అమెరికా కాంగ్రెస్ ను ఫిదా చేసిన మోడీ స్పీచ్ ఏంది?

Update: 2016-06-09 05:39 GMT
అమెరికా కాంగ్రెస్ ను ఉద్దేశించి ప్రసంగించటమే గొప్ప గౌరవం. దానికే మురిసిపోయే అధినేతలు ఎందరో. అదో గొప్పగా ఫీలవుతుంటారు వివిధ దేశాల ప్రజలు. అలాంటిది.. తన 45 నిమిషాల ప్రసంగంలో 40 సార్లు చప్పట్లతో అమెరికా కాంగ్రెస్ సభ్యులు చప్పట్లతో మారు మోగించటమే కాదు.. ఎనిమిదిసార్లు నిలబడి మరీ.. గౌరవంగా కరతాళధ్వనులు చేయటం ఏమిటి? అమెరికన్ కాంగ్రెస్ ను అంతగా కదిలించింది ఏమిటి? మోడీ స్పీచ్ లో ఏముంది? అమెరికన్లను విపరీతంగా పొగిడేశారా? అంటే అదీ లేదు. ఎక్కడ తగలాలో అక్కడ తగిలేలా చురకలు వేశారు కూడా.అమెరికా కాంగ్రెస్ లో అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. వారి విధానాల మీద చురకలు వేయటం ఒక ఎత్తు అయితే.. తాను వేసిన చురకలకు నవ్వకుండా ఉండలేనట్లుగా చేయటం మోడీ మాటల మేజిక్ గా చెప్పాలి. చారిత్రక ప్రసంగాల గురించి చదువుతుంటాం. అదృష్టం ఏమిటంటే.. అలాంటి చారిత్రక స్పీచ్ కు మనం సాక్ష్యులం కావటం. అమెరికా కాంగ్రెస్ ఊగిపోయేలా చేసిన మోడీ ప్రసంగంలో ఏముందన్న విషయాన్ని చూస్తే..

= ఈ ప్రజాస్వామ్య దేవాలయం.. ప్రజాస్వామ్యం దిశగా వెళ్లేందుకు అనేక దేశాలకు స్ఫూర్తినిచ్చింది. ప్రోత్సాహాన్నించ్చింది. లింకన్ మాటల్లో చెప్పాలంటే.. స్వేచ్ఛ.. సమానత్వ భావనలకు ఊపిరిలూదింది. ఇక్కడ ప్రసంగించే అవకాశం లభించటం ఎంతో గౌరవంగా భావిస్తున్నా.

= మా పౌరులకు భయం నుంచి స్వాతంత్ర్యం ఉంది. భారత్ ఒకటిగా జీవిస్తుంది. అభివృద్ధి చెందుతుంది. పండుగ చేసుకుంటుంది. నా ప్రభుత్వానికి రాజ్యాంగం నిజమైన పవిత్ర గ్రంధం. 80 కోట్ల మంది నా దేశ ప్రజలు ఐదేళ్లకోసారి ఓటేయొచ్చు. కానీ.. మా 125 కోట్ల మందికీ భయం నుంచి ప్రతిక్షణం స్వాతంత్ర్యం ఉంది.

= సముద్ర అఖాతాల నుంచి.. విశ్వాంతరాళం వరకూ వ్యాపించిన బంధం మనది. మీది అతి ప్రాచీన ప్రజాస్వామ్య దేశం. మాది అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం. మీ చట్ట సభలో ప్రసంగించటం.. 125 కోట్ల మందితో కూడిన భారత్ కు లభించిన గౌరవం.

= మనుషులంతా సమానమే అని చాటి చెప్పిన అబ్రహం లింకన్ స్ఫూర్తిని ప్రపంచానికి అందించిన ఘనమైన దేశం అమెరికా. అలాంటి దేశ చట్టసభలో అరుదైన గౌరవం నాకిచ్చారు. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశ ప్రతినిధిగా.. అత్యంత ప్రాచీన ప్రజాస్వామ్య దేశమైన అమెరికాలో ప్రసంగిస్తున్నా.

= అమెరికా పర్యటనలో భాగంగా రెండు రోజుల క్రితం ఆర్లింగ్టన్ జాతీయ శ్మశాన వాటికకు వెళ్లాను. అక్కడ.. ఎందరో అమర వీరులైన సైనిక సమాధులను చూశాను. ప్రపంచం నలుమూలల ఎక్కడెక్కడో మానవాళికి సేవ చేసేందుకు వారు ప్రాణాలు ఆర్షించారు. ఈ నేల సాహిసికులకు.. స్వేచ్ఛకు నిలయం.

= భిన్నమైన చరిత్రలు.. సంస్కృతులు.. విశ్వాసాలు.. నమ్మకాల ఆధారంగా నిర్మితమైన దేశాలు మనవి. కానీ.. ప్రజాస్వామ్యం.. స్వేచ్ఛకు సంబంధించి మనది ఉమ్మడి లక్షణం. పౌరులంతా ఒక్కటే అన్న భావన పుట్టింది అమెరికా రాజ్యాంగం నుంచే. మా దేశ నిర్మాతలు సైతం ఇదే ఆశించి.. ఆచరించారు. భారత్ స్వాతంత్ర్యం పొందిన తొలినాళ్లలో.. ఇది ప్రజాస్వామ్య దేశంగా నిలబడుతుందా? అని చాలామంది సందేహించారు. చివరకు.. అలా శంకించిన వారే ఓడిపోయారు.

= భారత సరిహద్దుకు పశ్చిమం నుంచి ఆఫ్రికా వరకూ లష్కరే తోయిబా.. తాలిబాన్.. ఐసిస్ లాంటి విభిన్నమైన పేర్లు ఉన్నాయి. కానీ.. వారి సిద్దాంతం ఒక్కటే. విద్వేషం.. హత్య.. హింస. దాని నీడ ప్రపంచమంతా విస్తరించి ఉన్నప్పటికీ దానిని పెంచి పోషిస్తోంది భారత్ పొరుగునే. మానవాళిపై నమ్మకమున్న వారు ఉగ్రవాదంపై పోరాడటానికి ఒకటిగా ముందుకు రావాలి.

= ఆ మహమ్మారికి వ్యతిరేకంగా ఒకే గొంతుతో మాట్లాడాలి. రాజకీయ ప్రయోజనాల కోసం ఉగ్రవాదాన్ని బోధించే వారికి.. ఆచరించే వారికి విస్పష్టమైన సందేశం పంపాలని అమెరికాకాంగ్రెస్ సభ్యుల్ని నేను కోరుతున్నా.

= వారికి ప్రోత్సాహం ఇవ్వటానికి నిరాకరించటం.. వారి చర్యలకు వారిని బాధ్యులుగా నిలబెట్టే దిశగా తొలి చర్య అవుతుంది. మనం మన భద్రతా సహకారాన్ని బలోపేతం చేసుకోవటం ఇప్పుడు తక్షణ అవసరం.  2008 నవంబరులో ముంబయి పై ఉగ్రవాద దాడి అనంతరం భారత్ కు మద్దుతగా అమెరికా నిలబడింది. అది మేం ఎన్నడూ మరిచిపోం.

= మానవత్వమే మన మనం అని షికాగోలో స్వామీ వివేకానంద ఉద్ఘాటించారు. మహాత్మా గాంధీ అహింసా సిద్ధాంతం మార్టిన్ లూథర్ కింగ్ నాయకత్వానికి స్ఫూర్తిగా నిలిచింది. మస్సాచూసెట్స్ ఎవెన్యూలో గాంధీ విగ్రహానికీ.. మార్టిన్ లూథర్ కింగ్ స్మారకానికి మధ్య దూరం 3 మైళ్లే. ఇది మన సిద్ధాంతాల మధ్య సామీప్యతకు నిదర్శనం.

= అమెరికాలో మూడు కోట్ల మంది యోగా ఆచరిస్తున్నారు.. త్రోబాల్ విసిరే వారి కంటే.. యోగా కోసం శరీరాన్ని వంచుతున్న వారి సంఖ్యే ఎక్కువ. కానీ.. యోగాపై హక్కులు మావేనని ఎప్పుడూ చెప్పుకోలేదు సుమా.

= 30 లక్షల మంది భారతీయ అమెరికన్లు మన రెండు దేశాలకు అనుసంధానంగా నిలుస్తున్నారు. వారిలో ఉత్తమ సీఈవోలు.. విద్యావేత్తలు.. శాస్త్రవేత్తలు.. ఆర్థికవేత్తలు.. వైద్యులు ఉన్నారు. చివరకు.. స్పెల్లింగ్ బీ చాంఫియన్లు కూడా ఉన్నారు.

= నేను అమెరికాలో అడుగు పెట్టే ముందు అఫ్ఘనిస్తాన్ లో పర్యటించా. తమ జీవితాలు మెరుగుపడటానికి అమెరికన్లు చేసిన త్యాగ్యాన్ని అఫ్ఘన్ ప్రజలు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. భూమిని తల్లిగా ఆరాధించే దేశం మాది. ప్రకృతిని ప్రేమించటం మా నాగరికతలో భాగం.

Tags:    

Similar News