రాజీవ్ పేరుతో ఓట్లు అడుగుతారా..మోడీ స‌వాల్

Update: 2019-05-07 06:31 GMT
ఎన్నిక‌ల వేళ.. ఎన్ని వ్యూహాలు అమ‌లు చేయాలో అన్నింటిని ప్ర‌ద‌ర్శించే టాలెంట్ ప్ర‌ధాని మోడీ సొంతం.  తాను దేశ ప్ర‌ధాని కుర్చీలో కూర్చున్న విష‌యాన్ని ఎన్నిక‌ల స‌మ‌యంలో పూర్తిగా మ‌ర్చిపోయే మోడీ.. ఎన్నిక‌ల ప్ర‌చారంలో గెలుపు త‌ప్పించి మ‌రింకే త‌న‌కు ప‌ట్ట‌వ‌న్న‌ట్లుగా వ్యాఖ్య‌లు చేస్తుంటారు. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో ఇదే తీరును ప్ర‌ద‌ర్శించిన మోడీ.. తాజాగా త‌న స్పీడ్ ను మ‌రింత పెంచుతున్నారు.

కాంగ్రెస్ ను టార్గెట్ చేయ‌టంలో తాను ముందున్నాన‌ని.. త‌న ప్రచారోప‌ణ‌ల‌ను బ‌లంగా తిప్పి కొట్ట‌లేని అశ‌క్త‌త రాహుల్ లో ఉండ‌టాన్ని గుర్తించిన మోడీ.. తాజాగా త‌న విమ‌ర్శ‌ల‌ను మ‌రింత పెంచుతున్నారు. తాజాగా గాంధీ ఫ్యామిలీ ప్ర‌స్తావ‌న తీసుకురావ‌టం ద్వారా రాహుల్ ను తెగ ఇబ్బందికి గురి చేస్తున్నారు.

రాహుల్ తండ్రి.. స్వ‌ర్గీయ మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీపై మోడీ అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌ట‌మే కాదు.. ఇప్పుడు ఆ వేగాన్ని మ‌రింత పెంచారు. రెండు ద‌శ‌ల్లో ఎన్నిక‌లు ముగుస్తున్న వేళ‌.. రాజీవ్ గాంధీ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన ఆయ‌న‌.. ఎన్నిక‌ల్ని కొత్త త‌ర‌హాలో ముగింపు ఇవ్వాల‌ని భావిస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది.

ఢిల్లీలో జ‌రిగే ఎన్నిక‌ల్లో రాహుల్ గాంధీ అవినీతి చుట్టూ చ‌ర్చ జ‌రిగేలా ఎజెండాను మోడీ సిద్ధం చేస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఇందులో భాగంగా తాజాగా రాజీవ్ గాంధీ ప్ర‌స్తావ‌న‌ను ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి అనూహ్యంగా తీసుకొచ్చారు. కాంగ్రెస్ ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేసేందుకు వీలుగా  బోఫోర్స్ కుంభ‌కోణాన్ని ప్ర‌స్తావించిన మోడీ.. అవినీతి మ‌ర‌క‌ల‌తో రాజీవ్ గాంధీ నిలిచిపోయార‌న్నారు. చ‌నిపోయిన వ్య‌క్తిపై అవినీతి మ‌ర‌క‌లు అంటించ‌టం ఏమిట‌ని కాంగ్రెస్ తీవ్రంగా విరుచుకుప‌డితే.. రాహుల్ అవినీతి మ‌ర‌క‌ల‌కు ఎవ‌రు క్లీన్ చిట్ ఇచ్చారంటూ మ‌రింత కాక పుట్టే మాట‌ను మాట్లాడారు మోడీ.  

కాంగ్రెస్ నేత‌ల‌కు నిజంగా ద‌మ్ముంటే.. రానున్న రెండు ద‌శ‌ల్లో జ‌రిగే ఎన్నిక‌ల్లో రాజీవ్ గాంధీ పేరుతో ఓట్లు అడ‌గ‌గ‌ల‌రా? అని ఆయ‌న ప్ర‌శ్నిస్తున్నారు. మోడీ మీద అవినీతి ఆరోప‌ణ‌లు చేస్తున్న కాంగ్రెస్ నేత‌లు కంగుతినేలా.. ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేలా తాజాగా ఆయ‌న రాజీవ్ ప్ర‌స్తావ‌న తీసుకొచ్చారు. అంతేకాదు.. రాజీవ్ గాంధీకి భోఫోర్స్ కుంభ‌కోణంలో ఎవ‌రు క్లీన్ చిట్ ఇచ్చార‌ని ప్ర‌శ్నిస్తున్న మోడీ మాట‌లు ఇప్పుడు కొత్త సెగ‌ను రేపుతున్నాయని చెప్ప‌క త‌ప్ప‌దు.



Tags:    

Similar News