18కోట్ల మందికి మెత్తమెత్తగా వడ్డిస్తున్న మోడీ!

Update: 2017-08-01 04:37 GMT
కేంద్రంలో తమ బలం పెరిగే కొద్దీ... మోడీ సర్కారు విశ్వరూపం చూపించడం మొదలవుతుందని... దేశ పురోగతి ముసుగులో ప్రజలకు భారం కాగల అనేక నిర్ణయాలు రావచ్చునని కొన్నాళ్లుగా ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో నితీశ్ కుమార్ పార్టీ కూడా ఎన్డీయేలో చేరిపోవడం.. రాజ్యసభలో కూడా కూటమికి బలం పెరగబోతూ ఉన్న తరుణంలో మోడీ సర్కారు క్రమక్రమంగా తమ అసలురూపు బయటపెడుతోంది. పైకి చిన్నదిగా కనిపిస్తున్నా.. క్రమంగా మధ్యతరగతి వారికి భారం కాగల నిర్ణయానిన మోడీ సర్కారు సోమవారం తీసుకున్నది. అంతో ఇంతో కులమతాల గీతల ప్రకారం కాకుండా.. దేశ ప్రజలందరికీ సమానంగా కేంద్రప్రభుత్వం అందించే ఒకే ఒక రాయితీ... వంటగ్యాస్ మీద ఇచ్చే రాయితీనే. ఇప్పుడు దానికి కూడా చెక్ పెట్టారు. నెలనెలా నాలుగు రూపాయల వంతున ధర పెంచుకుంటూ.. కొన్నాళ్లకు అసలు రాయితీ అంటూ లేకుండా చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.

దేశంలో అర్హత ఉన్న ప్రతి కుటుంబమూ కేంద్రం నుంచి పొందుతున్న ఒకే ఒక రాయితీ వంట గ్యాస్ కు సంబంధించినదే. సామాన్యుడికి దీనివల్ల కలిగే ప్రయోజనం లేదా భారం చిన్నదిగానే కనిపించినప్పటికీ... దేశవ్యాప్తంగా దాదాపు 18 కోట్లమందికి పైగా వినియోగదారులు పొందే రాయితీ రద్దయితే కేంద్రానికి మిగిలే లాభం చాలానే ఉంటుంది. దేశ ప్రజలకు లాభం కలిగించే ఈ రాయితీ విషయంలో తొలినుంచి మోడీ సర్కారు అనేక నాటకాలు ఆడుతోంది. గుట్టుచప్పుడు కాకుండా.. గ్యాస్ ధరను తక్కువ మొత్తాల్లో పెంచడం ప్రారంభించారు. ఆ తర్వాత.. గ్యాస్ రాయితీ వదులుకోండి.. అంటూ ఓ ఉద్యమం ప్రారంబించారు. ఆ రకంగా రాయితీకి కత్తెరలు వేశారు. మద్యలో రాయితీ లేకుండా పూర్తి ధర ఇచ్చి కొనుగోలు చేసుకోవడం అలవాటు చేస్తూ.. రాయితీ మొత్తాన్ని వినియోగదార్ల బ్యాంకు ఖాతాల్లో తిరిగి జమచేయడం ప్రారంభించారు. తీరా ఇప్పుడు రాయితీ రద్దు అనే వరకూ  కూడా ప్రభుత్వం వచ్చేసింది.

వంటగ్యాస్ విషయంలో ప్రజలకు దక్కే రాయితీమీద ప్రభుత్వం కన్నేయడం ఇప్పుడు కొత్త విషయం కాదు. ఇప్పటికే రకరకాలుగా దీనిలో మెలికలు పెట్టారు. ఏడాదికి 12 సిలిండర్లు మాత్రమే రాయితీ ధరతో పొందవచ్చునని, అంతకుమించి సిలిండర్లు తీసుకునే వారు.. పూర్తి ధర చెల్లించాల్సిందేనని కూడా మధ్యలో కొన్ని నిబంధనలు వచ్చాయి. అనేక రకాల ప్రయోగాలు చేసిన తర్వాత.. ఇన్నాళ్లకు కేంద్రం పూర్తి స్థాయిలో రాయితీని ఎత్తివేయడానికే నిర్ణయించుకుంది. మోడీ సర్కారుకు పార్లమెంటులో అటు రాజ్యసభలో కూడా క్రమంగా బలం పెరుగుతోంది. ఇక తాము ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదనుకున్నారో.. లేదా, ఎన్నికల్లోగా.. ప్రజాకర్షక పథకాలు వేరే తెచ్చే ఆలోచన ఉందో గానీ.. ఇప్పుడు ఇలా ప్రజల నడ్డివిరిచే నిర్ణయాలు తీసుకుంటున్నారు.
Tags:    

Similar News