మోడీ మార్క్‌; అడుక్కోం.. అది మా హక్కు

Update: 2015-04-12 08:46 GMT
ఆచితూచి మాట్లాడటం.. ఏం మాట్లాడితే ఏం జరుగుతుందోనన్న ఆలోచన.. దూకుడుగా వ్యవహరించే తత్వం లేకపోవటం.. అందరిని కలుపుకుపోయే స్వభావం సరిగా లేకపోవటం లాంటి సవాలక్ష సమస్యలతో భారత విదేశాంగ విధానం పుణ్యమా అని భారత్‌కు ప్రపంచ రాజకీయాల్లో ఉండే ప్రాధాన్యత అంతంత మాత్రమే.

ప్రపంచ జనాభాలో రెండోస్థానంలో ఉన్న భారత్‌ దేశం.. ప్రపంచ పరిణామాలకు.. ప్రపంచానికి సంబంధించిన తీసుకునే నిర్ణయాలకు మిగిలిన వాటితో మాదిరే తప్ప  ప్రత్యేకహోదా లేదు. మిగిలిన వాటి సంగతి ఎలా ఉన్నా.. కనీసం ఐక్యరాజ్యసమితిలో అత్యంత కీలకమైన భద్రతామండలిలో శాశ్విత సభ్యత్వం అన్న ఊసే లేదు. దీనిపై పదేళ్ల కిందట మాట్లాడటం తర్వాత.. కనీసం ప్రస్తావించటమే గొప్పగా ఉండేది.

తర్వాత.. తర్వాత రోజులు మారి కాస్త మాట్లాడటం మొదలుపెట్టారు. తాజాగా ప్రధాని మోడీ మాత్రం అందుకు భిన్నంగా గళం విప్పారు. ప్రపంచ జనాభాలో భారీగా ఉండే భారతీయులు ప్రాతినిధ్యం లేని భద్రతా మండలి ఏమిటి? అయినా.. భద్రతా మండలిలో శాశ్విత సభ్యత్వం కోసం అడుక్కోవాల్సిన అవసరమే లేదు.. ఇది భారత్‌ హక్కు అంటూ నినదించారు.

ఈ మాత్రం తెగువుగా మాట్లాడే నేతలే భారత్‌కు ఇప్పటివరకూ లేరు. భద్రతా మండలిలో శాశ్విత సభ్యత్వం కోసం ఆయన తన వాదనను సూటిగా చెప్పేశారు. ''ఇండియా అడుక్కునే రోజులు పోయాయి. మా హక్కులను మేం డిమాండ్‌ చేస్తున్నాం. బుద్ధ భగవానుడు.. మహాత్మగాంధీ నడిచిన భారతభూమికి భద్రతా మండలిలో స్థానం ఇవ్వాలని కోరుతున్నా'' అని అడిగేశారు.

ప్రపంచంలో శాంతి విస్తరించాలంటే భారత్‌ లాంటి దేశానికి ప్రాతినిధ్యం తప్పనిసరిగా ఉండాలన్న విషయాన్ని స్పష్టంగా చెప్పిన మోడీ.. మొదటి.. రెండో ప్రపంచ యుద్ధాల్లో భారత్‌కు సంబంధం లేకున్నా.. భారతదేశానికి చెందిన 14 లక్షల మంది పాల్గన్నారని.. వారంతా ఇతర దేశాల కోసం పోరాడారన్న విషయాన్ని గుర్తు చేశారు. ఇంతకాలం అనుసరించిన అడుక్కునే విధానానికి పూర్తి భిన్నంగా గళం విప్పిన మోడీ.. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్విత సభ్యత్వాన్నిఇప్పించటంలో సక్సెస్‌ అవుతారో లేదో చూడాలి. మాటలు ఎలా ఉన్నా పని జరిగినప్పుడే మాటలకు ఎంత పవర్‌ ఉందో అర్థమవుతుంది.
Tags:    

Similar News