మోదీ కూడా కోటీశ్వ‌రుడే!... ఇదిగో లెక్క‌!

Update: 2019-04-26 14:23 GMT
ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ... కుటుంబ బంధాల‌ను తెంచేసుకుని ప్ర‌జా సేవ‌కు అంకిత‌మైన నేత‌గా త‌న‌ను తాను వ‌ర్ణించుకుంటారు. జ‌న్మ‌నిచ్చిన త‌ల్లిదండ్రుల‌ను తోడ బుట్టిన వారితో పాటు క‌ట్టుకున్న భార్య‌ను కూడా అలా వ‌దిలేసి ఆరెస్సెస్ లో చేరిపోయిన మోదీ.... స్వార్థ‌మ‌న్న‌దే తెలియ‌నట్టుగా జీవ‌నం ప్రారంభించారు. ఇలాంటి వ్య‌క్తి ఇప్పుడు కోటీశ్వ‌రుడు అయిపోయారు అయినా ప్ర‌జా సేవ కోసం కుటుంబ బంధాల‌నే తెంచేసుకున్న మోదీ కోటీశ్వ‌రుడు ఎలా అయ్యార‌ని అనుమానిస్తున్నారా? ఇదేమీ అక్ర‌మ సంపాద‌న కాదులెండి. సుదీర్ఘ కాలం పాటు చ‌ట్ట స‌భ‌ల్లో స‌భ్యుడిగా కొన‌సాగుతూ వ‌స్తున్న ఆయ‌నకు ప్ర‌భుత్వం ద్వారా అందుతున్న వేత‌నాల‌ను పోగేసుకుంటూ వ‌స్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న ల‌క్షాధికారి హోదాను దాటేసి కోటీశ్వ‌రుడు అయిపోయారు. 

ఆరెస్సెస్ నుంచి బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చిన మోదీ.... గుజ‌రాత్ సీఎంగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేపట్టేదాకా పెద్ద‌గా ప‌రిచ‌యం లేని నేత కిందే లెక్క‌. అయితే గుజ‌రాత్ సీఎంగా ఎప్పుడైతే ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టారో... మోదీ త‌న గ్రాఫ్ ను ఒక్క‌సారిగా అమాంతంగా పెంచేసుకున్నార‌నే చెప్పాలి. ఆ త‌ర్వాత తిరుగులేని విజ‌యాల‌తో వ‌రుస‌గా గుజ‌రాత్ సీఎం సీటును కైవ‌సం చేసుకుంటూ వ‌చ్చిన మోదీ... 2014 ఎన్నిక‌ల్లో ఏకంగా జాతీయ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేసి పీఎం పోస్టులో కూర్చున్నారు. ఈ ద‌ఫా కూడా మ‌రోమారు పీఎం పోస్టుకు గురి పెట్టిన మోదీ... శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం వార‌ణాసి నియోజ‌క‌వ‌ర్గం నుంచి నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఆస్తుల‌కు సంబంధించిన వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి.

ప్ర‌స్తుతం మోదీ ఆస్తుల మొత్తం విలువ రూ.2.51 కోట్లు. ఆ ఆస్తుల్లో స్థిరాస్తుల విలువ రూ.1.1 కోటి కాగా... మిగిలిన‌దంతా (రూ.1.40) చ‌రాస్తులే. ప్ర‌స్తుతానికి మోదీ చేతిలో రూ.38,750 ఉన్న‌ట్లుగా స‌ద‌రు అఫిడ‌విట్ తెలిపింది. చ‌ట్ట‌స‌భ‌ల్లో స‌భ్యుడిగా కొన‌సాగుతూ వ‌స్తున్న మోదీకి ప్ర‌భుత్వం నుంచి అందుతున్న వేత‌నం ద్వారానే మోదీకి ఈ మేర ఆస్తులు పోగ‌య్యాయి. 2014 లో త‌న వార్షికాదాయాన్ని రూ.9.69 కోట్లుగా మోదీ ప్ర‌క‌టించారు. అయితే ఐదేళ్లు తిరక్కుండానే ఆ ఆదాయం రూ.19.92 ల‌క్ష‌ల‌కు (2018 వార్షికాదాయం) చేరిపోయింది. ఇదిలా ఉంటే... మోదీపై సింగిల్ క్రిమిన‌ల్ కేసు కూడా లేద‌ట‌.
Tags:    

Similar News