుకంటే..  ధ‌ర‌లు.. వాటి నిర్వ‌హ‌ణకు సంబంధించిన విష‌యాల‌తో దేశ భ‌ద్ర‌త‌కు ప్ర‌త్యేకించి వ‌చ్చి ప‌డే ప్ర‌మాదం ఏమీ లేదు.

అయితే.. దేశ భ‌ద్ర‌త లాంటి మాట‌ల్ని వాడితే.. ప్ర‌శ్నించే వారికి బ్రేకులు వేయ‌టంతో పాటు.. వేలెత్తి చూపించే వాళ్ల‌పై బాధ్య‌తారాహిత్యంతో వ్య‌వ‌హ‌రించే గుణం ఎక్కువ‌న్న ముద్ర వేసే వీలు ఉంటుంది. అందుకే.. ఈ  దేశ భ‌ద్ర‌త మాట‌ను తెర మీద‌కు తెచ్చార‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్న ప‌రిస్థితి.

మోడీ పుణ్య‌మా అని.. ఆయ‌న ప్ర‌భుత్వ హ‌యాంలో మీడియా చురుగ్గా వ్య‌వ‌హ‌రించ‌టం లేద‌న్న విమ‌ర్శ ఉంది. త‌న‌కు చిరాకు తెప్పించే వారిని దారికి తెచ్చేందుకు వ్య‌వ‌స్థ‌ల్ని ఎలా వాడుకోవాల‌న్న విష‌యంలో మోడీకి ఉన్నంత టాలెంట్ ఇప్ప‌టివ‌ర‌కూ మ‌రే ప్ర‌ధానికి లేద‌న్న విమ‌ర్శ ఉండ‌నే ఉంది. అదే స‌మ‌యంలో.. మీడియాకు సంబంధించి ఆయ‌న వ్య‌వ‌హ‌రించే వ్యూహం కూడా భిన్నంగా ఉండ‌టంతో.. క‌నిపించ‌ని ప‌రిమితుల‌తో మీడియా సంస్థ‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయ‌న్న మాట వినిపిస్తూనే ఉంది. ఇదే.. రాఫెల్ డీల్ పై ప‌లుగు.. పారల్ని మీడియా సంస్థ‌లు చేత ప‌ట్ట‌ని ప‌రిస్థితి.

కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ పార్ల‌మెంటులో రాపెల్ డీల్ మీద మాట్లాడ‌గా.. యుద్ద ప్రాతిప‌దిక‌న గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఎట‌కారం చేసేసి.. రాహుల్ ను కామెడీ చేసుకున్న వైనం తెలిసిందే. మ‌రి.. అలాంటి మోడీ.. తాజాగా ఫ్రాన్స్ మాజీ అధ్య‌క్షుడు హౌండా ఇచ్చిన ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూపైనా.. ఆయ‌న ప్ర‌స్తావించిన అంశాల మీద ఇప్ప‌టివ‌ర‌కూ నోరు ఎందుకు విప్ప‌లేదు?  జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించ‌టం లాంటివి చేయ‌టానికి మోడీకి టైం లేక‌పోవ‌చ్చు.. కానీ.. ఆయ‌న త‌ర‌చూ సందేశాలు పెట్టే ట్విట్ట‌ర్ ద్వారా అయినా కాస్తంత క్లారిటీ ఎందుకు ఇవ్వ‌న‌ట్లు..? అలాంటి వివ‌ర‌ణతో దేశ భ‌ద్ర‌తకు ఏమైనా ప్ర‌మాదం పొంచి ఉందేమో?
Tags:    

Similar News