దేశ ఆర్థికంపై మోడీ పిల్లి మొగ్గ‌లా..మ‌రీ ప‌గ‌టి క‌ల‌లా...!

Update: 2019-07-05 07:04 GMT
తాజాగా కేంద్రం ప్ర‌వేశ పెట్టిన వార్షిక బ‌డ్జెట్ లో అనేక సంచ‌ల‌నాల‌కు ప్ర‌భుత్వం తెర‌దీసింది. సామాన్య‌లు నుంచి కార్పొరేట్ రంగం వ‌ర‌కు అనేకానేక వ‌రాలు ప్ర‌క‌టించింది. వీటిలో ప్ర‌ధానంగా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను మ‌రింత ప‌రిపుష్టం చేసే దిశ‌గా నిర్ణ‌యాలు ఉండ‌డం ఆశాజ‌న‌క‌మే. అయితే, ఇప్పుడు బ‌డ్జెట్‌ లో ప్ర‌క‌టించిన విధంగా వ‌చ్చే ఐదేళ్ల‌లో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ మారిపోతుందా? అనేది కూడా ఇప్పుడు మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా మారింది. తాజాగా కేంద్ర ప్ర‌భుత్వ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ పెట్టిన నిర్మ‌లా సీతారామ‌న్‌.. దేశంలో ఇప్పుడు ఆర్థిక ట‌ర్నోవ‌ర్ మూడు ట్రిలియ‌న్ డాల‌ర్లుగా ఉంద‌ని పేర్కొన్నారు.

అయితే, వ‌చ్చే ఐదేళ్ల‌లో దీనిని ఐదు ట్రిలియ‌న్ డాల‌ర్ల‌కు పెంచుతాన‌ని ఆమె ప్ర‌క‌టించారు. అయితే ప్ర‌స్తుతం ఉన్న ఆర్థిక ప‌రిస్థితికి - ఆమె చేసిన ప్ర‌క‌ట‌న‌కు మ‌ధ్య చాలా వ్య‌త్యాసం క‌నిపిస్తోంది. 2016లో పెద్ద నోట్ల ర‌ద్దు అనంత‌ర ప‌రిస్థితి - 2017లో తీసుకు వ‌చ్చిన జీఎస్టీ విధానం వంటివాటి ప్ర‌భావం ఇప్ప‌టికీ దేశ ఆర్థిక ప‌రిస్థితిని కుంగ‌దీస్తూనే ఉంది. అనేక చిన్న త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు - ముఖ్యంగా ప్ర‌భుత్వ రంగంలోని ప‌రిశ్ర‌మ‌లే మూత‌బ‌డ్డాయి. ఇప్ప‌టికీ . ఇంకా మూత‌బ‌డుతున్న ప‌రిశ్ర‌మల జాబితా పెద్ద‌గానే ఉంది. ఈ నేప‌థ్యంలో ఐదు సంవ‌త్స‌రాల్లో ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప‌రుగులు పెట్టించి రెండు రెట్లు పెంచ‌డం సాహ‌స‌మే అవుతుంది.

నిజానికి దేశంలో అక్ష‌రాస్య‌త శాతం 66గానే ఉన్న‌ప్పుడు ఆర్థిక వ్య‌వ‌స్థ ముందుకు వెళ్ల‌డం అనేది చాలా క‌ష్ట‌మ‌నేది ప్ర‌తి ఒక్క‌రివాద‌న‌. మ‌రీ ముఖ్యంగా ఇప్ప‌టికీ గ్రామీణ ప్రాంతాల్లో అక్ష‌రాస్యత మ‌రింత నాసిర‌కంగా ఉంది. అదేస‌మ‌యంలో గ్రామీణ ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంది. రైతులు ఇప్ప‌టికీ న‌ష్టాల సేద్య‌మే చేస్తున్నారు. పెట్టుబ‌డికి త‌గిన ఆదాయం లేకుండానే రైతులు ముందుకు సాగుతున్నారు. ఇక‌, ఐటీ రంగంలోనూ మేలు మెరుపులు క‌నిపించ‌డం లేదు. ఉద్యోగ క‌ల్ప‌న కూడా ఆశించిన మేర‌కు సాగ‌డం లేద‌ని ప్ర‌భుత్వ గ‌ణాంకాలే వెల్ల‌డిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో నిర్మ‌ల చెబుతున్న ఐదు ట్రిలియ‌న్ల ఆదాయం వినేందుకే త‌ప్ప ఆచ‌ర‌ణ‌లో సాధ్యం అనేది ప్ర‌శ్న‌గానే మార‌నుంది.
Tags:    

Similar News