నోట్ల రద్దులో మోడీ చేసిన అతి పెద్ద తప్పు ఇదే?

Update: 2016-11-14 07:19 GMT
సంచలన నిర్ణయం తీసుకోవటానికి ధైర్యం.. దమ్ము కావాలి. అవన్నీ తన దగ్గర టన్నులు.. టన్నులు ఉన్న విషయాన్ని తన నిర్ణయాలతో స్పష్టం చేశారు ప్రధాని మోడీ. పెద్దనోట్లను రద్దు చేయాలన్న సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న ఆయన.. దేశంలోని అందరికి పెద్ద షాక్ ను ఇచ్చారని చెప్పాలి. బ్లాక్ మనీకి చెక్ చెప్పేందుకు వీలుగా మోడీ తీసుకున్నఈ నిర్ణయం వెలువడిన వెంటనే.. ప్రజలంతా ఒక్కసారి సంభ్రమాశ్చర్యాల్లో మునిగిపోవటమే కాదు.. పేదోడి పెదవుల మీద చిరునవ్వులు విరిసిన పరిస్థితి.

మరింత సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న మోడీ.. పెద్ద తప్పు చేశారా? అదెలా? అన్న సందేహం రావొచ్చు. అక్కడికే వస్తున్నాం. నోట్ల రద్దు సందర్భంగా మోడీ చేసిన అతి పెద్ద తప్పు ఏమిటన్న విషయం మరింత బాగా అర్థం అయ్యేందుకు ఒక సింఫుల్ ఉదాహరణ చెబితే సరిపోతుది. అనుకోని రోడ్డు ప్రమాదం ఏదైనా జరిగిందనుకోండి. పెద్ద గాయమైందని అనుకుందాం. ఆ క్షణంలో ఏం జరుగుతుంది? మెదడు ఒక్కసారి ఫ్రీజ్ అయినట్లుగా అయిపోతుంది. దెబ్బ తగిలిన ప్లేస్ లో నొప్పి కలుగుతుంది. కానీ.. ఆ నొప్పి ఎంత పెద్ద గాయం అయ్యిందో అందుకు తగ్గట్లుగా ఏమీ ఉండదు. ఇంకా వివరంగా చెప్పాలంటే గాయం తగిలిన వెంటనే కలిగిన షాక్ తో గాయం నొప్పి కాస్త తక్కువగానే ఉంటుంది. గంటలు గడిచే కొద్దీ నొప్పి తీవ్రత పెరగటంతో పాటు.. గాయం కారణంగా మిగిలిన వ్యవస్థలకు జరిగే నష్టం తీవ్రత ఎంతన్నది అర్థమవుతుంటుంది.

ఇలాంటి ప్రమాదం జరిగిన వెంటనే.. అత్యుత్తమ వైద్య సేవలు చాలా అవసరం. ఎంత తొందరగా వీలైతే.. అంత త్వరగా చికిత్స చేయటంతో పాటు.. సదరు ప్రమాదానికి గురైన వారికి మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం చాలా ఉంది. పెద్దనోట్ల రద్దు నిర్ణయంతో మోడీ దేశానికి భారీ షాక్ ను ఇచ్చారు. దీని కారణంగా వాస్తవంగా నష్టపోయేది నల్ల కుబేరులే అయినా.. ఆ క్రమంలో సామాన్యుడి నుంచి ప్రజలందరికి కష్టాలు తప్పనిసరి.  ఈ నేపథ్యంలో.. అలా కష్టం కలిగే ప్రజలకు వీలైనంత తక్కువ కష్టం కలిగేలా యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకొని ఉంటే.. ఈ రోజు ప్రజల్లో నెలకొన్న అసంతృప్తి ఇంత స్థాయిలో ఉండేది కాదు. నోట్ల రద్దుపై నిర్ణయం తీసుకునే వరకూ వేసిన అడుగులు బాగానే ఉన్నా.. ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్న వెంటనే మోడీ జపాన్ పర్యటనకు వెళ్లటం ఆయన చేసిన పెద్ద తప్పుగా చెప్పాలి.

యావత్ దేశానికి షాకింగ్ లాంటి ఘటన చోటు చేసుకున్న వెంటనే.. చోటు చేసుకునే పరిణామాలు.. కదిలించాల్సిన వ్యవస్థలు.. తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన కర్త.. కర్మ.. క్రియ లాంటి వ్యక్తి అయిన మోడీ విదేశాలకు వెళ్లిపోవటంతో నిర్ణయం అనంతరం చేపట్టాల్సిన చర్యల్లో జాప్యం చోటు చేసుకుంది. అదే ఈరోజు దేశంలో నెలకొన్న సమస్యకు అసలు కారణంగా చెప్పొచ్చు. పెద్దనోట్ల రద్దు వెంటనే హ్యాపీగా ఫీలైన ప్రజలు.. కష్టం తమ వరకూ వచ్చి.. చిల్లర కోసం తిప్పలు పడటంతో వారికి మోడీ చర్య తొందరపాటుగా.. సరైన ప్లానింగ్ లేకుండా చేసిందన్న భావనకు గురి అవుతున్నారు.

 తమను దెబ్బ తీసిన మోడీపై బదులు తీర్చుకోవటానికి సరైన టైం కోసం చూస్తున్న రాజకీయ పార్టీలు కొన్ని ప్రజల్ని మరింత రెచ్చగొట్టేలా ప్రకటనలు చేస్తున్నాయి. యాక్సిడెంట్ జరిగిన వెంటనే ప్రధమ చికిత్సతో పాటు.. మెరుగైన వైద్య సేవలు ఎంత ముఖ్యమో.. నోట్ల రద్దు అనంతరం చోటు చేసుకునే సమస్యల పరిష్కారం మీద మోడీ దగ్గర ఉండి చర్యలు చేపట్టి ఉండి ఉంటే.. దేశ వ్యాప్తంగా ప్రజలు ఈ రోజు ఎదుర్కొనే సమస్యలు ఎంతోకొంత తగ్గి ఉండేవనటంలో సందేహం లేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News