మోడీ కేబినెట్ లో అమిత్ షాకు ఈ శాఖే..!?

Update: 2019-05-31 04:23 GMT
రెండోసారి అధికారంలోకి వచ్చాక మోడీ దేశంలోనే అత్యంత శక్తివంతుడైన నాయకుడిగా మారిపోయాడు. తనకు అధికారం ప్రాప్తించడానికి పాటుపడ్డ బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ని కేంద్రమంత్రివర్గంలోకి తీసుకున్నారు.తొలి ప్రభుత్వంలో బీజేపీ పార్టీ పగ్గాలే చేపట్టిన అమిత్ షా ఈసారి కేంద్రమంత్రివర్గంలో కీలకంగా మారనున్నారు.

ఇక పోయిన హయాంలో దేశానికి కీలకమైన ఆర్థికశాఖను చూసిన అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో ఆయన ఈసారి కేబినెట్ మంత్రి పదవి చేపట్టలేదు. దాంతో జైట్లీ ప్లేసులో ఇప్పుడు అమిత్ షాకు కీలక ఆర్థిక శాఖ పదవిని మోడీ ఇవ్వబోతున్నాడని ఇండియా టుడే గురువారం రాత్రి వెల్లడించింది.

మోడీ తర్వాత రాజ్ నాథ్ ప్రమాణం చేశారు. దీన్ని బట్టి కేంద్రంలో రెండో అత్యున్నత పదవి హోంశాఖను రాజ్ నాథ్ చేపట్టబోతున్నారని అర్థమైంది. ఇక మూడో స్థానంలో మంత్రిగా ప్రమాణం చేశారు అమిత్ షా. హోం తర్వాత కీలకమైన ఆర్థిక శాఖనే అమిత్ కు ఇస్తారని సమాచారం. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థ భారత దేశానిది. జైట్లీ గైర్హాజరీలో చేపట్టిన గోయల్ ఫర్వాలేదనిపించినా.. అంతకుమించి దేశాన్ని ముందుకు నడిపించే ఆర్థిక శాఖను పరుగులు పెట్టించాలి. అందుకే దేశంలో బీజేపీ విజయానికి కారకుడై.. పార్టీకి పెద్దదిక్కుగా ఉన్న అమిత్ షాకు ఆ పదవి ఇవ్వాలని మోడీ డిసైడ్ అయినట్టు సమాచారం.

ఇక ఆరోగ్య సమస్యల కారణంగానే పోయిన ప్రభుత్వంలో విదేశాంగ శాఖ మంత్రిగా చేసిన సుష్మా స్వరాజ్ ఈసారి మంత్రివర్గంలో చేరలేదు. దీంతో ఆమె స్థానంలో విదేశాంగ శాఖ కార్యదర్శిగా పనిచేసిన జైశంకర్ ను నియమించబోతున్నారు. జైశంకర్ 2018లో ఉద్యోగం విరమణ చేశారు. ఇప్పుడు ఆయన అనుభవం పనికి వస్తుందని.. సుష్మ స్థానాన్ని భర్తీ చేయాలని మంత్రివర్గంలోకి జైశంకర్ ను తీసుకున్నట్టు తెలిసింది. అమెరికా, చైనాలకు కూడా జైశంకర్ రాయబారిగా చేయడంతో ఆయన సేవలు విదేశాంగ శాఖకు ఉపయోగపడుతాయని మోడీ భావిస్తున్నారు.

అలాగే పీయూష్ గోయల్ కు రైల్వే శాఖను అలాగే ఉంచి.. గడ్కరీకి మౌలిక సదుపాయాలు, గజేంద్ర సింగ్ షెకావత్ కు వ్యవసాయ శాఖ కేటాయించే అవకాశాలున్నట్లు ఢిల్లీ వర్గాల్లో చర్చ సాగుతోంది.

ఇక ఈసారి మంత్రి పదవి దక్కని సీనియర్ బీజేపీ నాయకురాలు మేనకాగాంధీని తాత్కాలిక ప్రొటెం స్పీకర్ గా మోడీ నియమించబోతున్నట్టు సమాచారం. గత ప్రభుత్వంలో మేనక మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేశారు. ఆమె వయసు 75 ఏళ్లు దాటడంతోనే ఆమెకు మంత్రి పదవి దక్కలేదని సమాచారం.


Tags:    

Similar News