ఆంధ్రా అన్యాయంపై కేంద్రం ఇలా రియాక్ట్ కాదేం?

Update: 2018-08-30 05:29 GMT
ఆంధ్రోళ్ల‌కు క‌డుపు మండిపోయేలా వ్య‌వ‌హ‌రించింది కేంద్ర ప్ర‌భుత్వం. ఉమ్మ‌డి హైకోర్టు విభ‌జ‌న‌పై తాజాగా సుప్రీం ధ‌ర్మానం ముందు విచార‌ణ‌కు వ‌చ్చే వీలున్న నేప‌థ్యంలో కేంద్ర స‌ర్కారు దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ ఆశ్చ‌ర్య‌క‌రంగా మారింది. తెలంగాణ ప్ర‌యోజ‌నాల మీద గ‌ళం విప్పిన కేంద్రం.. ఇదే రీతిలో విభ‌జ‌న హామీల్లో ఆంధ్రాకు ప్ర‌యోజ‌నం వాటిల్లేలా  ఇప్ప‌టివ‌ర‌కూ ఎందుకు గ‌ళం విప్ప‌లేద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.

ఉమ్మ‌డి హైకోర్టు విభ‌జ‌న వివాదంగా మారిన నేప‌థ్యంలో.. విభ‌జ‌న వ్య‌వ‌హారంపై తెలంగాణ ప్ర‌భుత్వ వాద‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చే రీతిలో కేంద్రం దాఖ‌లు చేసిన అఫిడ‌విట్ ఉండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. ఉమ్మ‌డి హైకోర్టు విభ‌జ‌న‌కు ఏపీలో హైకోర్టు భ‌వ‌నం రెఢీ కాక‌పోవ‌టాన్ని చూపిస్తున్న తీరును త‌ప్పు ప‌డుతూ.. హైద‌రాబాద్‌లో కూడా రెండు కోర్టుల‌ను విభ‌జించొచ్చ‌ని  కేంద్రం పేర్కొంది. హైద‌రాబాద్‌లోనే రెండు రాష్ట్రాల‌కు వేర్వేరు హైకోర్టుల‌ను ఏర్పాటు చేయ‌టం చ‌ట్ట స‌మ్మ‌తమ‌ని వ్యాఖ్యానించ‌టం గ‌మ‌నార్హం.

మ‌రి.. ఇదే రీతిలో ఏపీకి ప్ర‌యోజ‌నం క‌లిగే రీతిలో ప్ర‌త్యేక హోదా మీద కేంద్రం ఎందుకిలా స్పందించ‌ద‌న్న‌ది ప్ర‌శ్న‌గా మారింద‌ని చెప్పాలి. కేంద్రం అఫిడ‌విట్ ను చూస్తే.. తెలంగాణ స‌ర్కారు చేసే వాద‌న‌నే మోడీ స‌ర్కారు వినిపించ‌టం గ‌మ‌నార్హం. తెలంగాణ స‌ర్కారు వాద‌న‌కు త‌గ్గ‌ట్లే కేంద్రం త‌న అఫిడ‌విట్ త‌యారు చేసినా.. ఏపీ ప్ర‌యోజ‌నాల గురించి కించింత్ కూడా ప్ర‌స్తావించ‌క‌పోవ‌టం గ‌మ‌నార్హం.

విభ‌జ‌న చ‌ట్టంలో ఏపీకి ప్ర‌యోజ‌నం క‌లిగించే అంశాల్ని త‌న‌దైన భాష్యాన్ని చెప్పే మోడీ స‌ర్కారు.. హైకోర్టు విభ‌జ‌న విష‌యంలో విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల్ని హైకోర్టు స‌రిగా అర్థం చేసుకోలేద‌న్న వాద‌న‌ను వినిపించ‌టం విశేషం. విభ‌జ‌న చ‌ట్టంలోని సెక్ష‌న్ 30..31లో పేర్కొన్నఅంశాల‌ను హైకోర్టు త‌ప్పుగా అర్థం చేసుకుంద‌న్న అభిప్రాయాన్ని కేంద్రం వినిపించింది. ఈ సెక్ష‌న్ల వ‌ల్లే ఏపీలో శాశ్వ‌త ప్ర‌దేశంలో త‌ప్ప మ‌రేచోట ప్ర‌త్యేక హైకోర్టు నిర్మాణం సాధ్య‌ప‌డ‌ద‌నే అభిప్రాయానికి కోర్టు రావ‌టం స‌రికాద‌న్నారు.

హైకోర్టు తీర్పును స‌వాలు చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం.. ఒక ప్రైవేటు వ్య‌క్తి రివ్యూ పిటిష‌న్ దాఖ‌లు చేసినా.. వాటిపై హైకోర్టు పెండింగ్ లో ఉండ‌టం వ‌ల్ల రెండు రాష్ట్రాల మ‌ధ్య ఆరోగ్య ప‌రిస్థితి దెబ్బ తింటుంద‌న్న వాద‌న‌ను కేంద్రం వినిపించింది. ఒక‌వేళ‌.. రెండు రాష్ట్రాల మ‌ధ్య సంబంధాలపై కేంద్రానికి అంత ఆలోచ‌నే ఉంటే.. రెండు రాష్ట్రాల మ‌ధ్య‌నున్న ప‌లు పంచాయితీల విష‌యంలో కేంద్రం పెద్ద‌న్న‌లా ఎందుకు వ్య‌వ‌హ‌రించ‌టం లేద‌న్న‌ది మ‌రో ప్ర‌శ్న‌. విభ‌జ‌న జ‌రిగి నాలుగున్న‌రేళ్లు అయినా.. ఇప్ప‌టివ‌ర‌కూ పెండింగ్ లో ఉన్న పంచాయితీలు పిచ్చ‌బోలెడు ఉన్నా.. వాటిని ప‌రిష్క‌రించేందుకు ముందుకు రాని కేంద్రం.. హైకోర్టు విభ‌జ‌న విష‌యంలో మాత్రం అంత ఉత్సాహంగా అఫిడ‌విట్ దాఖ‌లు చేయ‌టం వెనుక మ‌ర్మం ఏమిటి? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

Tags:    

Similar News