మోడీకి ముందుంది ముసళ్ల పండుగే..!

Update: 2018-05-25 03:21 GMT
బీజేపీ నేత‌ల‌కు ఓ వైపు మోదం...ఇంకోవైపు ఖేదం అనే ప‌రిస్థితులు ఎదుర‌వుతున్నాయ‌ని అంటున్నారు. ఎందుకంటే ఆ పార్టీకి స‌ర్వం తానే అయిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కారుకు గత నాలుగేళ్లుగా అదృష్టం వెన్నంటి నిలిచింది. ఒకవైపు చమురు రంగం.. మరోవైపు రుతుపవనాలు మోడీకి, ఆయన ప్రభుత్వానికి ఎంతగానో లాభించాయి. అయితే అదంతా గతం. ఇప్పుడు సార్వత్రిక ఎన్నికల ముంగిట పలు బాహ్య (అంతర్జాతీయ) సమస్యలు మోడీ సర్కారును చుట్టుముట్టడంతో ముందున్నదంతా ముసళ్ల పండుగేనని అంతర్జాతీయ రేటింగ్ సంస్థ క్రిసిల్ స్పష్టం చేసింది. ప్రత్యేకించి అంతర్జాతీయ మార్కెట్లలో రోజు రోజుకూ పెరుగుతున్న ముడి చమురు ధరల్లాంటి పలు అంశాలు ఇప్పుడు సమస్యలుగా పరిణమించడంతో కీలకమైన ఐదో సంవత్సరంలో మోడీ సర్కారుకు విషమ పరీక్ష తప్పదని గురువారం విడుదల చేసిన తాజా నివేదికలో క్రిసిల్ పేర్కొంది.

క్రిసిల్ ముఖ్య ఆర్థికవేత్త ధర్మకీర్తి జోషి తమ తాజా నివేదిక‌లో అనేక అంశాల‌ను పంచుకున్నారు. ` గత నాలుగేళ్ల‌లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 7.3 శాతం వృద్ధిని సాధించింది. అంతకుముందు యూపీఏ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు పదేళ్ల‌లో నమోదైన సగటు వృద్ధిరేటు (7.6 శాతం) కంటే ఇది తక్కువే అయినప్పటికీ ఈ నాలుగేళ్ల‌లో స్థూల ఆర్థిక సూచీలు ఎంతగానో మెరుగుపడినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే ద్రవ్యలోటు, కరెంటు ఖాతా లోటు కూడా ఎంతగానో మెరుగుపడినప్పటికీ గత ఏడాది పరిస్థితులు ఎదురు తిరిగాయి` అని ఆయన అన్నారు. రుతుపవనాలు, ముడి చమురు ధరలు అనుకూలించడం వలన గత నాలుగేళ్ల‌లో కేంద్రం నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలను కొంతమేర నియంత్రించగలిగినప్పటికీ ప్రస్తుతం ముడి చమురు ధరల పెరుగుదల వలన ఉత్పన్నమవుతున్న పరిస్థితులు మోడీ సర్కారుకు పరీక్షగా నిలువనున్నాయని ఆయన తెలిపారు. ``ముడి చమురు ధరల పెరుగుదలతో ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభించి పతాక స్థాయికి చేరుకుంటుంది. దీని వలన స్థూల ఆర్థిక సూచీలకు కూడా తీవ్రమైన నష్టం వాటిల్లుతుంది. ముడి చమురు ధరలో ప్రతి 10 డాలర్ల పెరుగుదల వలన ద్రవ్యలోటు 0.08 శాతం, కరెంటు ఖాతా లోటు 0.40 శాతం పెరుగుతుంది. దీనికి తోడు రూపాయి విలువ కూడా నానాటికీ క్షీణిస్తుండటంతో సమస్యలు మరింత జఠిలమవడం ఖాయం`` అని క్రిసిల్ తన నివేదికలో స్పష్టం చేసింది.

ఇదిలాఉండ‌గా...మరోవైపు మోడీకి సౌదీ అరేబియా నుంచి మరింత సెగ తగులనుంది. బ్యారెల్ ముడి చమురు ధరను 80 డాలర్ల మార్కును దాటించేందుకు ఆ దేశం కంకణం కట్టుకోవడమే ఇందుకు కారణం. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి గత నాలుగేళ్లుగా చాలా తక్కువ ధరకే చమురు లభించినప్పటికీ దేశంలో మోడీ సర్కారు పెట్రోలియం రిటైల్ అమ్మకం ధరలను తగ్గించకపోవడమే కాకుండా సుంకాల పేరుతో ప్రజలుకు మరిన్ని వాతలు పెట్టి ఖజానా నింపుకున్న విషయం విదితమే. అయితే ఇప్పుడు దేశంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు ఆల్‌టైమ్ రికార్డులను అధిగమించి మరింత ముందుకు దూసుకెళ్తుండటంతో మోడీ సర్కారుపై ఒత్తిడి రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ ధరల పెరుగుదల పట్ల దేశంలోని దాదాపు అన్ని వర్గాల నుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతుండటంతో వచ్చే ఏడాది జరుగనున్న సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీసే అవకాశం కనిపిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఇంధనంపై కేంద్ర ప్రభుత్వం మరోసారి ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించడంతో పాటు విలువ ఆధారిత పన్ను (వ్యాట్)ను తగ్గించేలా రాష్ర్టాలను ఒప్పించి పెట్రో మంట నుంచి ప్రజలకు ఉపశమనాన్ని కలిగించాల్సిన అవసరం ఎంతో ఉందని నొమురా ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ సెక్యూరిటీస్ ఇండియా స్పష్టం చేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో బ్యారెల్ ముడి చమురు (బ్రెంట్) ధర గత వారంలోనే 80 డాలర్ల మార్కును తాకిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఇది 147.50 డాలర్ల ఆల్‌టైమ్ గరిష్ఠ ధర కంటే చాలా వెనుకబడి ఉన్నది. అయితే ప్రస్తుతం దేశంలో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరల్లో సగం కంటే ఎక్కువగా ఉన్న స్థానిక పన్నులను తగ్గిస్తే సర్కారు రాబడులు తగ్గిపోతాయి. కిరోసిన్, వంట గ్యాస్‌పై సబ్సిడీల భారం నానాటికీ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పెట్రోల్, డీజిల్‌పై సుంకాలను తగ్గించడం మోడీ సర్కారుకు కత్తిమీద సాము లాంటి వ్యవహారమే. ఈ నేప‌థ్యంలో మోడీకి రాబోయేకాలమంతా ప‌రీక్షా స‌య‌మ‌మేన‌ని అంటున్నారు.
Tags:    

Similar News