స్టార్ హోట‌ల్ల‌లో ఉండ‌ద్దు..ఆ కార్ల‌లో తిర‌గ‌ద్దుఃమోడీ

Update: 2017-08-20 05:52 GMT
ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర మోడీ మరోమారు తన మంత్రులకు స్పష్టమైన ఘాటు హెచ్చరికలు చేశారు. సింప్లిసిటీ పాటించ‌డంతో పాటు ప్ర‌జాధ‌నాన్ని దుర్వినియోగం చేయ‌కుండా ఉండ‌టంలో ముందుండే మోడీజీ త‌న మంత్రులు సైతం ఇదే దారిలో న‌డ‌వాల‌ని స్ప‌ష్టం చేశారు. ఫైవ్ స్టార్ హోట‌ల్ల‌లో బ‌స చేయ‌డం - ప్ర‌భుత్వ ప‌రిధిలోని ప‌బ్లిక్ సెక్టార్ యూనిట్లకు సంబంధించిన వ‌స‌తుల‌ను దుర్వినియోగం చేయ‌వ‌ద్ద‌ని ఆదేశించారు. ఇటీవ‌ల జ‌రిగిన కేబినెట్ స‌మావేశం సంద‌ర్భంగా మంత్రులందరికీ గ‌ట్టిగా తలంటిన‌ట్లు స‌మాచారం.

కేబినెట్ స‌మావేశం ముగిసిన అనంత‌రం మంత్రులంద‌రినీ వేచి ఉండాల‌ని కోరిన ప్ర‌ధాని ఈ సంద‌ర్భంగా అమాత్యుల్లో కొంద‌రి ప‌ట్ల త‌న‌కు తీవ్ర అసంతృప్తి ఉందని తెలిపిన‌ట్లు స‌మాచారం. ఆయా రాష్ర్టాల ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌భుత్వ వ‌స‌తి గృహాల్లో ఉండాల‌ని కోరిన‌ప్ప‌టికీ ఆ మాట పెడిచెవిన పెడుతూ ఫైవ్ స్టార్ హోట‌ల్ల‌లో బ‌స చేస్తున్నార‌ని అస‌హ‌నం వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. ఫైవ్ స్టార్ హోట‌ల్ల‌లో క‌ల్పించే వ‌స‌తుల మోజుకు ఆక‌ర్షితులై అక్క‌డ విడిది చేస్తున్నార‌ని ప్ర‌భుత్వం త‌ర‌ఫున క‌ల్పించే అధికారిక వ‌స‌తుల‌ను ప‌క్క‌న‌పెడుతున్నార‌ని ఆక్షేపించారని తెలుస్తోంది. ఈ సంద‌ర్భంగా మంత్రుల వాహ‌నాల వాడ‌కంపై కూడా మోడీజీ మండిప‌డిన‌ట్లు టైమ్స్ ఆఫ్ మీడియా క‌థ‌నం వెలువ‌రించింది. ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు (పీఎస్‌ యూ)ల‌కు చెందిన వాహ‌నాల‌ను మంత్రులు, వారి కుటుంబ స‌భ్యులు ఉప‌యోగించ‌డం స‌రికాద‌ని ప్ర‌ధాని స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇలాంటి చ‌ర్య‌లు ఉపేక్షించేది లేద‌ని ఆయ‌న తేల్చిచెప్పిన‌ట్లు స‌మాచారం.

ఈ సంద‌ర్భంగా రాబోయే ఎన్నిక‌లను ఏ విధంగా బీజేపీ ఎదుర్కోనుంద‌నే విష‌యాన్ని కూడా మంత్రి వ‌ర్గ స‌హ‌చ‌రుల‌కు మోడీజీ స్ప‌ష్టం చేసిన‌ట్లు తెలుస్తోంది. `అవినీతి ర‌హిత ప్ర‌భుత్వం` అనే నినాదంతో 2019 ఎన్నిక‌ల‌ను ఎదుర్కోనున్న‌ట్లు ప్ర‌ధాని మోడీ తెలిపారు. అందుకే అవినీతి మ‌ర‌క అంట‌కుండా మంత్రులు ఉండాల‌ని ఆయ‌న స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం. ఎలాంటి ప్ర‌లోభాల‌కు లోనుకాకుండా మంత్రులు వ్య‌వ‌హ‌రించాల‌ని స్ప‌ష్టం చేసిన మోడీజీ ఈ విష‌యంలో ఎవ‌రినీ ఉపేక్షించేది లేద‌ని చెప్పిన‌ట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News