నాలుగేళ్ల త‌ర్వాత అవే మాట‌లా మోడీ?

Update: 2018-07-15 04:44 GMT
మోడీ అంటే మెన‌గాడికి ప్ర‌తిరూపం. ఆయ‌న ఏమైనా చేయ‌గ‌ల‌రు. ఎందుకంటే.. ఆయ‌న మ‌హా తోపు. ఇలాంటి మాట‌ల్ని చాలానే చెబుతారు మోడీని పిచ్చ పిచ్చ‌గా అభిమానించే వారు.. ఆరాధించేవారు. అదే నిజ‌మైతే దేశం మొత్తం కాకున్నా.. ఎంపీగా ఆయ‌న్ను గెలిపించిన ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం వార‌ణాసి రూపురేఖ‌లు మారాలిగా..?

ఎంపీగా గెలిచి.. ఆ త‌ర్వాత ప్ర‌ధాని అయిన మోడీ..తాను ప్రాతినిధ్యం వ‌హించిన వార‌ణాసికి కొత్త రూపు క‌ల్పిస్తాన‌ని చెప్పారు. అయితే.. నేటికి అక్క‌డి ప‌రిస్థితుల్లో మార్పులు కొట్టొచ్చిన‌ట్లుగా ఏమీ క‌నిపించ‌ని ప‌రిస్థితి. ఇక‌.. ఆయ‌న గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారంలో ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించిన గంగ ప్ర‌క్షాళ‌న గురించి ఎంత త‌క్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్ర‌మైన కాశీ దుస్థితి గురించి తాజాగా ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ.. వార‌ణాసి దుస్థితికి గ‌త ప్ర‌భుత్వాలే కార‌ణంగా ఆయ‌న అభివ‌ర్ణించారు. ప్రాచీన వైభ‌వాన్ని కోల్పోకుండానే కాశీని అధునాత‌నంగా తీర్చి దిద్ద‌నున్న‌ట్లు చెప్పారు. ఇలాంటి మాట‌ల‌న్ని అధికారంలోకి వ‌చ్చిన ఏడాది లోపే చెప్పి.. ఇప్ప‌టికి చేత‌ల్లో చేసి చూపించి ఉంటే ఒక ప‌ద్ద‌తిగా ఉండేది.

నాలుగేళ్ల సుదీర్ఘ స‌మ‌యం త‌ర్వాత కూడా ఆయ‌న వార‌ణాసిని అది చేస్తా.. ఇది చేస్తాన‌ని చెబుతూ.. ఇప్ప‌టి దుస్థితికి గ‌త ప్ర‌భుత్వాలే కార‌ణ‌మంటూ గ‌ల్లీ నాయ‌కుడిలా మాట్లాడ‌టం చూస్తే.. మోడీ అస‌లు స్వ‌రూపం ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ప్ర‌ధాన‌మంత్రి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గంలోనూ అభివృద్ధి ప‌నులు ప‌రుగులు తీయ‌లేదంటే.. మోడీ పాల‌న ఎలా సాగుతుందో ఇట్టే చెప్పొచ్చు. ఐదేళ్ల ప‌ద‌వీ కాలంలో నాలుగేళ్లు గ‌డిచిన వేళ‌.. వార‌ణాసిని ఆధునాత‌నంగా చేస్తామ‌ని ప్ర‌క‌ట‌న‌లు చేయ‌టం.. మోడీ చేత‌కానిత‌నానికి నిద‌ర్శ‌నంగా చెప్ప‌క త‌ప్ప‌దు.

త‌మ హ‌యాంలో కాశీలో అభివృద్ధి చేసిన‌ట్లు చెబుతూ.. కొట్టొచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంద‌ని వ్యాఖ్యానించారు. నిజంగా అంత కొట్టొచ్చిన‌ట్లు క‌నిపిస్తే.. వార‌ణాసిని తామెంత‌లా మార్చేశామ‌న్న విష‌యాన్ని ప్ర‌ముఖంగా ప్ర‌చారం చేసుకుసే వారు క‌దా? ఒక‌వేళ‌.. అంత అభివృద్ధే చేసి ఉంటే.. ఆ జాబితాను చెబుతూ.. ఇప్పుడు ప్రారంభించిన రూ.1000 కోట్ల ప‌నుల వివ‌రాల్ని గొప్ప‌గా చెప్పుకునే వారు క‌దా?  అలాంటిదేమీ లేకుండా.. గ‌త పాల‌కుల మీద ఆరోప‌ణ‌లు చేసి త‌ప్పించుకోవాల‌ని చూడ‌టం చూస్తే.. ప్ర‌ధాని మోడీ మీద ఉన్న గౌర‌వం త‌గ్గటం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News