ఈ ‘56 అంగుళాల ఛాతీ’ ఏమైనా చేయగలదు

Update: 2016-10-01 05:46 GMT
మాటలే కాదు... చేతలు సైతం తీవ్రంగానే ఉంటాయి. స్నేహానికి ఎంత విలువ ఇస్తారో.. దెబ్బకు దెబ్బ కూడా అంతే బలంగా కొట్టగలరన్న విషయాన్ని ప్రధాని మోడీ చెప్పకనే చెప్పేశారు. ఫ్రెండ్ షిప్ లో భాగంగా ప్రోటోకాల్ లాంటివి పక్కన పెట్టి మరీ ప్రధాని హోదాలో ఉన్న తానే స్వయంగా దాయాది ఇంటికి వెళ్లి మరీ విషెస్ చెప్పేయటమే కాదు.. తేడా వస్తే.. అదే దాయాది గడ్డ మీదకు తన సైన్యాన్ని పంపి.. ఉగ్రవాదుల పీచమణిచే సర్జికల్ స్ట్రైక్స్ చేపడతానన్న విషయాన్ని తాజా చర్యతో మోడీ స్పష్టం చేసినట్లైంది.

2014 ఎన్నికల సందర్భంగా చేపట్టిన ప్రచారంలో పాక్ విషయంలో తాను అనుసరించే విధానాన్ని మోడీ స్పష్టం చేసేశారు. పాక్ కు సరైన సమాధానం ఇవ్వటంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని.. 56 అంగుళాల ఛాతీని చూపించలేకపోయారంటూ మోడీ విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో మోడీ కానీ పవర్ లోకి వస్తే.. పాక్ మీద దాడులు తప్పవని చాలామంది అంచనా వేశారు. అయితే.. ఎన్నికల ప్రచారానికి.. తర్వాత మోడీ చేష్టలకు ఏ మాత్రం సంబంధం లేదనే చెప్పాలి.

ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన వెంటనే.. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసే కార్యక్రమానికి పాక్ ప్రధానిని హాజరు కావాలంటూ స్వయంగా ఆహ్వానించి స్నేహ హస్తాన్ని చాచే ప్రయత్నం చేయటమే కాదు.. తమకున్న వ్యక్తిగత స్నేహంతో.. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ పుట్టినరోజు కమ్ మనమరాలి పెళ్లికి స్వయంగా హాజరై తన మార్క్ ను ప్రదర్శించారు. ఆఫ్ఘాన్ పర్యటన నుంచి భారత్ కు తిరిగి వచ్చే సమయంలో నాటకీయంగా పాక్ కు వెళ్లి.. విషెస్ చెప్పి.. మోడీలోని మరో కోణాన్ని ప్రదర్శించారు.

ఈ సందర్భంగా కొందరు రాజకీయ నేతలు.. 56 అంగుళా చాతీ అంటే.. పాక్ కు వెళ్లి బర్త్ డే విషెస్ చెప్పటమా? అంటూ విమర్శించినోళ్లు లేకపోలేదు. అయితే.. దేన్నైనా స్నేహంతో సాధించాలని.. అప్పటికి సాధ్యం కాకపోతే దండన తప్పదన్న విషయాన్ని తాజా సర్జికల్ స్ట్రైక్స్ తో మోడీ స్పష్టం చేశారని చెప్పాలి. మోడీకి.. ఎన్డీయే ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన వాజ్ పేయ్ కావొచ్చు.. ఆ తర్వాత ప్రధానిగా పదేళ్లు వ్యవహరించిన మన్మోహన్ లాంటి వారంతా.. ‘గీత’ దాటే ఆలోచన చేయలేదు. తరచూ తన ‘గీత’ దాటే పాకిస్థాన్ కు అర్థమయ్యేలా సమాదానం చెప్పలేదు.  కానీ.. మోడీ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటమే కాదు.. నియంత్రణ రేఖ దాటేసి మరీ లక్షిత దాడులతో పాక్ వెన్ను జలదరించేలా చేయటమే కాదు.. మిగిలిన వాళ్ల లాంటోడు కాదు మోడీ అన్న విషయాన్ని చెప్పేశారు. ఎన్నికల ప్రచార సమయంలో చెప్పినట్లే 56 అంగుళాల ఛాతీ సత్తా ఏమిటన్నది రుచి చూపించి..తానేమిటన్నది ప్రపంచానికి అర్థమయ్యేలా చేశారని చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News