కౌగిలింత‌లతో క‌ట్టిప‌డేస్తున్న మోడీజీ

Update: 2017-06-28 06:26 GMT
మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సూప‌ర్ హిట్ మూవీ శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ సినిమాలో ఓ స‌న్నివేశం గుర్తుండే ఉంటుంది. ఆత్మీయ‌త‌తో కూడిన కౌగిలింత ద్వారా ఎంత‌టి క్లిష్ట‌మైన సంఘ‌ట‌న‌ను అయిన ఆహ్లాద‌ప‌ర్చ‌వ‌చ్చ‌ని చిరంజీవి నిరూపిస్తారు. స‌రిగ్గా అలాంటి పోలికే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ విదేశీ పర్యటనల విష‌యంలో కొంద‌రు ప్ర‌స్తావిస్తున్నారు. విదేశీ టూర్లంటే ప్ర‌త్యేక శ్ర‌ద్ధ క‌న‌బ‌ర్చే ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఈ సంద‌ర్భంగా ఆయా దేశాల అధినేతలను గాఢంగా ఆలింగనం చేసుకుంటూ ఆప్యాయతను ప్రదర్శించడం అందరినీ ఆకట్టుకుంటోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. స‌ద‌రు సంద‌ర్భాన్ని తేలిక చేయ‌డంలో ఈ హ‌గ్ అద్భుతంగా ప‌నిచేస్తోంద‌ని అంటున్నారు.

తాజాగా అమెరికా ప‌ర్య‌ట‌న‌లో కరచాలనం చేయబోయిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తనదైన గాఢాలింగనంతో కట్టిపడేశారు ప్ర‌ధాన‌మంత్రి. గతంలో బరాక్ ఒబామానే కాదు - తాజాగా మూడురోజుల అమెరికా పర్యటనను ముగించుకున్న మోడీ స్వాగత - వీడ్కోలు సందర్భాల్లో అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ను ఆలింగనం చేసుకుని తన హృదయపూర్వక కృతజ్ఞతలను చాటారు.త‌లబిరుసు ట్రంప్ ఏ దేశాధినేతతో అయినా అహంకారంతో అభివాదం చేస్తుంటారు. మరి, భారత ప్రధానితో శ్వేతసౌధంలో తొలిసారి ముఖాముఖిగా కలువనున్న నేతలిద్దరూ పరస్పరం ఎలా అభివాదం చేసుకుంటారోనని ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూసింది.

వైట్‌ హౌస్‌ కు చేరుకున్న మోడీని చూడగానే ట్రంప్ పరోక్షంగా తన ఆధిపత్యాన్ని సూచించేలా కరచాలనం చేయబోయారు. అయితే, మోడీ మాత్రం ట్రంప్‌ ను హత్తుకుని తన ఆప్యాయతను చాటారు. అంతేకాదు, ట్రంప్ కరచాలనానికి ప్రయత్నించినప్పుడల్లా మోడీ సమయోచితంగా దానిని ఆలింగనంగా మార్చేశారు. హంగు - ఆర్భాటానికి పేరుగాంచిన ఇద్దరు నేతలు ఇలా ఆలింగనంలో ఒదిగిపోవడం అందరినీ ఆకట్టుకుంది. వ్యవహార దక్షతలో ఆలింగనాన్ని గొప్ప ఎత్తుగా పలువురు విశ్లేషిస్తున్నారు. మూడేళ్లుగా వివిధ దేశాల్లో పర్యటించిన మోడీ ప్రతీ సందర్భంలోనూ తనదైన శైలిలో హత్తుకోవడం ద్వారా ఆయా దేశాధినేతలకు - ప్రముఖులకు ఆప్యాయతను - సౌహార్ద్రతను తెలియజేస్తూ వస్తున్నారని అంటున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News